సోలోగానే చలో చలో..

ABN , First Publish Date - 2021-01-24T17:10:03+05:30 IST

గుప్పెడంత పిట్ట... రెక్కలతో ఆకాశాన్ని లెక్కచేయదు. ఎగురుతూనే ఉంటుంది.

సోలోగానే చలో చలో..

గుప్పెడంత పిట్ట... రెక్కలతో ఆకాశాన్ని లెక్కచేయదు. ఎగురుతూనే ఉంటుంది. ఎక్కడ వాలుతుందో తెలీదు. గమ్యం ఏమిటో అర్థం కాదు. ప్రపంచమంతా తనదే! సరిహద్దుల్లేవు. దేశాలు... మనుషులు... వింతలు... విశేషాలు.. భిన్నమైన రుచులు.. విహరించడమే జీవితం. ఆ గుప్పెడంత పిట్ట గరిమాభక్షి. పట్టుమని ఐదు అడుగులు కూడా లేదు. ఈ మధ్యనే పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థిలా ఉంటుంది. ఇప్పుడు తనకు ఇరవై ఏళ్లు నిండాయి. ఆఫ్రికాలో నరమానవుడు సంచరించని అడవుల్లోని రహదారిపై ట్రక్కు డ్రైవర్లను లిఫ్టు అడుగుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో పెడుతుంది. కెన్యాలోని అగ్నిపర్వతంపై నడుస్తూ ట్విట్టర్‌లో ఒక పోస్టు పెడుతుంది. ఈ అమ్మాయి జీవితమే ప్రత్యేకం, సాహసం. తను అలుపెరుగని ఒంటరి పర్యాటకురాలు.. 


‘‘ప్రపంచమంతా నాకు ఇల్లులాగే అనిపిస్తుంది. భయం లేదు. ఎదుటివాళ్ల ఆత్మీయులం కావాలంటే ఒక్క చిరునవ్వు చాలు. అక్కున చేర్చుకుంటారు. ఏ ఇబ్బంది వచ్చినా సహాయం అందిస్తున్నారు. అయితే ఈ మధ్య ఉగాండా వెళ్లినప్పుడు అక్కడున్న అవినీతి మాత్రం ఇబ్బంది పెట్టింది. భరించలేకపోయా. నాకు మారుమూల గిరిజన ప్రాంతాలు అంటే ఇష్టం. వాళ్లను చూస్తే నాకు మానవ చరిత్ర గుర్తుకువస్తుంది. ఆహారపు అలవాట్లు, వ్యక్తిత్వం, మనస్తత్వాలలో మనకు ఆఫ్రికన్లకు ఎంతో సారూప్యత ఉంది...’’


గరిమాభక్షి షావుకార్ల ఇంట్లో పుట్టలేదు. గడ్డి చేలో బతికే చిన్న రైతు కుటుంబంలో పుట్టింది.. తనది హర్యానాలోని పల్లెటూరు. చదువు పూర్తవ్వగానే చిన్నాచితక ఉద్యోగాలు చేసింది. ఒక్క చోట కుదురుగా లేదు. సొంతూర్లో పొలానికి వెళ్లినప్పుడు ఆ పూలు, ఆకాశం, మేఘాలు, పంటలు... తూనీగలు.. సీతాకోక చిలుకలు.. ఎన్ని రంగులు... ఎన్ని ఊసులు. రంగురంగుల జీవితాన్ని కలలు కంది. ఆ రమణీయ దృశ్యాలను కాన్వాస్‌పైన చిత్రించేది. లేత రంగులు అద్దేది. నువ్వు గొప్ప ఆర్టిస్టువు అవుతావు... అని ఎవరైనా అంటే చాలు.  భుజాలను పైకెగరేసి, సిగ్గుతో తలను వొంపులు తిప్పుతూ... నవ్వుతుందంతే! రకరకాల పెయింటింగ్స్‌ వేసింది. అందరి దృష్టిలో అదొక కళ. తనకు మాత్రం అదొక కల. ఆ రంగుల దృశ్యాలను తనివితీరా చూస్తూ... లోకమంతా తిరగాలన్నది తన లక్ష్యం. ఒక రోజు ఇంట్లో వాళ్లకు చెప్పింది. ‘నేను ఒక్కదాన్నే ప్రపంచమంతా తిరుగుతా. మీరేమీ బెంగపెట్టుకోవద్దు. నాకు ధైర్యం ఉంది. అపాయాలు వస్తే తప్పించుకునే నేర్పు ఉంది. ఎక్కడైనా పట్టెడు అన్నం అడిగి తినే లౌక్యం ఉంది’ అంటూ ఒక చిన్న బ్యాగును వీపునకు తగిలించుకుని.. రెండు జతల బట్టలు పెట్టుకుని బయలుదేరింది. ఓ వంద రూపాయల  నెక్‌లెస్‌ టీషర్టు, నెల రోజులు వేసుకున్నా ఉతుక్కోవాల్సిన అవసరం లేని జీన్సు ప్యాంటు.. అవే లగేజీ. తనవాళ్లందరికీ తను నిత్యం టచ్‌లో ఉండేది సోషల్‌మీడియాలోనే. ఏ దేశం వెళ్లినా... యూట్యూబ్‌లో ఒక వీడియో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్టు చేస్తుంది. ఆ ప్రాంతం గురించి కొంత సమాచారం రాస్తుంది. 


ఇరవైఏళ్ల పిల్లవు.. అదీ ఒంటరిగా వెళ్లడం క్షేమమా? అనడిగితే ‘నేను తిరుగుతూనే ఉన్నాను. ఇప్పటి వరకు ఎంతోమంది సహాయపడ్డారు. ఒక్కరు కూడా నాకు ఇబ్బంది కలిగించలేదు’ అంటుందా అమ్మాయి. పరదేశస్తులు ఆ అమ్మాయి ఽధైర్యం, తెలివితేటలు, చురుకుదనం చూసి ముచ్చట పడతారు. కాసేపు ఆగి మాట్లాడతారు. అవసరమైన సహాయం చేస్తారు. ముందు గోవాతో మొదలెట్టి ఒడిశాలోని గిరిజన ప్రాంతాల్లో పర్యటించింది గరిమా. అక్కడి ప్రజల జీవనశైలి, సంస్కృతి, సంప్రదాయాలు, ఆహారం... వీటన్నిటినీ పరిశీలించింది. వాళ్లలో తనూ ఒక్కరై కలిసిపోయింది. శ్రీలంకలో అత్యంత సున్నితమైన ప్రాంతం జాఫ్నా సైతం వెళ్లొచ్చింది గరిమా. ఎక్కడికెళ్లినా ఒక్కతే వెళ్లడం ఆమెకు నచ్చిన వ్యాపకం. ఒక చిన్న బ్యాగు, సెల్‌ఫోను మాత్రమే చేతిలో ఉంటాయి. ఈ మధ్య ఆఫ్రికా వెళ్లింది. భూమధ్యరేఖ ప్రాంతాన్ని సందర్శించింది. కెన్యా, నైరోబీ, టాంజానియా... ఇలా చాలా దేశాల్లో తిరుగుతోందిప్పుడు. ఎక్కడికెళ్లినా భారతీయులు తారసపడుతున్నారంటూ ఆనందం వ్యక్తం చేస్తోందామె. ‘మా ఊర్లో ఉంటే ఇన్నేసి జ్ఞాపకాలు ఉండేవి కావు. ఇప్పుడు నేను ఏ దేశం వెళ్లినా ఏదో ఒక సంఘటన గుర్తుండిపోతోంది. ఆ సమయాన్ని ఎంతో ఆనందిస్తున్నాను. టాంజానియాలో అయితే సుమారు 1100 కిలోమీటర్లు ట్రక్కుల్లో ప్రయాణించాను. ఐదు రోజులు పట్టింది. కొన్నిసార్లు కోకాకోలా ట్రక్కుల్లో కూడా ప్రయాణించా..’ అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - 2021-01-24T17:10:03+05:30 IST