గ్యాస్‌ సబ్సిడీ గాయబ్‌!

ABN , First Publish Date - 2022-05-09T08:03:52+05:30 IST

గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత గతంలో మీకు ఎంత సబ్సిడీ వచ్చేది

గ్యాస్‌ సబ్సిడీ గాయబ్‌!

  • పెరుగుతున్న సిలిండర్‌ ధర.. తగ్గుతున్న రాయితీ
  • 2014లో ఎల్పీజీ సిలిండర్‌ రూ.410
  • ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1052
  • అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు తగ్గినా..
  • దేశంలో మాత్రం బాదుడే బాదుడు
  • గతంలో గ్యాస్‌ ధరతో పాటే రాయితీ కూడా పెరిగేది
  • ఇప్పుడు సిలిండర్‌ ధర ఎంతైనా సబ్సిడీ 40 మాత్రమే!
  • క్రమంగా సబ్సిడీని ఎత్తేస్తున్న మోదీ సర్కారు
  • ఇప్పటి సిలిండర్‌ ధరకు అప్పట్లో 2 వచ్చేవి:  రాహుల్‌ 



(సెంట్రల్‌ డెస్క్‌): గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసిన తర్వాత గతంలో మీకు ఎంత సబ్సిడీ వచ్చేది!? నాలుగైదు వందలు బ్యాంకు అకౌంట్లో పడేవి! ఇప్పుడు అది కాస్తా రూ.40కి పరిమితమైంది! గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుతూ ఉంటే.. సబ్సిడీ తగ్గిపోతూ వస్తోంది! ఫలితం.. నలుగురు సభ్యులున్న కుటుంబంపై ఏటా దాదాపు రూ.5000 వరకూ అదనపు భారం! ఇంకా చెప్పాలంటే, పెరిగిన ధరల కారణంగా ఉజ్వల లబ్ధిదారులైన నిరుపేదలు ఇప్పుడు గ్యాస్‌ పొయ్యికే దూరమవుతున్నారు. మళ్లీ కట్టెల పొయ్యిని ఆశ్రయించాల్సిన పరిస్థితి! దేశవ్యాప్తంగా దాదాపు 85ు కుటుంబాలకు ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని అంచనా. ఇళ్లలో వాడే 14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌పై ఆరు వారాల్లోనే రెండుసార్లు ధరల మోత మోగించారు. మార్చి 22న రూ.50, తాజాగా ఈనెల 7న మరో రూ.50 చొప్పున పెంచారు. దీంతో, ఇప్పుడు హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర ఏకంగా రూ.1052కు పెరిగిపోయింది. నిజానికి, యూపీఏ హయాంలో 2014లో అప్పటి ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ.827 రాయితీ భరించడంతో వినియోగదారులకు రూ.410కే సిలిండర్‌ వచ్చేది. అదే ఏడాది అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న రాయితీలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి (నగదు బదిలీ) జమ చేస్తామని ప్రకటించింది. అలాగే చేస్తోంది కూడా. గ్యాస్‌ సిలిండర్లపై ఇచ్చే రాయితీని కూడా లబ్ధిదారులకు అందజేస్తోంది. కానీ, మోదీ సర్కారు క్రమంగా సిలిండర్‌ ధర పెంచుతూ.. 


సబ్సిడీని తగ్గించేసింది. 2020 నుంచి 2021 మధ్య.. ఏడాదిలో ఒక్కో సిలిండర్‌పై రూ.265 మేరకు పెంచింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు మరో రూ.190 పెంచింది. మూడేళ్ల కిందట ఒక్కో సిలిండర్‌పై రూ.450 వరకు సబ్సిడీ ఇచ్చేది. గత కొంత కాలంగా సిలిండర్‌ ధర ఎంత ఉన్నా రాయితీ మాత్రం 40 రూపాయలే ఇస్తోంది. నవంబరు 2018లో నేరుగా నగదు బదిలీ పద్ధతిలో గ్యాస్‌ సిలిండర్‌పై అత్యధికంగా రూ.435 సబ్సిడీని వినియోగదారుల ఖాతాల్లో జమ చేశారు. ఇది జూలై 2019 నాటికి రూ.40కి పడిపోయింది. అప్పటి నుంచి ఇదే కొనసాగుతోంది. 2014-15లో వంట గ్యాస్‌ ధరలను మార్కెట్‌ సెక్టార్‌కు వదిలేయాలని నిర్ణయించిన మోదీ సర్కారు.. అప్పట్లో ఒక్కో సిలిండర్‌పై రూ.563 రాయుతీ ఇవ్వాలని నిర్ణయించింది. గడిచిన ఆరేళ్లలో సిలిండర్‌ ధర పెంచుతోంది. రాయితీ మాత్రం తగ్గిపోయింది.


సర్కారుకు ఏటా తగ్గిపోతున్న సబ్సిడీ భారం

ప్రజలకు ఇచ్చే రాయితీలో భారీగా కోతలు కోస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు ఖజానాపై సబ్సిడీ భారాన్ని భారీగా తగ్గించేసుకుంటోంది. ఉదాహరణకు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌ సబ్సిడీకి రూ.29,627 కోట్లు ఇవ్వగా.. 2020-21కు వచ్చేసరికి దానిని రూ.25,520కు తగ్గించేసింది. ఇక 2021-22లో ఈ మొత్తం రూ.12,480 కోట్లకు పడిపోయింది. 2022-23లో ఇది కాస్తా కేవలం రూ.5,813 కోట్లు మాత్రమే. అంటే, కేవలం నాలుగేళ్లలోనే గ్యాస్‌ సబ్సిడీపై కేంద్రం రూ.25 వేల కోట్ల భారాన్ని తగ్గించేసుకుందన్నమాట. అంతేనా, కరోనా రాక ముందు వరకూ సిలిండర్‌ ధర పెరిగితే.. సబ్సిడీ కూడా పెరిగేది. కానీ, 2020 మే నుంచి ఆ విధానానికి స్వస్తి పలికింది. ప్రస్తుతం సిలిండర్‌ ధర రూ.1000 దాటిపోగా.. రాయితీ మాత్రం రూ.40 ఇస్తోంది. అంటే, వంట గ్యాస్‌ సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా మంగళం పాడినట్లే. ఓ వైపు ధరలు భారీగా పెంచేస్తూ.. మరోవైపు రాయితీనీ ఎత్తేస్తుండడంతో సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. ఉజ్వల పథకం కింద కనెక్షన్లు ఇచ్చిన పేదల పరిస్థితి మరీ దారుణం. 


దేశంలో ఉజ్వల పథకం లబ్ధిదారులు 8 కోట్ల మంది ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఏడాది మరో కోటి మందికి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అయితే సిలిండర్‌ ధరలు భారీగా పెరిగిపోతుండడంతో 2022 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 3.2 కోట్ల మంది ఉజ్వల లబ్ధిదారులు గ్యాస్‌ను రీఫిల్‌ చేయించుకోలేదని ప్రభుత్వమే వెల్లడించడం గమనార్హం. ఇక ఎల్పీజీ ధరలు ఎందుకు పెంచుతున్నారన్న దానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. అంతర్జాతీయంగా ధరలు పెరగడం వల్లే చమురు సంస్థలు గ్యాస్‌ ధరలను పెంచుతున్నాయని కేంద్రం పలుమార్లు ప్రకటించింది. అయితే, అందులోనూ వాస్తవం లేదు. 2014-21 మధ్య కాలంలో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధర 31 శాతం తగ్గగా.. అదే కాలంలో రిటైల్‌ ఎల్పీజీ ధర 110 శాతం పెరిగింది!


నగదు బదిలీతో ఒరిగిందేంటి?

గతంలో విధానాల కారణంగా లబ్ధిదారులకు అందాల్సిన ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న కారణంగా నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టారు. నేరుగా, లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లోనే రాయితీ మొత్తం జమవుతుందని, దాంతో, అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వాలు చెప్పాయి. కానీ, నగదు బదిలీ విధానంలో లబ్ధిదారులకు అందే సబ్సిడీనే భారీగా తగ్గిపోతుండడం ఇప్పటి విచిత్ర పరిణామం. ఉదాహరణకు, గతంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరిగితే.. సబ్సిడీ మొత్తం కూడా పెరిగేది. ఆ మేరకు లబ్ధిదారుడికి నేరుగా లబ్ధి చేకూరేది. కానీ, ఇప్పుడు ప్రభుత్వమే సబ్సిడీని తెగ్గోసేస్తోంది. దాంతో, నగదు బదిలీ అయినా.. మరో విధానం అయినా లబ్ధిదారుడికి పెద్దగా ఉపయోగం ఏమీ ఉండడం లేదు. ఇప్పుడు కొత్తగా వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆ మేరకు సబ్సిడీని రైతుల ఖాతాల్లో వేస్తామని అంటోంది. 

Read more