నేడు, రేపు సార్వత్రిక సమ్మె
జిల్లాలో సమ్మెకు సమాయత్తమవుతున్న కార్మికులు
పలు ట్రేడ్ యూనియన్ల మద్దతు
కార్మిక చట్టాలను కాలరాయడంపై ఆగ్రహం
సార్వత్రిక సమ్మెకు జిల్లాలోని కార్మికులు సమాయత్తమవుతున్నారు. కార్మిక హక్కులను కాలరాయడం.. ప్రైవేటుకు ద్వారాలు తెరవడం.. ఉద్యోగ, కార్మికుల భద్రతను ప్రశ్నార్థకం చేయటం.. కార్మికుల సంక్షేమాన్ని మరిచి కార్పొరేట్లకు సాగిలపడటం వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా.. కార్మిక వర్గం ఉక్కు పిడికిలి బిగించింది. పాలకుల నియంతృత్వ విధానాలపై కన్నెర్ర చేస్తోంది. అందులో భాగంగా సోమ, మంగళవారాల్లో జిల్లావ్యాప్తంగా కార్మికులు సార్వత్రిక సమ్మెలోకి వెళుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు అమలు చేస్తున్న నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఐక్యంగా సమ్మె బాట పడుతున్నాయి. కేంద్ర కార్మికసంఘాలు, ఉద్యోగ, పారిశ్రామిక ఫెడరేషన్లు కలిసి సమ్మె శంఖారావాన్ని మోగిస్తున్నాయి. జిల్లాలో సీఐటీయూ నేతృత్వంలో పక్షం రోజులుగా ప్రచార జాతాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూసీ, ఐఎన్టీయూసీ వంటి అనేక సంఘాలు సమ్మెను విజయవంతం చేయటానికి కృషి చేస్తున్నాయి. సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఒక్కటిగా సోమ, మంగళవారాల్లో జరిగే సార్వత్రిక సమ్మెకు సన్నద్ధమయ్యారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలనేది కార్మిక వర్గం ప్రధాన డిమాండ్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఒప్పంద, డైలీవేజ్, ఎన్ఎంఆర్ కార్మికుల క్రమబద్ధీకరణ జరగటం లేదు. సమాన పనికి సమాన వేతనం అమలులోనే లేదు. అందరితో సమానంగా పనిచేస్తున్నా, వేతనాల్లో అసమానత్వం కనిపిస్తోంది. స్కీమ్ వర్కర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. లేబర్ కోడ్లతో కార్మిక రంగం తీవ్రంగా నష్టపోతోంది. లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు పోరు సలుపుతున్నాయి. కార్మికుల సంక్షేమాన్ని పాలకులు మరవడం, కార్మిక శాఖలను నిర్వీర్యం చేయడంపై కార్మికులు మండిపడుతున్నారు. అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనాలు లేవు. సంఘటిత రంగ కార్మికులైన అంగన్వాడీ, ఆశా, జాతీయ ఆరోగ్య మిషన్, సర్వశిక్షాఅభియాన్, మధ్యాహ్న భోజనం పథకంలో పనిచేసే స్కీమ్ వర్కర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం దయ లేకుండా వ్యవహరిస్తోంది. అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంట్రాక్టు కార్మికులందరికీ సమాన వేతనాలు ఇస్తామని చెప్పుకొచ్చిన ప్రభుత్వం కొందరికే అవకాశం కల్పించింది. ఈ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త కార్మిక సంఘాల పిలుపు మేరకు సార్వత్రిక సమ్మెలో పాల్గొనేందుకు కార్మికులు సమాయత్తమయ్యారు.