కొండపై టికెట్‌ దందా!

ABN , First Publish Date - 2020-10-23T10:05:40+05:30 IST

నిబంధనలను పాటించేలా చూడాల్సిన వారే వాటిని తుంగలో తొక్కుతున్నారు.

కొండపై టికెట్‌ దందా!

ఆంధ్రజ్యోతి, విజయవాడ : నిబంధనలను పాటించేలా చూడాల్సిన వారే వాటిని తుంగలో తొక్కుతున్నారు. అడ్డదారుల్లో అడుగులు వేస్తూ సాధారణ భక్తులకు అసౌకర్యం కల్పించడంతోపాటు అమ్మవారి ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో రోజుకు పదివేల మంది భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తామని, నెల రోజుల ముందు ఆన్‌లైన్‌లో టైమ్‌స్లాట్‌ ప్రకారం దర్శనం టికెట్లు బుక్‌ చేసుకున్నవారిని మాత్రమే అనుమతిస్తామని దుర్గగుడి అధికారులు పదేపదే చెబుతూ వచ్చారు. వారు చెప్పినట్లే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకుని వచ్చిన భక్తులకు టైమ్‌స్లాట్‌ ప్రకారం దర్శనం కల్పించడంలో దుర్గగుడి అధికారులు విఫలమవుతున్నారు.


 వినాయకుడి గుడి వద్ద నుంచి క్యూలైన్లలో నడుచుకుంటూ వస్తున్న భక్తులు ఘాట్‌రోడ్డు మీదుగా కొండపైకి చేరుకునేసరికి గంటకు పైగా సమయం పడుతోంది. ఇలా అవస్థలు పడుతూ అమ్మవారి ప్రధాన ఆలయం వద్దకు చేరుకునే సరికి అక్కడ అడ్డదారిలో వస్తున్న భక్తులకు పాలకమండలి సభ్యులు వీఐపీ దర్శనాలు కల్పిస్తున్నారు. దీంతో నెల ముందే టికెట్లు తీసుకున్నవారు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. 


పాలకమండలి టికెట్ల దందా..!

దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు నేతృత్వంలో పాలకమండలి సభ్యులు టికెట్ల దందాకు తెరతీశారు. పాలకమండలి సభ్యులకు, వారి కుటుంబ సభ్యులకు దేవస్థానం రూ.100 టికెట్లను కేటాయిస్తుంది. వాటిపై వీఐపీ ముద్ర ఉంటుంది. ఆ టికెట్లతో వచ్చినవారిని రూ.300 క్యూలైన్లో దర్శనానికి పంపిస్తున్నారు. అయితే పాలకమండలి సభ్యులు ఈ టికెట్లను బయటి వ్యక్తులకు అధిక ధరకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రోజుకు దాదాపు రెండు వేల మందికి ఈ టికెట్లపై దర్శనాలు చేయిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఇలా వచ్చే వారి తాకిడి కారణంగా ముందుగా ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు కొనుగోలు చేసుకుని క్యూలైన్లలో వస్తున్న భక్తులు తమకు కేటాయించిన టైమ్‌స్లాట్‌లో దర్శనం చేసుకునే అవకాశం లేక గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వెనుక ఉన్న భక్తులు నిలబడలేక ముందుకు తోసుకుని వస్తుండటంతో క్యూలైన్లలో భౌతిక దూరమనేదే కనిపించడం లేదు. భక్తుల సంఖ్య తక్కువగానే ఉన్నా, దర్శనానికి గంటల తరబడి సమయం పడుతుండటంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై మూడు రోజులుగా దుర్గగుడి అధికారులతో భక్తులు వాగ్వాదానికి దిగుతున్నారు. గురువారం కూడా దేవస్థానం ఈవో ఎం.వి.సురేశ్‌బాబును ఈ అంశంపై పలువురు భక్తులు నిలదీశారు. అడ్డదారిలో దర్శనాలను నిలువరించలేనప్పుడు ఆన్‌లైన్‌లో టైమ్‌స్లాట్‌ ప్రకారం ఎందుకు టికెట్లు విక్రయించారని ప్రశ్నించారు. భక్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఈవో సురేశ్‌బాబు నీళ్లు నమిలారు. 


చైర్మన్‌ దూకుడుకు పోలీసు బ్రేక్‌

బుధవారం సీఎం వచ్చే ముందు సాక్షాత్తు పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు ఓ కుటుంబాన్ని (సుమారు అరడజను మంది) స్వయంగా వెంటబెట్టుకుని వీఐపీ క్యూలైనులో భక్తులు బయటకు వచ్చే మార్గంలో ఎదురు తీసుకెళుతున్నారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారి ఆయన్ను సీఎం వచ్చే సమయంలో ఇలా తీసుకెళ్లడం ఏమిటంటూ నిలిపివేశారు. క్యూలైన్‌ తాళం వేసేశారు. కాసేపు వాగ్వాదం అనంతరం ఆలయ అధికారులు వచ్చి నచ్చచెప్పడంతో చైర్మన్‌ను, ఆయనతోపాటు వచ్చిన కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారి దర్శనానికి వదిలివేశారు. 

Updated Date - 2020-10-23T10:05:40+05:30 IST