ఈ సమయంలో గర్భం దాల్చవచ్చా?

ABN , First Publish Date - 2022-01-20T05:21:32+05:30 IST

డాక్టర్‌! నా పేరు మేఘన. నేను 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను. మాకు ఇటీవలే పెళ్లైంది. పిల్లలను కనాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ప్రస్తుత ఒమైక్రాన్‌ వ్యాప్తి గురించి భయపడుతున్నాం.

ఈ సమయంలో గర్భం దాల్చవచ్చా?

డాక్టర్‌! నా పేరు మేఘన. నేను 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను. మాకు ఇటీవలే పెళ్లైంది. పిల్లలను కనాలనే ఆలోచనలో ఉన్నాం. అయితే ప్రస్తుత ఒమైక్రాన్‌ వ్యాప్తి గురించి భయపడుతున్నాం. గర్భం దాల్చడానికి ఇది సరైన సమయమేనా? ఇప్పుడు గర్భం దాల్చడం వల్ల ఏవైనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందా? 

                                                                                                                    - ఓ సోదరి, ఖమ్మం.

కొవిడ్‌ సమయంలో గర్భం దాల్చడం అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. అయితే గర్భం దాల్చడానికంటే ముందు తప్పనిసరిగా వ్యాక్సిన్లు వేయించుకుని ఉండడం, ప్రస్తుత సమయంలో అన్నిటికంటే ముఖ్యమైన విషయం. వ్యాక్సినేషన్‌ వల్ల కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ దక్కుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే వ్యాక్సిన్‌ వేయించున్నప్పటికీ, గర్భం దాల్చిన మహిళలకు కొవిడ్‌ సోకే అవకాశాలు లేకపోలేదు. గర్భిణులకు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌తో రిస్క్‌ ఎంతో తక్కువే ఉన్నప్పటికీ, కొన్ని కాంప్లికేషన్లకూ ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకూ జరిపిన అధ్యయనాల్లో గర్భిణులకు కొవిడ్‌ సోకడం మూలంగా పుట్టే పిల్లల్లో అవలక్షణాలు తలెత్తినట్టు ఎక్కడా రుజువు కాలేదు. అలాగే పుట్టిన పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉంటున్నట్టు కూడా రుజువు కాలేదు. అయితే గర్భం దాల్చిన 28 వారాల తర్వాత కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకితే, పిల్లలు నెలలు నిండకుండా పుట్టే వీలుంది. బిడ్డ చనిపోయి కూడా పుట్టవచ్చు. కాబట్టి ప్రస్తుత సమయంలో గర్భం దాల్చిన మహిళలు ఫోలిక్‌ యాసిడ్‌, మల్టీ విటమిన్‌, జింక్‌ సప్లిమెంట్లు తప్పక తీసుకోవాలి. అలాగే గర్భం దాల్చింది మొదలు వైద్యుల పర్యవేక్షణలో నడుచుకుంటూ, వారు సూచించే పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అలాగే కొవిడ్‌ నియమాలు తప్పక పాటించాలి. గర్భం దాల్చిన తర్వాత తీవ్రమైన కాంప్లికేషన్లకు గురవకుండా ఉండాలంటే, గర్భధారణకు ముందే వ్యాక్సిన్లు వేయించుకోవడం అవసరం. 

                                                                                                                డాక్టర్‌ మంజుల అనగాని,

                                                                                                అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

                                                                                                          కేర్‌ హాస్పిటల్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-01-20T05:21:32+05:30 IST