ప్యాంట్రీలో వంట!

ABN , First Publish Date - 2021-11-19T06:58:42+05:30 IST

అనుమతులు లేకపోయినా ప్యాంట్రీల్లో వంట చేయిస్తున్న ‘ధనా’పాటీలు వీరు.

ప్యాంట్రీలో వంట!

గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాలు అందుకోసమే

కాదంటే ప్యాంట్రీ నిర్వాహకులకు బెదిరింపులు 

వంట నిషేధించినా కొనసాగించడమే చిత్రం

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

గ్యాస్‌ సిలిండర్ల రవాణాపై డీఆర్‌ఎం ఆగ్రహం 

అంతర్గత విచారణ ప్రారంభించిన సీనియర్‌ 


అనుమతులు లేకపోయినా ప్యాంట్రీల్లో వంట చేయిస్తున్న ‘ధనా’పాటీలు వీరు. ఒకరు కమర్షియల్‌ అధికారి. మరొకరు ఆయన బినామీగా ఉన్న గ్యాంగ్‌ లీడర్‌. ప్యాంట్రీలో వంట చేయకూడదనే ఆదేశాలను వీరు లెక్క చేయరు. ప్యాంట్రీలో వంట చేయకపోయినా.. తాము అందించే సరకులు, గ్యాస్‌ సిలిండర్లు తీసుకోకపోయినా కేసులు పెడతామంటూ నిర్వాహకులను బెదిరిస్తారు... రైళ్లలో గ్యాస్‌ సిలిండర్లు, నిత్యావసరాల రవాణా మాటున దాగి ఉన్న నిజం ఇది. ఈ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు అంతర్గత విచారణను ప్రారంభించారు.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రయాణికుల రైళ్లలో గ్యాస్‌ సిలిండర్ల వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు అధికారులు కదిలారు. భద్రత ‘గ్యాస్‌’ శీర్షికన బుధవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు.  డీఆర్‌ఎం శివేంద్రమోహన్‌ ఈ ఉదంతంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ అధికారి భాస్కరరెడ్డి అంతర్గత విచారణ ప్రారంభించారు. రైళ్లలో ఎవరు గ్యాస్‌ సిలిండర్లను రవాణా చేసినా పట్టుకుని కేసులు నమోదు చేయాలని, వారిని ఆర్పీఎఫ్‌ పోలీసులకు అప్పగించాలని కమర్షియల్‌ స్టాఫ్‌కు అత్యవసర సందేశాలు పంపించారు. దీంతో కమర్షియల్‌ విభాగంలోని ఓ అధికారికి ముచ్చెమటలు పడుతున్నాయి. తాను చెప్పే వరకు ఎలాంటి రవాణా చేపట్టవద్దని ఆ అధికారి తన బినామీకి సూచించినట్టు తెలిసింది. 


కట్టు కథలు అల్లేందుకు యత్నం

సీనియర్‌ డీసీఎం భాస్కరరెడ్డి విచారణ ప్రారంభించటం, గ్యాంగ్‌ లీడర్‌ అరాచకాలను ఉన్నతాధికారులకు వినిపించేందుకు క్యాటరింగ్‌, కమర్షియల్‌ స్టాఫ్‌ సిద్ధంగా ఉండడంతో, ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు కమర్షియల్‌ అధికారి కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో వచ్చిన దృశ్యాలు ఇప్పటివి కావంటూ వాదించే ప్రయత్నం చేస్తున్నాడు. వాస్తవానికి ‘ఆంధ్రజ్యోతి’ దగ్గర ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలూ ఉన్నాయి. గ్యాంగ్‌ లీడర్‌, కమర్షియల్‌ అధికారి సాగిస్తున్న వ్యవహారాలన్నీ రైల్వేస్టేషన్‌ సీసీ కెమెరాల్లో రికార్డు కాగా, ‘ఆంధ్రజ్యోతి’ని సాక్ష్యాలు కోరాలంటూ ఆ అధికారి కమర్షియల్‌ విభాగాన్ని ఉసిగొల్పటం గమనార్హం. 


గ్యాంగ్‌ లీడర్‌ ఉచ్చులో..

కమర్షియల్‌ అధికారి గ్యాంగ్‌ లీడర్‌ ఉచ్చులో చిక్కుకున్నాడు. అతని అక్రమ వ్యవహారాలకు పరోక్షంగా చాలాకాలంగా సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఎవరైనా క్షేత్రస్థాయిలో కేసులు రాస్తే వారి మీద ప్రతాపం చూపించటం ఆ అధికారికి అలవాటుగా మారిపోయింది. ఈ గ్యాంగ్‌ లీడర్‌ దశాబ్దం క్రితం రైల్వేస్టేషన్‌లో ఓ సాధారణ ఆటోవాలా. అప్పట్లో రైల్వే ఉన్నతాధికారి ఒకరితో ఏర్పడిన పరిచయం ఇతని దశను మార్చేసింది. ఆ అధికారికి బినామీగా రైల్వేస్టేషన్‌లో వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. ప్యాంట్రీకార్ల నిర్వాహకులు తన బినామీ నుంచే సరుకులు కొనుగోలు చేసేలా ఆ అధికారి ఒత్తిళ్లు తీసుకొచ్చేవాడు. తరువాత ఆ అధికారి సికింద్రాబాద్‌ వెళ్లిపోయినా, ఈ వ్యాపారం సాగుతూనే ఉంది. విజయవాడ కమర్షియల్‌ అధికారిగా ఎవరూ వచ్చినా, తన బినామీకి సహకరించేలా ఆయన చూసుకునేవాడు. ఇలా విజయవాడ కమర్షియల్‌ అధికారి ఈ బినామీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఆ బినామీకి ఎలాంటి అనుమతులు లేకపోయినా, అతని దగ్గరే సరుకులు, గ్యాస్‌ సిలిండర్లను కొనుగోలు చేసేలా ప్యాంట్రీ స్టాఫ్‌పై ఒత్తిళ్లు తీసుకు వచ్చేవాడు. తిరస్కరిస్తే బెదిరింపులకు దిగేవాడు. చేసేదేమీ లేక వారు ఈ బినామీ నుంచే సరుకులు, గ్యాస్‌ సిలిండర్లను తీసుకునేవారు. 


సాక్ష్యాలు ఇవిగో.. 

సుదూర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో గతంలో వంటకు అనుమతి ఉండేది. అప్పట్లో ప్యాంట్రీ నిర్వాహకులు అనుమతించదగిన సరుకులు అధీకృత వ్యక్తుల నుంచే తీసుకునేవారు. కానీ ఈ బినామీ గ్యాంగ్‌ లీడర్‌ నుంచి అధీకృత ఆదేశాలు లేకుండానే సరుకు బట్వాడా సాగిపోతోంది. ప్రస్తుతం ప్యాంట్రీల్లో వంటను నిషేధించారు. వివిధ స్టేషన్ల నుంచి ఐఆర్‌సీటీసీ సెల్‌ కిచెన్లలో వండి వార్చిన ఆహారాన్ని మాత్రమే ప్యాంట్రీ నిర్వాహకులు తీసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ స్టేషన్‌లో మాత్రం కమర్షియల్‌ అధికారి అండదండలతో ప్రతి ప్యాంట్రీకి ఈ గ్యాంగ్‌ లీడర్‌ సరుకులు, గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తున్నాడు. ప్యాంట్రీల్లో బలవంతంగా వంట చేయిస్తున్నారు. ఈ గ్యాంగ్‌ లీడర్‌ రవాణా చేస్తున్నవాటిలో సరుకులో పార్శిల్‌ చేసిన అట్టపెట్టెలు కూడా ఉన్నాయి. వాటిలో ఏముంటాయో ఎవరికీ తెలియదు. తెరిచి చూసే ధైర్యం కమర్షియల్‌ స్టాఫ్‌కు లేదు. రైళ్లలో ‘రైల్‌ నీర్‌’ను మాత్రమే అనుమతిస్తారు. కానీ ఈ బినామీ మాత్రం బిస్లరీ వాటర్‌ బాటిల్స్‌ను అక్రమంగా సరఫరా చేస్తున్నాడు. స్టేషన్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే ఈ అక్రమ వ్యవహారాలు నడిపేవారు అడ్డంగా దొరుకుతారు.

Updated Date - 2021-11-19T06:58:42+05:30 IST