గుదిబండ

ABN , First Publish Date - 2021-03-06T05:44:16+05:30 IST

గ్యాస్‌ కంపెనీలు వంటగ్యాస్‌ ధరను తరచూ పెంచేస్తూ సామాన్యులపై పెనుభారం మోపుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీనికితో తోడు వంటగ్యాస్‌ ధర కూడా భగ్గుమంటుండడంతో సగటుజీవి ఇంటి ఖర్చులు పెరిగి ఆర్థికంగా చితికిపోతున్నాడు. అసలే లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగాలు పోయి, సగం జీతంతో బతుకీడుస్తున్న జనం.. ఈ ధరాభారంతో మరింత కుంగిపోతున్నారు. మూడు నెలల్లోనే గ్యాస్‌ బండపై రూ.225 పెరిగింది. వంటగ్యాస్‌ చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా ఒక్క నెలలోనే రూ.125కు పెరిగింది.

గుదిబండ

పెరిగిన వంటగ్యాస్‌ ధర
మూడు నెలల్లోనే రూ.225 పెరుగుదల
ప్రజలపై రూ.21కోట్ల అదనపు భారం
విలవిలలాడుతున్న సామాన్యులు, చిరువ్యాపారులు



హన్మకొండ, ఆంధ్రజ్యోతి
గ్యాస్‌ కంపెనీలు వంటగ్యాస్‌ ధరను తరచూ పెంచేస్తూ సామాన్యులపై పెనుభారం మోపుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. దీనికితో తోడు వంటగ్యాస్‌ ధర కూడా భగ్గుమంటుండడంతో సగటుజీవి ఇంటి ఖర్చులు పెరిగి ఆర్థికంగా చితికిపోతున్నాడు. అసలే లాక్‌డౌన్‌ కాలంలో ఉద్యోగాలు పోయి, సగం జీతంతో బతుకీడుస్తున్న జనం.. ఈ ధరాభారంతో మరింత కుంగిపోతున్నారు. మూడు నెలల్లోనే గ్యాస్‌ బండపై  రూ.225 పెరిగింది. వంటగ్యాస్‌ చరిత్రలోనే ఎప్పడూ లేని విధంగా ఒక్క నెలలోనే రూ.125కు పెరిగింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం రూ.40 మాత్రమే సబ్సిడీ ఇస్తుండడంతో జనం జేబులకు చిల్లులు పడుతున్నాయి.

పెరుగుదల ఇలా..
నెల రోజుల్లోనే వంటగ్యాస్‌ ధర నాలుగో సారి పెంచారు. మూడు నెలల్లో ఏకంగా రూ.225 పెరిగింది.  గత సోమవారం సిలిండర్‌ ధర మరో రూ.25 పెరిగింది. కేంద్రప్రభుత్వం ఎలాంటి సబ్సిడీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు మొత్తం ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా రూ.100 పెరిగింది. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి బాదుడు మొదలైంది. అప్పటి దాకా సిలిండర్‌ ధర రూ.746.50 ఉండగా, 4వ తేదీన రూ.25 పెరగడంతో రూ 771.50కి చేరింది. ఫిబ్రవరి 15న మరోసారి రూ.50లు పెరిగింది. దీంతో రూ.821.50 చేరింది. 25వ తేదీన మరో రూ.25 పెంచారు. ఫలితంగా సిలిండర్‌ రేటు రూ.846.50కి చేరింది. ఇక మార్చి ఒకటిన మరో రూ.25 పెరగడంతో ధర రూ.871.50లకు చేరుకున్నది. 30రోజుల వ్యవధిలోనే రూ.125 పెరిగింది. ఓ మధ్య తరగతి కుటుంబానికి ప్రతీనెలా ఒక సిలిండర్‌ వినియోగమవుతుంది. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గ్యాస్‌ వినియోగదారులపై రూ.20.97 కోట్ల అదనపు భారం పడింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మొత్తం 9.32 లక్షల గ్యాస్‌కనెక్షన్లు ఉన్నాయి. గతేడాది ఫిబ్రవరిలో సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర రూ.592. 50పైసలు ఉండింది.

తగ్గిన సబ్సిడీ..

మరో వైపు రాయితీ సొమ్ము రూ.40 మాత్రమే వెనక్కి ఇస్తున్నారు. అంతకుముందు ఒక్కో సిలిండర్‌పై రూ.213 ఇచ్చేవారు. అది కాస్త తగ్గుతూ వచ్చింది. గృహ వినియోగదారులకు ఏడాదికి 12 ఎల్‌పీజీ సిలిండర్లను ప్రభుత్వం సబ్సిడీ కింద సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. సబ్సిడీ డబ్బులను కస్టమర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. సిలిండర్‌ ధరలు ప్రతీనెలా మారుతుండడంతో సబ్సిడీ కూడా మారుతూ వస్తోంది. దీంతో సిలిండర్‌పై ప్రభుత్వం ఇచ్చే రాయితీ కాస్త రూ.213 నుంచి ప్రస్తుతం రూ.45కు తగ్గింది.

చిరువ్యాపారి విలవిల
చిరువ్యాపారులు సైతం గ్యాస్‌ ధర పెరగడంతో బెంబేలెత్తుతున్నారు. వాణిజ్య సిలిండర్లను వినియోగించే టిఫిన్‌ సెంటర్లు, హోటళ్లు, మెస్‌ నిర్వాహకులు, బడ్డీ కొట్ల వ్యాపారులు కమర్షియల్‌ సిలిండర్ల ధరలు పెరగడంతో కుదేలవుతున్నారు. అటు టిఫిన్ల ధర పెంచలేక, ఇటు పెరుగుతున్న భారాన్ని మోయలేక సతమతమవుతున్నారు. కమర్షియల్‌ గ్యాస్‌ బండ ధర ఒక నెలలోనే రూ.96 పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. గడచిన మూడు నెలల్లో కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.291.68 పెరిగింది. డిసెంబరులో రూ.1481.32 ఉండగా, జనవరి నాటికి రూ.1,677.32కు చేరింది. మార్చి వచ్చే సరికి రూ.1,773కు చేరింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 40వేల వరకు కమర్షియల్‌ సిలిండర్లు ఉన్నాయి. ప్రతీరోజు 4 నుంచి 5వేల వరకు ఈ సిలిండర్ల పంపిణీ జరుగుతుంది. కమర్షియల్‌ సిలిండర్ల ధర పెరగడంతో టిఫిన్‌ సెంటర్లు, హోటల్‌ నిర్వాహకులు ప్రతీ టిఫిన్‌పై రూ.5 నుంచి రూ.10 పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది.

ఎట్లా బతికేదీ?

 - యు. భారతి, గృహిణి, తిలక్‌రోడ్డు, వరంగల్‌

కేంద్ర ప్రభుత్వం కరోనా హడావిడిలో పడి గ్యాస్‌ ధరలను పట్టించుకుంటున్నట్టు లేదు. ఇదే అదనుగా గ్యాస్‌ కంపెనీలు నెలకు రెండుమూడు సార్లు ధరలను పెంచేస్తున్నాయిు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువులు మండుతున్నాయి. ఎండల వల్ల కరెంట్‌ బిల్లు పెరిగేలా ఉంది. అన్నీ పెరుగుతున్నాయి.. కానీ చేతిలో డబ్బే పెరగడం లేదు.

ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు
- ఎ.రఘువీర్‌, కరీమాబాద్‌

ధరల పెంపుపై గతంలో మాదిరిగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడం లేదు. పదేళ్ల కిందట దేశవ్యాప్తంగా బంద్‌లు, నిరసనలు జరిగినట్లుగా ఆ స్థాయిలో ఇప్పుడు చేపట్టడడం లేదు. ఎందుకంటే తరచూ ధరలు పెంచడం, రోజువారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను సవరించడంతో ధరలు భారీగా పెరుగుతున్న విషయం ప్రజలకు ప్రత్యక్షంగా తెలియడం లేదు. రోజువారీ పైసల్లో పెరుగుతుంటే అది పెద్ద విషయం కాదన్నట్టుగా కనిపిస్తోంది. కానీ నెలవారీ బడ్జెట్‌ మాత్రం పెరిగిపోతోంది.

Updated Date - 2021-03-06T05:44:16+05:30 IST