సూర్యుడిపై విస్ఫోటనం.. భూమివైపు దూసుకొస్తున్న అగ్నికీలలు.. రేపు ఏం జరగబోతోంది..

ABN , First Publish Date - 2022-07-23T00:56:39+05:30 IST

సూర్యుడి మూలకేంద్రకం నుంచి సౌర ద్రవ్యపదార్థ ఉద్గారం(Coronal mass ejections) జరిగింది.

సూర్యుడిపై విస్ఫోటనం.. భూమివైపు దూసుకొస్తున్న అగ్నికీలలు.. రేపు ఏం జరగబోతోంది..

 కోల్‌కతా : విస్పోటనం కారణంగా సూర్యుడి (Sun) మూలకేంద్రకం నుంచి సౌర ద్రవ్యపదార్థ ఉద్గారం(Coronal mass ejections) జరిగింది. గురువారం జరిగిన ఈ విస్పోటనంతో భారీగా అగ్నికీలలు వెలువడ్డాయి. దీంతో ప్లాస్మా(ఐయాన్, ఎలక్ట్రాన్లతో నిండివున్న కణాలు), అయస్కాంత క్షేత్రాలతో కూడిన ఉష్ణ వికిరణాలు భూమివైపు వేగంగా దూసుకొస్తున్నాయి. భూఆయస్కాంతావరణాన్ని(Earth's magnetic field ) తాకే అవకాశాలున్నాయని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కోల్‌కతా ఆధ్వర్యంలో పనిచేసే ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్’ గుర్తించింది. సూర్యుడి ఉపరితలంపై భారీ మూలరంధ్రాన్ని గుర్తించినట్టు, దాని నుంచి చాలా వేగంగా వస్తున్న ద్రవ్యపదార్థ ఉద్గారాన్ని పసిగట్టినట్టు వివరించింది. భూఅయస్కాంత తుఫాను(Geomagnetic storm)కు దారితీసే అవకాశాలున్నాయని పేర్కొంది.


సూర్యుడిపై సోలార్ క్రియాశీల ప్రాంతాలు ఏఆర్13056, ఏఆర్13057 నుంచి అగ్నికీలలు వెలువడ్డాయని చెప్పింది. సూర్యుడి ఉపరితలం పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని కనుగొన్నామని ట్విటర్ ద్వారా తెలిపింది. ఇక ఏఆర్3060 లో జులై 21న విస్పోటనం సంభవించింది. దీని నుంచి సీ5- కేటగిరి సౌర మంటలు, సోలార్ సునామీ వెలువడిందని స్పేస్‌వెదర్.కామ్ (spaceweather.com) తెలిపింది. ఈ మంటలను నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్సర్వేటరీ కూడా గుర్తించింది. తీవ్రమైన అతినీలలోహిత స్థాయి షాక్‌వేవ్స్‌ను ఉద్గారించినట్టు తెలిపింది. ఈ షాక్‌వేవ్‌ల ప్రభావంతో టైప్-2 సోలార్ రేడియో విస్పోటనానికి దారితీస్తుంది. అంటే గంటకు 38,26,800 కిలోమీటర్ల వేగంతో సౌర ద్రవ్యపదార్థాలు ప్రయాణిస్తాయి. వీటి ప్రభావంతో జీ1 నుంచి జీ2(మిత నుంచి మధ్యస్థ) స్థాయి భూఅయస్కాంత తుఫానులు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీటి ప్రభావం ప్రతికూలంగా ఉండదు. ఇక జీ3 కేటగిరిగా మారే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నేషనల్ ఓషియనిక్ అండ్ అట్మోస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.


భూ వాతావరణంలోకి భారీగా సౌరశక్తి ప్రవేశిస్తేనే భూఅయస్కాంతావరణంలో మార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. వీటినే భూఅయస్కాంత తుఫానులు(Geomagnetic storms) వెల్లడించారు. తీవ్రమైన భూఅయస్కాంత తుఫానులు సంభవిస్తే శాటిలైట్ల పనితీరుపై ప్రభావం పడుతుంది. వాటి కక్ష్యల్లోని ఉపగ్రహాలను నియంత్రించడం కష్టమవుతుంది. శాటిలైట్ల ఎలక్ట్రానిక్స్ కూడా దెబ్బతింటాయి. స్టాటిక్- ఎలక్ట్రానిక్ చార్జింగ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. వ్యోమగాములు, అత్యధిక ఎత్తులో ఉండే పైలెట్లపై రేడియేషన్ స్థాయి కూడా పెరుగుతుంది.


పెద్ద పేలుడు కారణంగా అగ్నికీలలు లేదా రేడియేషన్ దహనం చర్యల వల్ల నక్షత్రం నుంచి ప్లాస్మా తరచూ  వెలువడుతుంటుంది. తీవ్రత బట్టి అది ఎన్నో మైళ్ల దూరం ప్రయాణించి అంతరిక్షంలోకి కూడా దూసుకొచ్చే అవకాశం ఉంటుంది. వేగం ఎంతగా ఉంటుందంటే గంటల వ్యవధిలోనే వేల మైళ్లు ప్రయాణించగలవు. సౌరపదార్థం ప్రయాణించే ఈ మార్గంలో గ్రహాలతోపాటు స్పేస్‌క్రాఫ్ట్‌లపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి.

Updated Date - 2022-07-23T00:56:39+05:30 IST