చరిత్రకారుని ‘జీవిత కథలు’

ABN , First Publish Date - 2020-11-21T05:56:59+05:30 IST

ఒక ప్రముఖుని జీవిత చరిత్ర రాయడానికి ‘నియోగింపబడడం’ అనే భావన నా మేధో ప్రవృత్తికి పూర్తిగా విరుద్ధమైనది. ఒక వ్యక్తి జీవితచరిత్ర రాయడానికి నన్ను పురిగొల్పేవి నా అంతర్గత ప్రేరణలు, సంబంధిత వ్యక్తి జీవితం.....

చరిత్రకారుని ‘జీవిత కథలు’

ఒక ప్రముఖుని జీవిత చరిత్ర రాయడానికి ‘నియోగింపబడడం’ అనే భావన నా మేధో ప్రవృత్తికి పూర్తిగా విరుద్ధమైనది. ఒక వ్యక్తి జీవితచరిత్ర రాయడానికి నన్ను పురిగొల్పేవి నా అంతర్గత ప్రేరణలు, సంబంధిత వ్యక్తి జీవితం, కృషిలో నా ప్రగాఢ ఆసక్తి మాత్రమే.


నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఒక గుజరాతీ వ్యాపారి సిరిసంపదలు ఎంత వేగంగా, అపరిమితంగా పెరిగిపోయాయో సమగ్రంగా, నిష్పాక్షికంగా వివరించిన ఒక వ్యాసం ఇటీవల ‘పైనాన్షియల్ టైమ్స్’లో వెలువడింది. ‘2014 మేలో సార్వత్రక ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత నరేంద్ర మోదీ గాంధీనగర్ నుంచి న్యూఢిల్లీకి అదానీ ప్రైవేట్ విమానంలో ప్రయాణించారు. ఆయన ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే అదానీ ఆస్తుల నికర విలువ 230 శాతం పెరిగింది. ప్రభుత్వ టెండర్లు స్వాయత్తం చేసుకోవడం ద్వారా అదానీ ఆస్తులు అతి స్వల్పకాలంలో 2600 కోట్ల డాలర్లకు మించిపోయాయి’. అని ఆ వ్యాసం పేర్కొంది. నరేంద్ర మోదీని నేను ఎప్పుడూ కలవలేదు. ప్రస్తావిత వ్యాసం చదివిన తరువాత నాకు కొన్ని విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. నేను కోరుకున్నట్టయితే మోదీని కలుసుకునేందుకు, అదానీతో కలిసి పని చేసేందుకు అవకాశం లభించి ఉండేదన్నదే ఆ జ్ఞాపకాల సారాంశం. వీటి నేపథ్యమేమిటో వివరిస్తాను. 


2013 సెప్టెంబర్‌లో నేను రాసిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’ ప్రచురితమయింది. అదే ఏడాది డిసెంబర్‌లో ముంబై లిటరరీ ఫెస్టీవల్‌లో నా కొత్త పుస్తకం గురించి ప్రసంగించాను. నా ప్రసంగం ముగిసిన అనంతరం ఒక యువకుడు నా వద్దకు వచ్చి రచయితను కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఒక ముఖ్యమైన విషయంపై మీతో చర్చించదలుచుకున్నానని అన్నాడు. అయితే బెంగలూరుకు తిరిగి వెళ్ళేందుకు విమానం వేళ సమీపించడంతో నాకు ఇప్పుడు తగు సమయం లేదని చెప్పి నా ఈ -మెయిల్ అడ్రస్ ఇచ్చాను. మీరు చర్చించదలుచుకున్న విషయాన్ని వివరంగా రాయండి అని సూచించాను.


కొద్దిరోజుల అనంతరం ఆ యువకుడు నాకు ఒక ఈ-మెయిల్ పంపించాడు. గౌతమ్ అదానీ జీవితచరిత్ర ప్రాజెక్టుపై తాను ఒక కన్సల్టన్సీ సంస్థతో కలిసి పని చేస్తున్నానని ఆయన తెలిపాడు. దాని విషయమై అదానీతో తమ సంస్థ చర్చలు జరుపుతోందని పేర్కొన్నాడు. పలు ప్రచురణ సంస్థలు అదానీ జీవితచరిత్రను ప్రచురించడానికి సుముఖంగా ఉన్నాయని ఒక లిటరరీ ఏజెంట్‌ను ప్రస్తావిస్తూ తెలిపాడు. తమ సంస్థ, అదానీ గ్రూపు రెండూ అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన జీవితచరిత్రను వెలువరించడంపై అమితాసక్తితో ఉన్నాయని ఆ యువకుడు పేర్కొన్నాడు. అదానీ జీవితచరిత్ర ప్రాజెక్టుకు మార్గదర్శకుడు, సలహాదారుగా పనిచేసే అనుభవజ్ఞుడు, ప్రతిభావంతుడైన రచయిత కోసం చూస్తున్నామని అన్నాడు. ఆ ‘మార్గదర్శకుడు’, ‘సలహాదారు’ నేను కావాలన్నదే తమ ఆక్షాంక్ష అని అతడు పేర్కొన్నాడు. ప్రాజెక్టు విషయమై చర్చలు జరిపేందుకు తమ సంస్థ ప్రతినిధి, అదానీ, నేను సమావేశమవ్వాలని ఆ యువకుడు ప్రతిపాదించాడు. 


మహాత్మా గాంధీ జీవితచరిత్ర రచనకు గాను నేను పలుమార్లు గుజరాత్‌ను సందర్శించాను. 2013 డిసెంబర్‌లో కూడా అక్కడకు వెళ్ళాను. కనుక గౌతమ్ అదానీ గురించి నాకు రేఖామాత్రంగా తెలుసు.. 2001 నుంచి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీకి అదానీ చాలా సన్నిహితుడని కూడ తెలుసు.. ప్రధానమంత్రి కాకముందు సైతం అదానీ ప్రైవేట్ విమానంలో మోదీ పదేపదే ప్రయాణిస్తుండేవారు. గుజరాత్ తీరప్రాంతాలలో వేలాది మత్స్యకార కుటుంబాలను నిర్వాసితులను చేయడంతో పాటు మడ అరణ్యాలను ధ్వంసం చేసిన అదానీ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి మోదీ ప్రభుత్వం ఎలా శీఘ్రగతిన అనుమతులు ఇచ్చిందో అహ్మదాబాద్ మిత్రులు నాకు చెప్పారు. 2013 డిసెంబర్ నాటికే తదుపరి భారత ప్రధానమంత్రి తప్పక నరేంద్ర మోదీయేనన్న విషయం ప్రతి ఒక్కరికీ స్పష్టమయింది. భావి ప్రధాని అనుగ్రహాన్ని తాను మరింతగా పొందడం ఖాయం గనుక తన పలుకుబడిని మరింతగా విస్తరించుకునేందుకు అదానీ సంకల్పించుకున్నారు. ఆ సంకల్పంలో భాగమే ఆయన జీవిత చరిత్ర ప్రాజెక్టు. దాని రచనలో నేను కీలక పాత్ర వహించాలని అదానీ సలహాదారులు భావించారు. 


నేను అడగకుండానే ఒక జీవితచరిత్ర రచనకు నన్ను నియోగించుకోవడానికి ప్రతిపాదన రావడం అదే మొదటి సారి కాదు. గాంధీ జీవితచరిత్ర రచనకు ఉపక్రమించడానికి చాలా సంవత్సరాలకు ముందే జన్మతః ఆంగ్లేయుడైన మానవ శాస్త్రవేత్త వెరియర్ ఎల్విన్ జీవితచరిత్ర రాశాను. భారతీయ గిరిజనుల గురించి సాధికారికంగా మాట్లాడగల వ్యక్తి ఎల్విన్. నేను రాసిన ఆయన జీవితచరిత్ర ‘సేవేజింగ్ ది సివిలైజ్డ్’ను వాజపేయి జీవితచరిత్రను ప్రతి ప్రభుత్వ విభాగమూ, ప్రతి ఉప విభాగమూ కొనుగోలు చేస్తాయని. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని హిందీలోకి అనువదింప చేస్తాయని, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలన్నీ ఆ పుస్తకాన్ని కొనుగోలు చేస్తాయని ఆయన తెలిపారు. మంచి ఆర్థికలబ్ధి పొందవచ్చని కూడా ఆ లైబ్రేరియన్ పేర్కొన్నారు. వాజపేయి జీవితచరిత్ర రచన ప్రతిపాదన నాలో ఏమీ ఉత్సుకతను కలిగించలేదు. అధికారంలో ఉన్న వ్యక్తి జీవితచరిత్ర రచనకు ‘నియోగింపబడిన’ రచయిత స్వేచ్ఛగా రాయగలగడం అసాధ్యమని నేను భావించాను. వాజపేయి ఆకర్షణీయమైన వ్యక్తి అయినప్పటికీ ఆయన పార్టీ బీజేపీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తాను. ఆ పార్టీ హిందుత్వ భావజాలం గాంధీ విశ్వసించే బహుళత్వ, సమ్మిళిత హిందూ ధర్మానికి పూర్తిగా విరుద్ధమైనది. ఈ కారణంగా గౌరవనీయ ప్రధానమంత్రి జీవిత చరిత్ర రాయడానికి నేను అర్హుడిని కానని ఆ లైబ్రేరియన్ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను.


2002లో క్రికెట్ చరిత్రపై నా పుస్తకం ఒకటి ప్రచురితమయింది. దరిమిలా ఇద్దరు క్రికెటర్లు తమ స్వీయచరిత్రల రచనలో సహకరించాలని కోరారు. వారిలో ఒకరు ఇప్పటికీ రంగంలో ఉండగా, మరొకరు విశ్రాంత జీవితంలో ఉన్నారు. 2007లో స్వతంత్ర భారతదేశ చరిత్రపై నా పుస్తకం ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’- వెలువడిన అనంతరం ఇటీవలే విగతుడైన కాంగ్రెస్ నాయకుడు ఒకరు తన తండ్రి జీవితచరిత్ర రాయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్‌లో ఇప్పటికీ క్రియాశీలంగా ఒక నాయకుడు తన జీవిత చరిత్ర రాయాలని కోరారు. ఒక ప్రముఖ శాస్త్రవేత్త 80వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు తమ ‘ఆదర్శ శాస్త్రవేత్త’ స్ఫూర్తిదాయక కథ రాయాలని కోరారు. ఆర్థికవేత్త -పరిపాలకుడిగా సుప్రసిద్ధుడైన ఒక విజ్ఞుని (ఈయన ఇటీవలే కీర్తిశేషుడయ్యారు) జీవితచరిత్ర రాయాలని ఆయన కుటుంబ సభ్యులు కూడ కోరారు. ఇలాగే వివిధ రంగాలలో ప్రముఖులైన పలువురి జీవిత చరిత్రలు రాయాలని వారి వారి ఆప్తులు, అభిమానులు నన్ను కోరారు. ఈ ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించాను. వివిధ అంశాల పరిశోధనలలో తలమునకలై ఉండడం, కొంత మంది జీవితకథలు రాయడానికి అర్హుడిని కాకపోవడమే నా తిరస్కృతికి ప్రధాన కారణం. ఎవరైనా ఒక ప్రముఖుడి జీవితచరిత్ర రాయడానికి ‘నియోగింపబడడమనే’ భావన నా మేధో ప్రవృత్తికి పూర్తిగా విరుద్ధమైనది. అలాంటి రాయడానికి నన్ను పురిగొల్పేవి నా అంతర్గత ప్రేరణలు, సంబంధిత వ్యక్తి జీవితం, కృషిలో నా ప్రగాఢ ఆసక్తి మాత్రమే. 


వెరియర్ ఎల్విన్ నా జీవితాన్ని మార్చివేసిన విద్వజ్ఞుడు కనుకనే నేను ఆయన జీవితచరిత్ర రాశాను. కళాశాలలో ఆర్థిక శాస్త్రాన్ని ఉదాసీనంగా అధ్యయనం చేస్తున్న తరుణంలో ఎల్విన్ పుస్తకాలను చదవడం తటస్థించింది. సామాజిక శాస్త్రం, సామాజిక చరిత్ర అధ్యయనం చేసేందుకు ఎల్విన్ పుస్తకాలు నన్ను పురిగొల్పాయి. గాంధీ జీవితం, చరిత్రపై ఆయన నెరపిన ప్రభావమూ నన్ను ముగ్ధుడ్ని చేశాయి. ఆయన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకువెళ్ళేందుకే మహాత్ముడి జీవితగాథను రాశాను. గౌతం అదానీ జీవిత చరిత్ర రచన విషయమై 2013 డిసెంబర్‌లో నాకు అభ్యర్థన అందే నాటికి అటువంటి ప్రతిపాదనలను తిరస్కరించడంలో నాకు విశేష అనుభవం ఉన్నది. గాంధీ జీవితచరిత్ర రెండో భాగం రచనలో తల మునకలై ఉన్నందున అదానీ జీవిత చరిత్ర ప్రాజెక్టుకు ‘మార్గదర్శకుడు, సలహాదారు’గా ఉండలేనని ఆ ముంబై యువకుడికి స్పష్టంగా తెలియజేశాను. 


ఆ యువకుడు నాకు రాసిన లేఖను సన్నిహిత స్నేహితులకు చూపించి, ‘‘అదానీ జీవితచరిత్ర రచన ప్రతిపాదనకు నేను అంగీకరించేందుకు కారణం ఒకటి అంటూ ఉంటే అది నా జ్ఞాపకాలకు ‘ఏ బయోగ్రాఫర్ జర్నీ: ఫ్రమ్ గాంధీ టు అదానీ’ అనే శీర్షిక పెట్టేందుకు మాత్రమే’’. అని వ్యాఖ్యానించాను రాయని, రాయబోని ఆ పుస్తకానికి ఒక ఉల్లాసకరమైన, మెరుగైన శీర్షికను ఒక స్నేహితుడు సూచించాడు. అది, అదానీ ఆఫ్టర్ గాంధీ’.




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2020-11-21T05:56:59+05:30 IST