మరికొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే ఇలా జరిగింది..

ABN , First Publish Date - 2022-01-22T16:18:13+05:30 IST

కొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి. ఘనంగా చేయాలని అనుకున్నారు. అందుకు అవసరమైన నగదు, బంగారాన్ని సమకూర్చుకున్నారు. కానీ, గ్యాస్‌ సిలిండర్లు పేలి గుడిసెలు కాలిపోవడంతో

మరికొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి..అంతలోనే ఇలా జరిగింది..

గ్యాస్‌ సిలిండర్లు పేలి గుడిసెలు దగ్ధం

మంటల్లో కాలిపోయిన 3.5 లక్షల నగదు, 20 గ్రాముల బంగారం


హైదరాబాద్/బేగంపేట: కొద్ది రోజుల్లో కుమార్తె పెళ్లి. ఘనంగా చేయాలని అనుకున్నారు. అందుకు అవసరమైన నగదు, బంగారాన్ని సమకూర్చుకున్నారు. కానీ, గ్యాస్‌ సిలిండర్లు పేలి గుడిసెలు కాలిపోవడంతో నగదు, బంగారంతోపాటు నూతన వస్తువులు, వస్త్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సంఘటన బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌లో శుక్రవారం జరిగింది. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన కనక, రాజు దంపతులతోపాటు మంజుల, సాంబయ్య దంపతులు ప్రకాశ్‌నగర్‌లోని ఖాళీ స్థలంలో రేకులతో పక్కపక్కనే గుడిసెలను వేసుకుని, కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. శుక్రవారం ఉదయం 10గంటలకు వారు పనుల్లోకి వెళ్లగా 12.30 గంటల ప్రాంతంలో రెండు గుడిసెల్లోని సిలిండర్లు పేలాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వారు వచ్చేలోపే రెండు గుడిసెలు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. విషయం తెలిసి ఇరు కుటుంబాల సభ్యులు వచ్చి బోరున విలపించారు. 


కుమార్తె పెళ్లికోసం దాచిన 3.5లక్షల నగదు, 20 గ్రాముల బంగారం, వస్తువులు, వస్త్రాలు బూడిదగా మిగలడంతో కనక, రాజు దంపతులు రోదించారు. బాలానగర్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ కృష్ణయ్య, టీఆర్‌ఎస్‌ నేతలు టి.శ్రీహరి, గోవిందరావు, కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అయితే వారు వంట పూర్తయిన తర్వాత గ్యాస్‌ ఆపక పోవడంతో లీకై ఉంటుందని, ఇంట్లో దేవుడి పటంవద్ద దీపం వెలుగుతుండడంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు.   గుడిసెలు కాలిపోయి ఇంట్లో వస్తువులు బూడిదగా మారడంతో రోడ్డున పడ్డ వారిని ఆదుకునేందుకు బేగంపేట కార్పొరేటర్‌ మహేశ్వరి తనవంతు సాయంగా రూ.5వేల చొప్పున ఇరు కుటుంబాలకు నగదును అందజేశారు. 

Updated Date - 2022-01-22T16:18:13+05:30 IST