ఇంట్లో నుంచి బైటకు వెళ్లండి: హిందూ సంఘ కార్యకర్తపై మహిళల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-01-01T00:27:07+05:30 IST

మేం ఎవరిని ప్రార్థించాలనే మీరెలా చెప్తారు? అది మా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? నేను బొట్టు పెట్టుకోకపోతే మీకెందుకు? అవసరమైతే తాళికూడా తీసి పడేస్తా. మీరెవరు అడగడానికి?..

ఇంట్లో నుంచి బైటకు వెళ్లండి: హిందూ సంఘ కార్యకర్తపై మహిళల ఆగ్రహం

బెంగళూరు: ఒకవైపు బొమ్మై ప్రభుత్వం మత మార్పిడి నిరోధక బిల్లును తీసుకువస్తున్న నేపథ్యంలో మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో మత విధ్వేష ఘటనలు పెరుగుతున్నాయి. చర్చిలపై దాడులు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అలాగే క్రైస్తవులు లక్ష్యంగా జరుగుతున్న అనేక ఇతర ఘటనలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని తుమకూరులో మంగళవారం ఓ క్రైస్తవ కుటుంబం ఇంట్లోకి చొచ్చుకువెళ్లి మతమార్పిడిపై ప్రశ్నించిన ఓ హిందూ సంఘానికి చెందిన కొంత మంది కార్యకర్తలను ఆ కుటుంబంలోని మహిళలు గట్టిగా ప్రతిఘటించారు. తమను ప్రశ్నించడానికి మీరెవరంటూ హిందూ సంఘానికి చెందిన ఆ కార్యకర్తలను నిలదీశారు. ‘‘ముందు ఇంట్లో నుంచి బయటకు నడవండి’’ అంటూ ఇంట్లో నుంచి పంపించేశారు.


దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ప్రకారం.. ఓ హిందూ సంఘానికి చెందిన కొంత మంది కార్యకర్తలు ఒక ఇంట్లోకి ప్రవేశించి క్రిస్మస్ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రవ్నించారు. ఇంట్లో ఉన్న మహిళలకు బొట్టు లేకపోవడాన్ని వారు తీవ్రంగా తప్పు పట్టారు. మహిళలు బొట్టు పెట్టుకోకుండా ఉండడం హిందూ సంప్రదాయం కాదని, మతం ఎందుకు మారారంటూ కుటుంబాన్ని దబాయించారు.


అయితే వీరిని సదరు కుటుంబంలోని మహిళలు తీవ్రంగా ప్రతిఘటించారు. ‘‘మేం ఎవరిని ప్రార్థించాలనే మీరెలా చెప్తారు? అది మా విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అసలు మమ్మల్ని ప్రశ్నించడానికి మీరెవరు? నేను బొట్టు పెట్టుకోకపోతే మీకెందుకు? అవసరమైతే తాళికూడా తీసి పడేస్తా. మీరెవరు అడగడానికి? ముందు మా ఇంట్లో నుంచి బయటికి వెళ్లండి’’ అని ఇంట్లోని మహిళలు ప్రతిదాడికి పాల్పడ్డంత పని చేశారు. పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడి నుంచి హిందూ సంఘ కార్యకర్తలు వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

Updated Date - 2022-01-01T00:27:07+05:30 IST