సన్న్యాసి అంటే...

ABN , First Publish Date - 2021-01-29T07:00:28+05:30 IST

పని వదిలిపెట్టడం కాదు, పని మీద తాపత్రయం, ఆందోళన మీద దృష్టి పెట్టకు. తాపత్రయం వదిలిపెట్టు. ఆందోళన వదిలిపెట్టు. పని వదిలిపెట్టకు. తాపత్రయం, ఆందోళన మీద దృష్టి ఉండకూడదంటే ఫలితం

సన్న్యాసి అంటే...

పని వదిలిపెట్టడం కాదు, పని మీద తాపత్రయం, ఆందోళన మీద దృష్టి పెట్టకు. తాపత్రయం వదిలిపెట్టు. ఆందోళన వదిలిపెట్టు. పని వదిలిపెట్టకు. తాపత్రయం, ఆందోళన మీద దృష్టి ఉండకూడదంటే ఫలితం మీద దృష్టి ఉండకూడదు. సన్యాసి అంటే ఎవరో భగవద్గీత ఐదో అధ్యాయం కర్మసన్న్యాసయోగంలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు. సన్న్యాసం గురించి అర్జునుడికి కూడా సందేహం వచ్చింది. 


సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి

యచ్ర్ఛేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్‌


ఓ కృష్ణపరమాత్మా! ‘‘ఒకసారి సన్న్యాసం అంటావు. మరోసారి కర్మయోగం అంటావు. ఈ రెండింటిలో ఏది గొప్పదో చెప్పు!’’ అని అడిగాడు.


అప్పుడు శ్రీకృష్ణపరమాత్మ...

సన్న్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయస కరావుభౌ

తయోస్తు కర్మసన్న్యాసాత్‌ కర్మయోగో విశిష్యతే


‘‘అర్జునా! కర్మసన్న్యాసం, కర్మయోగం రెండింటి మధ్య సూక్ష్మమైన తేడా ఉంది. ఈ రెండింటిలో కర్మయోగమే శ్రేష్ఠమైనది’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.


జ్ఞేయః స నిత్యసన్న్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్‌ ప్రముచ్చతే


వచ్చిన దాన్ని ఎవడు తిరస్కరించడో, రాని దాన్ని ఎవడు కోరడో వాడు నిజమైన సన్న్యాసి. వచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించాలి. రాని ఉద్యోగం గురించి ఆలోచిస్తూ, వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకూడదు. ఎప్పుడూ అన్నీ అందరికీ నచ్చవు. ‘నచ్చడం’ అనేది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ఆ మనస్సు అనేది మిథ్య. వస్తే మంచిది. రాకపోతే బాధలేదు. వచ్చిన వాళ్ల కోసం తలుపు తీయాలి. ఎవరు రావడం లేదని తలుపులు తీసి, గుమ్మంలో కూర్చోవడం వెర్రి తాపత్రయం అవుతుంది. ప్రజ్ఞావంతుడు అయిన వాడు తలుపు తట్టిన అవకాశాన్ని వదులుకోడు. రాని అవకాశం గురించి తాపత్రయ పడడు. ‘ఇది సుఖం, దుఃఖం’ అని భేద భావాలు లేని వాడు సన్న్యాసి. అన్ని బంధాల నుంచి విముక్తి అయినవాడు సన్న్యాసి. 


 గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-01-29T07:00:28+05:30 IST