రాష్ట్రంలో మత్తును వదిలించండి

ABN , First Publish Date - 2022-01-29T07:33:06+05:30 IST

‘‘రాష్ట్రంలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లను కూకటి వేళ్లతో పెకిలించివేయండి. రాష్ట్రంలో ‘మత్తు’ను వదిలించండి.

రాష్ట్రంలో మత్తును వదిలించండి

  • డ్రగ్స్‌ను మొగ్గలోనే తుంచివేయాలి
  • ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయండి
  • తొలుత వ్యూహంలో డీఅడిక్షన్‌పై దృష్టిపెట్టండి
  • ఎక్కడికక్కడ డ్రగ్స్‌ రాకెట్‌ను అడ్డుకోవాలి
  • అన్నివర్గాలను అందులో భాగస్వామ్యం చేయాలి
  • 1,000 మందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయండి
  • ఉత్తమ ప్రతిభ కనబరిస్తే యాగ్జిలరీ ప్రమోషన్లు
  • నేరస్థులకు ఏ పార్టీవారు అండగా ఉన్నా వెనక్కితగ్గొద్దు
  • ఒక రైతు గంజాయిని పండిస్తే 
  • ఆ ఊరు మొత్తానికి రైతుబంధు, సంక్షేమాలు బంద్‌
  • డ్రగ్‌ పెడ్లర్లపై పీడీ చట్టాన్ని ప్రయోగించండి
  • సినిమాలు, సోషల్‌ మీడియాలూ డ్రగ్స్‌కు కారణం
  • పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల సదస్సులో కేసీఆర్‌


హైదరాబాద్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్రంలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లను కూకటి వేళ్లతో పెకిలించివేయండి. రాష్ట్రంలో ‘మత్తు’ను వదిలించండి. ఇందుకోసం ద్విముఖ వ్యూహం పాటించండి. తొలి వ్యూహంలో డ్రగ్స్‌కు బానిసలను గుర్తించి, వారిని డీఅడిక్ట్‌ చేయండి. రెండో వ్యూహంలో డ్రగ్స్‌ నెట్‌వర్క్‌లు, పెడ్లర్ల పీచమణచండి. ఎక్కడికక్కడ డ్రగ్స్‌ ముఠాలను కట్టడి చేయండి. సామాజిక మహోద్యమాన్ని చేపట్టి.. అన్నివర్గాలు భాగస్వామ్యమయ్యేలా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గంజాయి, నార్కోటిక్స్‌ వినియోగాన్ని కూకటివేళ్లతో పెకిలించాలనే లక్ష్యంతో శుక్రవారం ఆయన ప్రగతిభవన్‌లో రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్‌ అధికారుల సదస్సులో మాట్లాడారు. నార్కోటిక్స్‌ ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తోన్న దుర్వ్యసనమని, సమాజానికి పట్టిన చీడపురుగు అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణలో ఇప్పుడిప్పుడే డ్రగ్స్‌ మహమ్మారి ప్రవేశిస్తోంది. గంజాయి, ఎల్‌ఎ్‌సడీ, కొకైన్‌ వంటి మత్తుపదార్థాల వినియోగం ప్రాథమిక దశలో ఉంది. దీన్ని మొగ్గ దశలోనే సమూలంగా తుంచివేయాలి. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయండి. వెయ్యి మంది సుశిక్షితులైన పోలీసు సిబ్బందిని నియమించండి. ఈ వింగ్‌లో పనిచేస్తూ.. ఉత్తమ ప్రతిభ కనబరిచే వారికి యాగ్జిలరీ ప్రమోషన్లు, అవార్డులు, రివార్డులు ఉంటాయి. ఇప్పటికే తెలంగాణ ఎస్‌ఐబీ, గ్రేహౌండ్స్‌ తదితర వ్యవస్థలు ఆదర్శంగా పనిచేస్తున్నాయి. డ్రగ్స్‌ వింగ్‌ కూడా అదేవిధంగా శక్తిమంతంగా, తేజోమంతంగా పనిచేయా లి’’ అని కేసీఆర్‌ ఆకాంక్షించారు. 


డ్రగ్స్‌ వింగ్‌ అధికారులు అధునాతన ఆయుధాలను వినియోగించాలన్నారు. స్కా ట్‌లాండ్‌ పోలీసులను ఆదర్శంగా తీసుకోవాలని, డ్రగ్స్‌ నియంత్రణలో విజయం సాధించిన దేశాల్లో అధ్యయనం చేయాలని, పంజాబ్‌లో డ్రగ్స్‌ నిరోధక విభాగం అధికారులను రాష్ట్రానికి పిలిపించి, వారి వద్ద శిక్షణ పొందాలని సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిందితుల వెనక ఎంతటివారున్నా.. ఏ పార్టీకి చెందిన వారైనా.. వారు చేసే సిఫార్సులను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలని.. నిందితులపై పీడీ చట్టాన్ని ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. న్యాయస్థానాల్లో కేసులు వీగిపోకుండా ఉండేందుకు పకడ్బందీ ఫోరెన్సిక్‌ వ్యవస్థను ఏర్పా టు చేసుకుని, న్యాయనిపుణుల సలహాలను తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా గంజాయి పండించేవారి పట్ల ప్రభుత్వం సీరియ్‌సగా ఉంటుందని హెచ్చరించారు. ‘‘ఎ క్కడైనా రైతులు గంజాయి సాగుచేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే.. ఆ గ్రామం మొత్తానికి రైతుబంధు, ఇతర సంక్షేమ పథకాలను నిలిపివేస్తాం’’ అని సీరియ్‌సగా చెప్పారు. 


అడవుల్లో సాగవుతున్న గంజాయి వివరాలను సేకరించి, వాటిని నాశనం చేయాలని సూచించారు. డ్రగ్స్‌ నియంత్రణను ఓ సామాజిక ఉద్యమంగా చేపట్టాలన్నారు. ‘‘ఈ ఉద్యమంలో గ్రామ సర్పంచులు, టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులతో సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రజలను భాగస్వాములను చేయాలి. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలి’’ అని సీఎం ఆకాంక్షించారు. సినిమా, సోషల్‌ మీడియా, సాంస్కృతిక, ఆన్‌లైన్‌ వేదికలు కూడా డ్రగ్స్‌ వాడకం పెరగడానికి కారణాలుగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నైజీరియా లాంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ నేరాలకు పాల్పడుతున్న వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇక్కడ అక్రమంగా ఉంటూ.. నేరాలకు పాల్పడే విదేశీయులను గుర్తించి, డీపోర్ట్‌(వారి దేశాలకు పంపించడం) చేయాలని డీజీపీని ఆదేశించారు.


రాష్ట్రంలో మూసివేసిన పరిశ్రమలే అడ్డాగా డ్రగ్స్‌ రాకెట్లు మత్తుపదార్థాలను తయారు చేస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. దీనిపై సీఎం సీరియ్‌సగా స్పందిస్తూ.. అలాంటి పరిశ్రమలను గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్‌ వినియోగం జరుగుతున్నట్లు తేలితే.. వాటి లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని పబ్బుల యజమానులతో సమావేశం ఏర్పాటుచేసి, వారికి నిర్దిష్టమైన ఆదేశాలివ్వాలని డీజీపీకి సూచించారు. పబ్బులు, బార్లలో తరచూ డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించాలన్నారు. పోలీసులు, ఎక్సైజు అధికారులు డ్రగ్‌ పెడ్లర్లు, ముఠాల నుంచి లంచాలు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినా.. కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ‘‘గుడంబా తయారీని పూర్తిస్థాయిలో నిర్మూలించాం. పేకాటను నియంత్రించాం. ఇప్పుడు డ్రగ్స్‌ విషయంలోనూ అలాంటి పురోగతిని సాధించాలి. విద్యాసంస్థల యాజమాన్యాలు, డీఈవోలతో సమావేశాలు ఏర్పాటు చేయాలి. విద్యార్థి దశలో డ్రగ్స్‌ వినియోగాన్ని నిర్మూలించాలి. సోషల్‌ మీడియా వేదికగా సాగే డ్రగ్స్‌ దందాను ఎప్పటికప్పుడు గుర్తించి, అడ్డుకోవాలి. తెలంగాణ వ్యవస్థీకృత నేరాల నిరోధక చట్టాన్ని తిరిగి అమలు చేసే దిశలో ప్రభుత్వం ఆలోచిస్తోంది’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్రం అనేక బాధలు పెట్టిందని, వాటిని అధిగమించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ‘‘పోలీస్‌ యంత్రాగం అద్భతంగా పనిచేస్తోంది. క్రైమ్‌ డిటెక్షన్‌లో సీసీ కెమెరాలు గొప్పగా ఉపయోగపడుతున్నాయి. నేరస్థులను వెంటనే పట్టుకోగలుగుతున్నాం. వామపక్ష తీవ్రవాదం విషయంలో తెలంగాణ పోలీసులు బాగా పనిచేస్తున్నారు. ఎస్‌ఐబీ, గ్రే హౌండ్స్‌, కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ వ్యవస్థలు పకడ్బందీగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను నిర్మించుకున్నాం. దాన్ని మార్చిలో ప్రారంభించుకుంటాం. శాంతిభద్రతలు అదుపులో ఉండడం వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. స్టార్ట్‌పలు విజయం సాధిస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు. 


ఈ సదస్సులో మంత్రులు మహమూద్‌ అలీ, వి.శ్రీనివాస్‌ గౌడ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్‌, మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, రెడ్యానాయక్‌, రవీంద్ర కుమార్‌, ఆళ్ల వెంకటేశ్వర్‌ రెడ్డి, రాజేందర్‌ రెడ్డి, గాదరి కిశోర్‌, సాయన్న, రేఖా నాయక్‌, అబ్రహం, హన్మంతు షిండే, సుంకె రవిశంకర్‌, కృష్ణ మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు సీవీ ఆనంద్‌, స్టీఫెన్‌ రవీంద్ర, మహేశ్‌ భగవత్‌, సీఎంవో అధికారులు నర్సింగ రావు, భూపాల్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుపా,్త ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.


మొగులయ్యకు ఇల్లు, రూ. కోటి

తెలంగాణ నుంచి ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన కిన్నెరమొట్ల కళాకారుడు దర్శనం మొగులయ్యకు హైదరాబాద్‌లో ఇంటి స్థలం, నిర్మాణ ఖర్చు, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. మొగులయ్య శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణ గర్వించదగ్గ కళా రూపాన్ని కాపాడుతున్న మొగులయ్య అభినందనీయుడిన సీఎం ఈ సందర్భంగా కొనియాడారు. తెలంగాణ కళలను పునరుజ్జీవించ చేసుకుంటూ కళాకారులను గౌరవిస్తూ వారిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Updated Date - 2022-01-29T07:33:06+05:30 IST