రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు

ABN , First Publish Date - 2022-08-20T05:19:23+05:30 IST

రేషన్‌షాపుల్లో కూడా గ్యాస్‌ సిలిండర్ల అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం గ్యాస్‌పై ఉన్న సబ్సిడీని తొలగించడంతో ప్రస్తుతం 14.5 కిలోల సిలిండరు రూ.1098 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది.

రేషన్‌ షాపుల్లో గ్యాస్‌ సిలిండర్లు

డీలర్ల ద్వారా 5.3  కిలోలవి అమ్మకం

విధివిధానాలు వచ్చినవెంటనే అమలు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 19 :  రేషన్‌షాపుల్లో కూడా గ్యాస్‌ సిలిండర్ల అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం గ్యాస్‌పై ఉన్న సబ్సిడీని తొలగించడంతో ప్రస్తుతం 14.5 కిలోల సిలిండరు రూ.1098 పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తోంది. గత ఎనిమిదేళ్ల కాలంలో క్రమంగా గ్యాస్‌ ధరలు పెంచుతూ వచ్చిన కేంద్రం గతంలో సిలిండర్‌పై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది. దీంతో ఆ భారమంతా ప్రజానీకంపై పడింది. గ్యాస్‌ను వినియోగించాలంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తక్కువ తూకం ఉండే సిలిండర్లను రేషన్‌ షాపుల ద్వారా విక్రయించేందుకు చర్యలు చేపట్టింది. అందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చింది. మార్గదర్శకాలను ఇంకా జారీ చేయలేదు. కొత్తగా అమలులోకి రానున్న గ్యాస్‌ విధానం ద్వారా చిన్న గ్యాస్‌ సిలిండర్లను రేషన్‌ షాపుల్లో అందుబాటులోకి తేనున్నారు. ఈ చిన్న సిలిండర్లలో 5.3 కిలోల గ్యాస్‌ ఉంటుంది. అయితే వీటిని కమర్షియల్‌ కింద ఇస్తారా, ఎంత ధర, రేషన్‌ డీలర్లకు కమిషన్‌ ఎలా వంటి వాటిపై ఇంకా స్పష్టత రాలేదు. 


ప్రజలపై భారం మోపేందుకే ఈ విధానం

సామాన్యులపై అధిక భారాన్ని మోపేందుకే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయాలకు శ్రీకారం చుట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రస్తుతం 14.5 కిలోల సిలిండర్‌ రూ.1098కు లభిస్తుండగా చిన్న సిలిండర్లను అధిక ధరలకు విక్రయించే అవకాశాలు ఉన్నాయని ఇందులో అనుభవం ఉన్నవారు చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కమర్షియల్‌ సిలిండర్‌ రూ.2వేల వరకు ఉండగా ఆ ధరకు అనుగుణంగా విక్రయిస్తారనే అనుమానాలు ఉన్నాయి. 



ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాలి

శ్యామ్‌కుమార్‌, డీఎస్‌వో 

ప్రభుత్వం నుంచి విధివిధానాలు రావాల్సి ఉంది. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే చిన్న సిలిండర్ల విక్రయాలకు శ్రీకారం చుడతాం. చిన్న సిలిండర్లను ఎన్ని రేషన్‌షాపులకు ఇవ్వాలి తదితర అంశాలన్నింటినీ పరిశీలించిన తర్వాత చర్యలు తీసుకుంటాం. 


Updated Date - 2022-08-20T05:19:23+05:30 IST