భద్రత ‘గ్యాస్‌’

ABN , First Publish Date - 2021-11-17T06:37:33+05:30 IST

నిషేధిత వస్తువులను రైల్లో తీసుకువెళ్లడం చట్టప్రకారం నేరం.

భద్రత ‘గ్యాస్‌’
గ్యాస్‌ సిలిండర్లను బోగీలోకి ఎక్కిస్తున్న వ్యక్తి

గాల్లో రైల్వే ప్రయాణికుల ప్రాణాలు 

రైలు బోగీల్లో సిలిండర్ల అక్రమ రవాణా

వాటర్‌ బాటిల్స్‌, నిత్యావసరాలు కూడా.. 

విజయవాడ స్టేషన్‌ కేంద్రంగా దందా

కమర్షియల్‌ విభాగాధికారి అండతోనే!

కేసు నమోదు చేస్తే సిబ్బందికి వార్నింగ్‌లు 

గ్యాంగ్‌ లీడర్‌ గుప్పెట్లో రైల్వేస్టేషన్‌

‘ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో వెల్లడి


నిషేధిత వస్తువులను రైల్లో తీసుకువెళ్లడం చట్టప్రకారం నేరం. చట్టాన్ని చుట్ట చుట్టి తుంగలో తొక్కేసి, నేరానికి పాల్పడుతున్నారు విజయవాడ రైల్వేస్టేషన్లోని కొందరు కమర్షియల్‌ విభాగాధికారులు.  రైళ్లలో ప్రమాదకర వంటగ్యాస్‌ సిలిండర్లను అక్రమంగా తరలిస్తున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ బృందం అక్రమ రవాణాపై పరిశీలన పెట్టింది. ప్రయాణికుల బోగీల ద్వారా, రైల్వే కమర్షియల్‌ విభాగంలోని కొందరు అధికారుల వత్తాసుతో ఈ అనధికార దందా సాగుతోందని గుర్తించింది. ఈ సిలిండర్ల కారణంగా జరగరానిది జరిగితే ఒక్క బోగీయే కాదు.. మొత్తం రైలు బూడిదైపోతుంది. ఇంతటి ప్రమాదకర దందాకు పాల్పడుతున్న కమర్షియల్‌ విభాగంలోని అధికారులు, సిబ్బందిపై రైల్వే బోర్డు సమగ్ర విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణికుల రైళ్లలో గ్యాస్‌ సిలిండర్ల రవాణా జరుగుతోంది. రైళ్లలో నిషేధిత వస్తువులను రవాణా చేస్తే కేసులు నమోదు చేసే సిబ్బంది కంటికి ఇది కనిపించకపోవడం విచిత్రం. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే చెకింగ్‌ స్టాఫ్‌ వాటిని పట్టుకుంటే, వదిలేయాలంటూ ఓ అధికారే ఫోన్‌ చేసి ఆదేశిస్తున్నారంటే ఈ దందా మాటున ఎంత పెద్ద తలలున్నాయో అర్థమవుతోంది. కమర్షియల్‌ సిబ్బంది కేసులు నమోదు చేస్తే, వెంటనే ఆ అధికారి నుంచి ఫోన్‌ వస్తుంది. దీంతో వారు కేసులు రాయటానికే భయపడిపోతున్నారు. బోగీల్లో గ్యాస్‌ సిలిండర్లను తరలిస్తున్నారంటూ ప్రయాణికుల నుంచి కమర్షియల్‌ సిబ్బందికి ఫిర్యాదులు వస్తున్నాయి. కేసు నమోదు చేస్తే, ఒక తంటా, చేయకపోతే మరో తంటా అన్నట్టుంది కమర్షియల్‌ స్టాఫ్‌ పరిస్థితి. సిలిండర్ల రవాణా దందా వెనుక ఉన్న అధికారి కమర్షియల్‌ స్టాఫ్‌నే కాకుండా, ఆర్పీఎఫ్‌, విజిలెన్స్‌, ఇతర పరిశీలన సంస్థలను కూడా మేనేజ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రైల్వేకు సంబంధించిన ఏ వ్యవస్థ కూడా గ్యాస్‌ సిలిండర్ల అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయటం లేదు. 


అక్రమ రవాణా ఇలా...

గ్యాస్‌ సిలిండర్ల రవాణా అంతా విజయవాడ రైల్వే స్టేషన్‌ కేంద్రంగానే జరుగుతుంది. దశాబ్దాల తరబడి కమర్షియల్‌ విభాగం అధికారుల అండదండలతో ఇక్కడ పాతుకుపోయిన ఓ గ్యాంగ్‌ గ్యాస్‌ సిలిండర్ల అక్రమ రవాణాకు తెరతీసింది. రైళ్లలో ఏదైనా రవాణా జరగాలంటే ముందుగా పార్శిల్‌ ఆఫీసులో బుక్‌ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆ వస్తువులు, లేదా సరుకును ప్రత్యేకమైన లాగుడుబళ్ల ద్వారా ప్లాట్‌ఫామ్స్‌కు చేర్చి, సంబంధిత రైలు బోగీల్లో లోడ్‌ చేస్తారు. గ్యాస్‌ సిలిండర్ల రవాణా అక్రమంగా జరుగుతోంది. ఎవరి అనుమతులు లేకుండానే పార్శిల్‌ ఆఫీసు ఎదురుగా ఉన్న వాహనాల పార్కింగ్‌ స్టాండ్‌ నుంచి ఈ దందా మొదలవుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ బృందం ఈ అక్రమ రవాణా ప్రారంభం నుంచి లోడింగ్‌ వరకు రాకెట్‌ను ఫాలో అయింది. పార్శిల్‌ ఆఫీసు ఎదురుగా ఈ దందాకు జరుగుతున్నా, పార్శిల్స్‌ అధికారులు, కమర్షియల్‌ సిబ్బంది, ఇతర పరిశీలన సంస్థలు ఏమీ చేయలేకపోతున్నాయి. 


ఈ రెండు పాయింట్ల నుంచే..

పార్కింగ్‌ స్టాండ్‌ నుంచి గ్యాస్‌ సిలిండర్లను, నిత్యావసరాలను, ఖాళీగా ఉన్న ఐఆర్‌సీటీసీ ఫుడ్‌ ప్లాజా నుంచి వాటర్‌ బాటిల్స్‌ను, ఇతర నిత్యావసరాలను, కూరగాయలను తరలిస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలను అనధికారికంగా ఈ రాకెట్‌ ఉపయోగించుకుంటున్నా, సంబంధిత పార్కింగ్‌ నిర్వాహకుడు, ఐఆర్‌సీటీసీ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరించడం సందేహాలకు తావిస్తోంది. రైల్వేస్టేషన్‌ ప్రాంగణంలో చిన్న జాగాలో ఏమైనా పెట్టుకోవాలన్నా అద్దె చెల్లించాల్సిందే. అలాంటిది ఎటువంటి అద్దె చెల్లించకుండానే.. వేరే వారి జాగాలను ఎలా ఉపయోగించుకుంటున్నారు? అనే ప్రశ్న తలెత్తుతోంది. ‘ఆంధ్రజ్యోతి’ ఈ దృశ్యాలను క్లిక్‌ మనిపించింది. ఈ రాకెట్‌కు అనుమతులు లేకపోయినప్పటికీ పార్శిల్‌ ఆఫీసుకు సంబంధించిన లాగుడు బళ్లపై గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాలు, కూరగాయలు, కోడిగుడ్లు వంటివి నేరుగా ప్లాట్‌ఫామ్‌ల మీదకు వచ్చేస్తున్నాయి. రాకెట్‌కు సంబంధించిన వ్యక్తులు వీటిని ఫాలో అవుతుంటారు. ప్లాట్‌ఫామ్‌లకు వచ్చే ప్యాంట్రీ కోచ్‌ రైళ్లకు వీటిని అనఽధికారికంగా చేరవేస్తారు. ప్యాంట్రీలోకి అనుమతించదగిన వాటిని డంప్‌ చేసి... ప్రయాణికుల బోగీల్లోకి గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాలు, కోడిగుడ్లు వంటివి చేరవేస్తున్నారు. నిత్యావసరాల రవాణా కూడా తప్పే. అయితే అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే గ్యాస్‌ సిలిండర్లను ఎక్కించటం ఘోరమైన నేరం. ఇలా ప్రతిరోజూ ఈ గ్యాంగ్‌ యథేచ్ఛగా గ్యాస్‌ సిలిండర్లను ప్రయాణికుల బోగీల్లోకి ఎక్కిస్తూనే ఉంది.


సిలిండర్ల రవాణాకు అనుమతులు లేవు  

రైళ్లలో గ్యాస్‌ సిలిండర్ల రవాణాకు అనుమతులు లేవు. కొన్ని దూర ప్రాంత రైళ్లలో ప్యాంట్రీ బోగీలు ఉంటాయి. వాటిలో మాత్రమే వంట చేయటానికి అవసరమైన గ్యాస్‌ సిలిండర్లకు గతంలో అనుమతులు ఇచ్చేవారు. ప్యాంట్రీ బోగీల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అన్ని ప్యాంట్రీలకు నేరుగా వంట చేయటానికి అనుమతులు ఇవ్వటం లేదు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో, ప్యాంట్రీల్లో  వంటలను పూర్తిగా నిషేధించారు. వండిన ఆహార పదార్థాలను ఆయా స్టేషన్ల పరిధిలో లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా ప్యాంట్రీలకు గ్యాస్‌ సిలిండర్ల అవసరం లేదు. దీనిని బట్టి చూస్తే నిబంధనల ఉల్లంఘన జరుగుతోందనేది స్పష్టమవుతోంది. కమర్షియల్‌ విభాగం అధికారుల సహాయ సహకారాలు లేకుండా ఇలా జరగడం అసంభవం.


తక్షణం విచారణకు ఆదేశించాలి  

విజయవాడ రైల్వేస్టేషన్‌ కేంద్రంగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై రైల్వే బోర్డు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. విజయవాడ రైల్వే డివిజన్‌ కమర్షియల్‌ విభాగం హస్తం ఇందులో ఉండటంతో, ఇక్కడి ఉన్నతాధికారులు ఎంత వరకు నిజాయతీగా వ్యవహరిస్తారనేది సందేహమే. గతంలో ఈ గ్యాంగ్‌ లీడర్‌కు సహకరించిన ఎంతో మంది అధికారులు దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో కూడా ఉండటంతో అక్కడి వారు కూడా న్యాయంగా విచారణ జరుపుతారా? అనేది సందేహమే. ప్రయాణికుల ప్రాణాలతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి రైల్వేబోర్డే విచారణ జరిపితే నిజానిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 



Updated Date - 2021-11-17T06:37:33+05:30 IST