‘వొడా’పై జియో ఫిర్యాదు... ట్రాయ్ కీలకాదేశాలు...

ABN , First Publish Date - 2021-12-09T01:03:00+05:30 IST

మరో నెట్‌వర్క్‌కు మారాలనుకునే(పోర్టింగ్‌) వినియోగదారులకు అనుకూలంగా టెలికం రంగ నియంత్రణ సంస్థ)ట్రాయ్) నిర్ణయాలను తీసుకుంటోంది.

‘వొడా’పై జియో ఫిర్యాదు... ట్రాయ్ కీలకాదేశాలు...

ముంబై : మరో నెట్‌వర్క్‌కు మారాలనుకునే(పోర్టింగ్‌) వినియోగదారులకు అనుకూలంగా టెలికం రంగ నియంత్రణ సంస్థ)ట్రాయ్) నిర్ణయాలను తీసుకుంటోంది. ఇదే క్రమంలో... టారిఫ్‌ ఓచర్, ప్లాన్లతో సంబంధం లేకుండా ఎస్‌ఎంఎస్‌ సదుపాయాన్ని తక్షణం కల్పించాలంటూ టెల్కోలకు ట్రాయ్‌ ఆదేశాలు జారీ చేసింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్‌ మొబైల్‌ యూజర్లందరికీ వీటిని  వర్తింపచేయాలని సూచించింది. అంతేకాకుండా...  పోర్టింగ్‌ కోసం నిర్దిష్ట కోడ్‌ను(యూపీసీ) పొందడానికి 1900 కు ఎస్‌ఎంఎస్‌ పంపే వెసులుబాటు కల్పించాల్సిందేనని స్పష్టం చేసింది. 


నిజానికి ఇతర నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లు 1900 కు ఎస్‌ఎంఎస్‌ చేయాల్సి ఉంటుంది. ఆపై ఫోన్‌కు వచ్చే కోడ్‌ను తాము మారాలనుకుంటున్న నెట్‌వర్క్ ఆపరేటరుకు తెలియజేయాల్సి ఉంటుంది. అప్పుడే నెట్‌వర్క్ మారడానికి అవకాశముంటుంది. కాగా...  కొన్ని టెక్కోలు తామందించే ప్లాన్లలో భాగంగా ఎస్‌ఎంఎస్‌ ప్యాకేజీలను అందించడం లేదు. ఇది వేరే నెట్‌వర్క్‌కు మారాలనుకునే యూజర్లకు ఇబ్బందికరంగా మారుతోంది. తమ ప్రీపెయిడ్‌ ఖాతాల్లో తగినంత బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ ఎస్‌ఎంఎస్‌ ప్యాకేజీ లేదన్న కారణంతో పోర్టింగ్ రిక్వెస్ట్ పంపకుండా టెల్కోలు అడ్డుకుంటున్నాయి.


దీంతో... ఎస్‌ఎంఎస్‌ సర్వీస్ కోసం ప్రత్యేక ప్యాకేజీ తప్పనిసరవుతోంది.  దీనిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క ప్యాకేజీ కోసం ప్రత్యేకంగా రీచార్జ్ అంటే వినియోగదారుడికి అదనపు భారమవుతోందన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలో... టెలికాం ఆపరేటర్లు అమలుచేస్తోన్న కొత్త విధానంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రత్యేకించి... ఈ విధానాన్ని వొడాఫోన్‌ ఐడియా(వీఐఎల్‌) సంస్థ అమలుచేస్తోంది. దీంతో కొత్త ప్లాన్లపై రిలయన్స్‌ జియో సంస్థ ట్రాయ్‌కు ఫిర్యాదు చేసింది. వీఐఎల్‌ ఇటీవల 18–25 % మేర టారిఫ్‌లు పెంచిన విషయం తెలిసిందే. కొత్త టారిఫ్‌ల ప్రకారం 28 రోజుల వేలిడిటీ ఉండే ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ రేటును ఎస్‌ఎంఎస్‌ సర్వీసు లేకుండా రూ. 99 కు పెంచివేసింది. ఇక ఎస్ఎంఎస్ సౌకర్యం కావాలంటే రూ. 179 పైనే వినియోగదారుడు వెచ్చించాల్సి వస్తోంది. ఈ నేపధ్యంలో ట్రాయ్ ఆదేశాలు జారీ అయ్యాయి. 

Updated Date - 2021-12-09T01:03:00+05:30 IST