గంగవరంపై గెజిట్‌

ABN , First Publish Date - 2021-09-18T08:11:26+05:30 IST

గంగవరం పోర్టు అమ్మకానికి రాజముద్ర పడిపోయింది. ఈ పోర్టులో ఉన్న డీవీఎస్‌ రాజు వాటా, విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ వాటాలతో పాటు ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూపునకు అమ్మేశారు.

గంగవరంపై గెజిట్‌

పోర్టు అదానీ గ్రూపు పరం చేసిన ప్రభుత్వం

ప్రైవేట్‌ వాటాలతోపాటు సర్కారుదీ అమ్మకం

ఒక్కో షేరు 120.. రూ. 645కోట్లకు విక్రయం

కేబినెట్‌లో గుట్టుగా నిర్ణయం.. గెజిట్‌ జారీ


అమరావతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గంగవరం పోర్టు అమ్మకానికి రాజముద్ర పడిపోయింది. ఈ పోర్టులో ఉన్న డీవీఎస్‌ రాజు వాటా, విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌ వాటాలతో పాటు ప్రభుత్వ వాటాను కూడా అదానీ గ్రూపునకు అమ్మేశారు. ఈ అమ్మకానికి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ విడుదల చేసింది. డీవీఎస్‌ రాజు, విండీ లేక్‌సైడ్‌ కంపెనీల వాటాకు కట్టినట్లే ప్రభుత్వానికి కూడా ఒక్కో వాటాకు రూ.120 చొప్పునే లెక్కకట్టి తీసేసుకోవడం సరైందేనని పేర్కొంది. లీజు గడువు ముగిశాక పోర్టును తిరిగి ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని తెలిపింది. గంగవరం పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం 2,800 ఎకరాలు కేటాయించింది. వాస్తవానికి ఈ భూమి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కోసం సేకరించగా ఆ తర్వాత దాన్ని గంగవరం పోర్టుకు ఇచ్చారు. డీవీఎస్‌ రాజు, విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌కు 89.6 శాతం వాటా, భూములు ఇచ్చినందుకు 10.4 శాతం వాటా ప్రభుత్వానికి ఉండేలా... కన్సార్టియం ఏర్పాటుచేసి పోర్టును అభివృద్ధి చేశారు.


గోప్యంగా కేబినెట్‌ తీర్మానం

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే గంగవరం పోర్టు అమ్మకానికి తెరలేచింది. తొలుత విండీ లేక్‌సైడ్‌, డీవీఎస్‌ రాజులకు చెందిన వాటాను అదానీ గ్రూపు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి చెందిన 10.4వాటాను అమ్మేందుకు రహస్యంగా నిర్ణయించారు. మంత్రివర్గ సమావేశంలో ఆమోదించినా బయటకు చెప్పలేదు. అయితే, విష యం బయటకు రావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రభుత్వానికి చెందిన వాటాను ఇంత చౌకగా రూ.645కోట్లకు అమ్మడం సరైన నిర్ణయం కాదన్నారు. ఈ పోర్టుకోసం ప్రభుత్వం ఇచ్చిన భూమికి బదులు ఈ వాటా వచ్చిందని...కానీ ఆ భూమి విలువ ఇప్పుడు చాలా ఉంటుందన్న వాదనలు తెరపైకి వచ్చాయి. పోర్టులో వాటాను ప్రైవేటు కంపెనీలు అమ్మిన రేటుకే అమ్మేయడం చాలా పొరపాటని పలువురు అభిప్రాయపడ్డారు. అసలు ప్రభుత్వం పోర్టును అమ్మాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది.


గంగవరం పోర్టు మొత్తం విలువను రూ.6,204 కోట్లుగా అదానీ గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులో డీవీఎస్‌ రాజుకు చెందిన 58.1 శాతం వాటాను రూ.3,604 కోట్లకు, విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్‌కు చెందిన 31.5 శాతం వాటాను రూ.1954 కోట్లకు అదానీ పోర్ట్సు అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌(ఏపీసెజ్‌) కొన్ని నెలల క్రితమే కొనుగోలు చేసింది. ఇప్పుడు ప్రభుత్వ వాటానూ బదిలీ చేసుకుంది. గంగవరం పోర్టులో వాటా ఉన్నంత కాలం...పోర్టుకు వచ్చే స్థూల ఆదాయంలో ప్రభుత్వానికి 2.1వాటా వచ్చేది. 2039 వరకు అంటే 30 ఏళ్ల లీజు ముగిసేవరకు ప్రభుత్వానికి ఇది చెల్లించాలి. ఆ తర్వాత మరో రెండుసార్లు పదేళ్లు చొప్పున లీజు పెంచేందుకు, అదీ అన్ని షరతులు అమలైతేనే ఇవ్వాలని ఒప్పందంలో ఉంది. ఒకవేళ అలా లీజు పెంచితే తొలి పదేళ్లకు స్థూల ఆదాయంలో 4.2 శాతం వాటా, ఆ తర్వాత మళ్లీ పదేళ్లకు లీజు పొడిగిస్తే 8.4 శాతం ఆదాయం ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం తన వాటా అమ్మేసుకోవడంతో ఇక ఆ ఆదాయం వాటా రానట్లే!


ఎలా చూసినా నష్టదాయకమే!

డీవీఎస్‌ రాజు, ఇతర కంపెనీల వాటాలను అదానీకి కట్టబెట్టడంలో తెరవెనక వ్యవహారాలు జరిగాయన్న ప్రచారం నడిచింది. మరోవైపు ప్రభుత్వానికి చెందిన వాటాల అమ్మకం, అమ్మకపు విలువను నిర్ణయించడంపై మాత్రం తీవ్ర విమర్శలొచ్చాయి. పోర్టు అనుమతికోసం అన్ని అనుమతులను అప్పట్లో ప్రభుత్వమే తెచ్చింది. విశాఖపట్నం పోర్టు ఉండగా...అక్కడే మరో పోర్టు ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వకున్నా..రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పించింది. గంగవరం పోర్టు ప్రభుత్వానిదే అని చెప్పి, ప్రభుత్వ భాగస్వామ్యం దానిలో ఉండడం చూపించి అనుమతులు తెచ్చారు. మరోవైపు ఆ పోర్టుకు ఇచ్చిన ప్రభుత్వ భూముల విలువ కూడా ఇప్పటి మార్కెట్‌ విలువ ప్రకారం చాలా ఎక్కువ. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ వాటాకు చెందిన షేర్‌ విలువను కూడా రూ.120చొప్పునే కట్టడం సరికాదంటున్నారు. మరోవైపు అసలు ఈ పోర్టులో వాటాను అమ్మాల్సిన పనిలేదని, అలా చేయడం బంగారు గుడ్లుపెట్టే బాతును ఒకేరోజు కోసుకుని తినేయడం లాంటిదేననే వ్యాఖ్యానాలు వినిపించాయి.

Updated Date - 2021-09-18T08:11:26+05:30 IST