తత్త్వం తెలుసుకోవాలి!

ABN , First Publish Date - 2021-03-19T05:30:00+05:30 IST

భగవద్గీత ఒక అధ్యాయం చదవడం కన్నా, రోజూ చదవడం కన్నా దాని తత్త్వం గ్రహించడం ముఖ్యం. కొన్ని లక్షల మంది బైపిసి సబ్జెక్టును ఎంచుకుని చదువుతున్నారు

తత్త్వం తెలుసుకోవాలి!

భగవద్గీత ఒక అధ్యాయం చదవడం కన్నా, రోజూ చదవడం కన్నా దాని తత్త్వం గ్రహించడం ముఖ్యం. కొన్ని లక్షల మంది బైపిసి సబ్జెక్టును ఎంచుకుని చదువుతున్నారు. మరి అందులో ఒక్కరైనా జగదీష్‌ చంద్రబోస్‌ అంతటి శాస్త్రవేత్త అయ్యారా? ఎందుకని ఆయన తరువాత ఒక్కరూ కూడా అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శాస్త్రవేత్త కాలేకపోయారు? అంటే సాంబారులో తెడ్డులా తిరుగుతున్నారు. నాలుకలా రుచి తెలుసుకునే జ్ఞానం సంపాదించలేకపోతున్నారు. తెడ్డు సాంబారులో ఎంత సేపు ఉన్నా దాని రుచి తెడ్డుకు తెలియదు. రుచి చూడాల్సింది నాలుకే. ఈ విషయం గురించి మారద వెంకయ్య రాసిన భాస్కర శతకంలోని ఒక పద్యం ద్వారా తెలుసుకుందాం.


ఎడ్లెమనుష్యుడే మెఱుగు నెన్ని దినంబులుగూడియుండినన్‌

దొడ్డ గుణాఢ్యునందుగల తోరవు వర్తనలెల్లబ్రజ్ఞ బే

ర్పడ్డ వివేకరీతి రుచిపాకము నాలుక గాకెఱుంగునే?

తెడ్దది కూరలో గలయద్రిమ్మరుచుండిననైన భాస్కరా


సాంబారులో తెడ్డులా తిరుగుతూ ఉండటం కాదు. నాలుకలా రుచిని గ్రహించాలి. తత్త్వాన్ని గ్రహించాలి. భగవద్గీత చదివినా, సుందరకాండ చదివినా అందులో తత్త్వాన్ని గ్రహించాలి. అంతేతప్ప ఏ అధ్యాయం ప్రధానం? రోజు ఎన్ని శ్లోకాలు చదవాలి? ఈ లెక్కలు పెట్టుకోకూడదు. 


గరికిపాటి నరసింహారావు

Updated Date - 2021-03-19T05:30:00+05:30 IST