మళ్లీ గ్యాస్‌ భారం

ABN , First Publish Date - 2022-07-07T06:48:54+05:30 IST

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. ఈసారి రూ.50 పెంచారు.

మళ్లీ గ్యాస్‌ భారం
దుర్గాలమ్మ గుడి వద్ద వంట గ్యాస్‌ ధరల పెంపుపై నిరసన తెలుపుతున్న ఐద్వా కమిటీ సభ్యులు

బండపై రూ.50 పెంపు

పాత ధర రూ.1011..కొత్త ధర రూ.1,061

ఉమ్మడి జిల్లాలో వినియోగదారులపై నెలకు రూ.3.5 కోట్ల అదనపు భారం

గగ్గోలు పెడుతున్న జనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. ఈసారి  రూ.50 పెంచారు. దాంతో 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర విశాఖపట్నంలో రూ.1,061కి చేరింది. మంగళవారం వరకు రూ.1,011కు లభించిన సిలిండర్‌ బుధవారం ఉదయానికి రూ.1,061 అయిపోయింది. 

గత మే నెలలోనే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు గ్యాస్‌ ధరలను పెంచింది. మే 7వ తేదీన రూ.50, మే 19వ తేదీన మూడు రూపాయలు పెంచింది. ఒక నిర్ణీత తేదీ అంటూ లేకుండా కేంద్రం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ధర పెంచేస్తుంది. పెంచడమే కనిపిస్తోంది. పెట్రోల్‌ ధరల్లా...అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా గ్యాస్‌ ధరలు తగ్గించడం లేదు. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వంట గ్యాస్‌ ధర రూ.400 మాత్రమే ఉండేది. ఈ ఎనిమిదేళ్ల కాలంలో రూ.661 పెరిగింది. రాయితీని కూడా దాదాపు ఎత్తేశారు. పేద, ధనిక తేడా లేకుండా ఎవరైనా మార్కెట్‌ ధర చెల్లించాలనే విధానం అమలు చేస్తున్నారు. నెలకు రూ.10 వేలు సంపాదించుకునే సాధారణ కూలీ కుటుంబం కూడా అందులో వేయి రూపాయలు గ్యాస్‌ కోసం కేటాయించాల్సి వస్తోంది. అయినప్పటికీ గ్యాస్‌ నిత్యావసరం కావడంతో కొనక తప్పడం లేదు. దీనికి ప్రత్యామ్నాయం లేదు. కిరోసిన్‌ సరఫరా ఆపేశారు.


ఉమ్మడి జిల్లాలో 13 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు

ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఆయిల్‌ కంపెనీలన్నింటికీ కలిపి సుమారు 13 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. అందులో ఏడు లక్షల మంది ప్రతి నెల సిలిండర్‌ తీసుకుంటున్నారు. తాజా పెంపుతో ఒక్కొక్కరిపై రూ.50 చొప్పున ఏడు లక్షల మందిపై నెలకు రూ.3.5 కోట్ల అదనపు భారం పడుతోంది. 


సామాన్యుడు బతకడం కష్టమే

బసా సాధూరెడ్డి, పెదకోరాడ

ఎప్పటికప్పుడు నిత్యావసరాల రేట్లు పెరుగుతుండడం వల్ల సామాన్యుడు బతకడం కష్టం అవుతుంది. వంట గ్యాస్‌, డీజిల్‌, పెట్రోలు, విద్యుత్తు చార్జీలు వంటి వాటి ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. ఇప్పటికే వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలకు పైగా ఉంది. ఇంకా పెరిగితే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవలసిందే.  గ్యాస్‌ ధర పెరిగితే దాని ఆధారిత సరకులన్నింటి ధరలు పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం స్పందించి గ్యాస్‌ ధర పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. 


గ్యాస్‌ ధర పెరగడం సామాన్యులకు పెనుభారమే

బేరా పద్మావతి, గృహిణి, గోపాలపట్నం

ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగింది. దీనికి తోడు వంట గ్యాస్‌ ధర అసాధారణంగా పెరగడం ఇబ్బందికంగా మారింది. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆదాయం పెరుగుదల లేకపోవడంతో సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే మాదిరిగా ధరలు పెరుగుతూ పోతే సామాన్యులు బతకడం కష్టమే.


గ్యాస్‌ ధర పెంపుపై మహిళల నిరసన

రహదారిపై కట్టెల పొయ్యిల ఏర్పాటు

సిలిండర్‌ ధర తగ్గించాలని ఐద్వా డిమాండ్‌


మహారాణిపేట, జూలై 6: పెంచిన వంట గ్యాస్‌ ధరలను తగ్గించకుంటే బీజేపీ ప్రభుత్వానికి తగిన శాస్తి చేయక తప్పదని ఐద్వా ప్రతినిధులు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.50 పెంచడంతో ఐద్వా కమిటీ జగదాంబ జోన్‌ ఆధ్వర్యంలో బుధవారం పూర్ణామార్కెట్‌లోని దుర్గాలమ్మ గుడి వద్ద రహదారిపై మహిళలు కట్టెల పొయ్యిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు ఎం.అన్నపూర్ణ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం సంపన్నులకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇస్తూ, సామాన్య ప్రజలపై ధరల భారం మోపడం అన్యాయమన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రూ.450 ఉండే గ్యాస్‌ సిలిండర్‌ ధర, నేడు రూ.1,061కు చేరుకుందన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసి ప్రజలను బలిపశువులను చేస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జి.వరలక్ష్మి, సి.నాగలక్ష్మి, గౌరి, విజయ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:48:54+05:30 IST