వెన్నంటి వస్తున్న విప్లవ వారసత్వం

ABN , First Publish Date - 2022-04-13T06:41:19+05:30 IST

అణు భౌతికశాస్త్రంలో పరిశోధనా విద్యార్థి (పిహెచ్‌.డి)గా గోల్డ్‌ మెడల్‌ అందుకోవడమే కాకుండా చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలను..

వెన్నంటి వస్తున్న విప్లవ వారసత్వం

ఫలానా ఫలానా మనిషి, ఖచ్చితంగా ఫలానా మనిషే ఒక నిర్దిష్ట కాలంలో ఒక నిర్దిష్ట దేశంలో ఉద్భవించడమనేది పూర్తిగా యాదృచ్ఛికమైనది. అయితే అతడే లేకపోయినట్లయితే అతనికి ప్రత్యామ్నాయం అవసరమవుతుంది. ప్రత్యామ్నాయంగా నిలిచే వ్యక్తి దొరుకుతాడు కూడా, మంచో చెడో మొత్తానికి దీర్ఘకాలంలో అతడు దొరుకుతాడు’.

– ఫ్రెడరిఖ్‌ ఎంగెల్స్‌


అణు భౌతికశాస్త్రంలో పరిశోధనా విద్యార్థి (పిహెచ్‌.డి)గా గోల్డ్‌ మెడల్‌ అందుకోవడమే కాకుండా చరిత్ర, సాహిత్యం, తత్వశాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేసిన జార్జిరెడ్డి కల్లోల దశాబ్దంలో ఉద్భవించిన సునిశిత ప్రజామేధావి. విద్యార్థి ఉద్యమాన్ని విప్లవీకరించిన నాయకుడు. 1947 జనవరి 15న పాలక్కాడ్‌ (కేరళ)లో జన్మించిన జార్జి తన 25వ ఏట (ఏప్రిల్‌ 14, 1972) ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనువాద గూండా శక్తుల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారు. సజీవుడై ఉంటే ఇపుడు ఆయనకు 75 సంవత్సరాలు పూర్తయ్యేవి.

జార్జిరెడ్డి ఒక వ్యక్తే అయినా ‘అమృతోత్సవాల’ను మరిపించే విధంగా అసంఖ్యాక భారతీయులు ప్రత్యేకించి తెలుగు ప్రజలు ఇంకా ఆయన్ను తమ గుండెల్లో నిలుపుకున్నారు. ఇలా ఆయన్ను స్మరించుకుంటున్న వాళ్లలో నాలాగే చాలామంది జార్జిని ప్రత్యక్షంగా ఎరిగిన వాళ్లు కాదు. ఆయన సమకాలికులు కొంతమంది జీవించి లేకున్నా రెండుతరాలుగా జార్జిరెడ్డి విప్లవ వారసత్వం (Legacy) కొనసాగుతుండడం ఎవరూ కాదనలేని సత్యం. భావ–భౌతికవాదాల తాత్విక సంఘర్షణ, సామాజిక రంగంలో వీటికి ప్రాతినిధ్యం వహించే వర్గపోరాటాల సమాహారమే జార్జిరెడ్డి అస్తిత్వానికి కారణం. ఆ పోరాటాల చరిత్రకు జార్జిరెడ్డి పర్యాయపదం అనుకోవచ్చు. అందుకే జార్జిరెడ్డి విస్మృతిలేని విప్లవనాయకుడయినాడు పోరాటాల్లో నాయకుల ఉద్భవాన్ని, ప్రాధాన్యాన్ని మార్క్సిస్టు మహోపాధ్యాయులు చాటి చెప్పారు. అలాంటి కోవకు చెందిన వాళ్లలో జార్జిరెడ్డి ఒకరు.

చరిత్ర నిర్మాతలు ప్రజలే అయినప్పటికీ, ఆ చరిత్ర నిర్మాణంలో జార్జిరెడ్డి లాంటి గొప్ప వ్యక్తుల పాత్ర, ప్రాధాన్యం కాదనలేని సత్యం. ఆలోచనాపరులు, అనుభవజ్ఞులు, విషయ పరిజ్ఞానం కలిగినవారు అయిన రాజకీయ నాయకులు విప్లవ విజయానికి తప్పనిసరిగా అవసరం. ప్రజా ఉద్యమం ఇలాంటి నాయకులను, వ్యక్తులను సృష్టించుకోవడం చారిత్రకాభివృద్ధి క్రమంలో జరిగే అనివార్య పరిణామం. ఈ యాభై ఏళ్ళలో అలా రూపొందిన ఎంతోమంది జార్జి అందించిన కొరడా కొస నుండి పిడిదాకా చేరుకుని తమ విలువైన ప్రాణాలర్పించారు. జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌, శ్రీపాద శ్రీహరి, మధుసూదన్‌రాజు, కృష్ణారెడ్డి, మారోజు వీరన్న, రంగవల్లి, రిక్కల సహదేవరెడ్డి, నూతన్‌, క్రాంతి, చాంద్‌పాషా, యానాల వీరారెడ్డిల నుండి రియాజ్‌ వరకు డజన్ల కొలది నాయకులు నక్సల్బరీ వెలుగులో ప్రభవించిన జార్జి వారసత్వాన్ని కొనసాగిస్తూ అమరులైన వాళ్లే. జార్జి తదనంతరం భూస్వామ్య–సామ్రాజ్యవాద పీడనలు లేని నిజమైన ప్రజాస్వామ్య భారతాన్ని ఆవిష్కరించుకునే లక్ష్యంతో ఏర్పడ్డ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) ఇలాంటి విప్లవ నాయకులతో పాటు వందల, వేల మంది కార్యకర్తలను సృష్టించుకుంది. ఒక తరాన్నే ప్రభావితం చేసింది. ఒక ప్రత్నామ్నాయ శక్తితో ఎదిగివచ్చిన ఉద్యమం ఎందుకివ్వాల ఉనికి కోసం తండ్లాడుతున్నది? దానికి ప్రధాన కారణం చీలికలు–పేలికలు కాదా! ఫలితంగా అనేకమంది వ్యక్తిగత జీవితాలకు, మరికొంతమంది బూర్జువా రాజకీయాలకు పయనం కాగా, ఇంకా కొద్దిమంది మాత్రం జార్జిరెడ్డి వారసత్వాన్ని ఎత్తిపడ్తున్నారు. ఒక తరం ఆలోచనలనే ప్రభావితం చేసిన జార్జిరెడ్డిని 50 సంవత్సరాలకు మనం మననం చేసుకోవడమంటే, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా జార్జిని పాదుకొల్పడమే (Restore). అందుకు జార్జి వారసత్వ పరంపరను కొనసాగిస్తున్న శక్తులన్నీ ఏకం కావడమే ప్రధానాంశం. నూరేళ్ళ ఉస్మానియా చరిత్రలో అత్యంత ప్రభావశీల వ్యక్తిగా, త్యాగశీలుడిగా, సునిశిత మేధో సంపన్నుడిగా పేరుగాంచి ప్రజల నాల్కల మీద కదలాడుతున్న జార్జిరెడ్డి స్మారకార్థం ఉస్మానియాలో ‘జార్జి స్మారక పరిశోధనా నిలయం’ నెలకొల్పే దిశగా భావసారూప్యత కలిగిన శక్తులంతా ఏకం కావడం రెండో అంశం.

సార్వజనీనమైన శ్రమ సంపదను విజ్ఞానంగా కూర్చి విశ్వమానవులందరికీ అందించడమే విశ్వవిద్యాలయాల విధ్యుక్త ధర్మం. శ్రమకు–విజ్ఞానానికి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్న విద్యార్థులు ఎంతో మంది విశ్వమానవులుగా రూపొందారు. అలాంటి విశ్వమానవుడు చేగువేరా వేషధారణతో శ్రమజీవుల దగ్గరకు పయనమయ్యే ప్రయత్నాలు జార్జి రూపంలో ఆగిపోయినా, ఆయన అమరత్వం తర్వాత ఆ ప్రయత్నాలు తీవ్రమైనాయి. అత్యవసర పరిస్థితి కాలంలో జంపాల చంద్రశేఖర్‌ ప్రసాద్‌, కూర రాజన్న, మధుసూదన్‌ రాజ్‌, జార్జి సోదరుడు సిరిల్‌ రెడ్డి, మైపాల్‌ రెడ్డి తదితరులెంతో మంది విశ్వవిద్యాలయాలు వదిలి ప్రజల్లోకి పోయారు.
2010లో గుజరాత్‌ పోలీసులు నన్ను అరెస్టుచేసి దేశద్రోహం ఆపాదించి ఊపా కేసు మోపడం జరిగింది. తిరిగి 2012లో జైలు నుండి విడుదలైన రోజే అనుకుంటా ఉస్మానియా ఫ్యాకల్టీ క్లబ్‌లో జరిగిన పిడిఎస్‌యు పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు హాజరైనాను. జార్జి మిత్రులు, సహచరులంతా కల్సి నిర్వహించిన 40వ వర్ధంతిలో ‘‘విప్లవ ధ్రువతారా – తొలి తొలి అడుగుల చేగువేరా’’ అనే పాటను అందించాను. ఆయన వారసత్వాన్ని అందుకున్న వాళ్ళంతా, ఈ పదేళ్ళలోనూ విడివిడిగా పయనించడం ఇంకా ఎంతకాలం అంటూ ప్రశ్నించుకుంటూ మళ్ళీ జార్జిని స్మరించుకుందాం.

మా విద్యార్థి దశ నాటికి డాక్టర్‌ అంబేడ్కర్‌ను సామాజిక విప్లవకారునిగా గుర్తించనందుకు ఏప్రిల్‌ 14న జార్జి వర్ధంతి, అదే రోజున అంబేడ్కర్‌ జయంతిని సమన్వయం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు జై భీం – లాల్‌ సలాంలతో వీరిద్దరిని స్మరించుకోవడమే కాదు, దేశమంతా దళిత – విప్లవ – ప్రజాస్వామిక శక్తుల ఐక్యతతో నిజమైన ప్రజా ప్రత్యామ్నాయాన్ని సృష్టించడం జరూరైన కర్తవ్యం. ‘‘జీనా హైతో మర్‌ణా సీఖో– కదం కదం పర్‌ లడ్‌నా సీఖో’’ అనే జార్జిరెడ్డి రణన్నినాదాన్ని ఇప్పుడిలాగే నిర్వచించుకోవాలని నా అభిప్రాయం.

అమర్‌
(ఏప్రిల్‌ 14: జార్జిరెడ్డి 50వ వర్ధంతి)

Updated Date - 2022-04-13T06:41:19+05:30 IST