సేవలు సరే.. సిబ్బందేరి?

Jun 16 2021 @ 23:53PM

జీజీహెచ్‌ను వెంటాడుతున్న వైద్య సిబ్బంది కొరత

1,000 పడకల ఆసుపత్రికి అరకొర వైద్యులే

కరోనా తగ్గినా.. భయపెడుతున్న బ్లాక్‌ ఫంగస్‌

జీజీహెచ్‌లో మొత్తం 200 మంది బాధితులు

సేవలందించేది ఏడుగురు వైద్యులే

మందులు లేవ్‌.. శస్త్రచికత్సల పరికరాలూ లేవ్‌

ఆపరేషన్‌ థియేటర్‌ కూడా ఒక్కటే..

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందాలి. ప్రతి ఐదుగురు రోగులకు ఒక నర్సు, ప్రతి పదిమంది రోగులకు ఒక డాక్టర్‌ ఉండాలి. ప్రతి రోగి వద్దకు డాక్టర్‌ వెళ్లాలి. వారికి తగిన వైద్యం అందించి ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించకూడదు.

(విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అందుతున్న వైద్యసేవలపై మంగళవారం జీజీహెచ్‌ వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా కలెక్టర్‌ నివాస్‌ చేసిన వ్యాఖ్యలివి..)

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉంటే కలెక్టర్‌ చెప్పినట్టుగానే వైద్య సేవలు అందించవచ్చు. 1,000 పడకలు కలిగిన పెద్దాసుపత్రిలో డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలు, ఇతర నాల్గో తరగతి ఉద్యోగులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాం. మే నెలలో కరోనా బాధితుల తాకిడి తీవ్రంగా ఉన్నప్పుడు ప్రతి 80 మంది కరోనా బాధితులకు ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులే సేవలందించేవారు. ఇప్పుడు కరోనా కేసుల సంఖ్య తగ్గడంతో ప్రతి 40 మందికి ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు నర్సులు సేవలందిస్తున్నారు. వైరస్‌ ఉధృతితో ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నా.. అందుకనుగుణంగా వైద్యులు, నర్సులు, సిబ్బంది నియామకాలు జరపట్లేదు. అవసరమైన అధునాతన వైద్య పరికరాలు లేకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలందించడంలో సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించాలి కదా? 

- కలెక్టర్‌ వ్యాఖ్యలపై ఆసుపత్రి వైద్యాధికారుల అంతర్గత చర్చ ఇది..

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం 200 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు ఉండగా, వారికి చికిత్స అందించేందుకు ఈఎన్‌టీ ప్రొఫెసర్లు ఇద్దరే ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జిల్లా యంత్రాంగం ఇటీవలే ఐదుగురు అసిస్టెంట్లను సమకూర్చింది. దీంతో మొత్తం ఏడుగురు వైద్యులు రెండు యూనిట్లుగా ఏర్పడి బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు సేవలందిస్తున్నారు. అయితే, బాధితులకు అవసరమైన మందులు వెంటవెంటనే ఇస్తూ, ఫంగస్‌ మెదడుకు చేరేలోపే శస్త్రచికిత్సలు నిర్వహిస్తే వ్యాధి నుంచి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యమయ్యే కొద్దీ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, జీజీహెచ్‌లో ప్రస్తుతం 200 మంది బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు చికిత్స పొందుతుండగా, ప్రభుత్వం రోజుకు 400 నుంచి 500 మించకుండా లైపోసోమాల్‌ యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లను సరఫరా చేస్తోంది. అవి బాధితులకు సరిపోవడం లేదు. బాధితులకు అవసరమైన మందులు సరఫరా చేయకుండా వారికి మెరుగైన వైద్యం చేయమంటే ఎలాగంటూ వైద్యులు తలలు పట్టుకుంటున్నారు.

ఒకే ఆపరేషన్‌ థియేటర్‌లో..

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు శస్త్రచికిత్సలు చేయడానికి జీజీహెచ్‌ ఈఎన్‌టీ విభాగంలో ఒక్కటే ఆపరేషన్‌ థియేటర్‌ ఉంది. అందులో రోజుకు ఐదారుగురికి మించి శస్త్రచికిత్సలు నిర్వహించలేకపోతున్నారు. పైగా బాధితుల ముక్కు, కన్ను భాగాల్లోని బ్లాక్‌ ఫంగస్‌ను తొలగించడానికి అవసరమైన డిబ్రైడర్లు లేకపోవడంతో శస్త్రచికిత్సలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ డిబ్రైడర్లను అత్యవసరంగా సమకూర్చాలని దాదాపు నెల క్రితమే జిల్లా అధికారులను కోరగా, ఇటీవల రెండు ఇచ్చారు. వీటితో రోజుకు 5 నుంచి 10 మంది బాధితులకు వైద్యులు శస్త్రచికిత్సలు నిర్వహించగలుగుతున్నారు. ఇంకొక ఆపరేషన్‌ థియేటర్‌, మరికొన్ని పరికరాలను సమకూరిస్తే ఇంకా ఎక్కువ సంఖ్యలో శస్త్రచికిత్సలు నిర్వహించడానికి వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఆపరేషన్లు చేయాల్సిన బాధితులకు ఎంఆర్‌ఐ స్కానింగ్‌లు, సీటీ స్కానింగ్‌లు తీయడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ సాధ్యమైనంత వరకు మెరుగైన వైద్యసేవలందిస్తూ, ఇప్పటి వరకు 70 మందికి పైగా బాధితులకు శస్త్రచికిత్సలు నిర్వహించారు. రోజుకు ఐదారుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేస్తున్నామని చెబుతున్నారు. అయినా కొత్త కేసులు వచ్చి చేరుతుండటంతో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. 

మందుల కొరత తీవ్రం

బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు అత్యవసరమైన లైపోసోమాల్‌ యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షన్లు ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు ఉన్నతాధికారులు రోజూ అరకొరగానే సరఫరా చేస్తున్నారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మాత్రం ఈ ఇంజక్షన్లు దొరకడం లేదు. వాటిని బాధితులే తెచ్చుకోవాలని చెబుతున్నారు. ఒక్కో ఇంజక్షన్‌ బ్లాక్‌లో రూ.50 వేలపైనే అమ్ముతున్నారు. అంత పెద్ద మొత్తంలో వెచ్చించే ఆర్థిక స్థోమత లేనివారు నిస్సహాయంగా ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మందులు అందుబాటులో లేక, సకాలంలో వైద్యం అందక బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు ఇప్పటికే పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. మిగిలిన బాధితులు ప్రాణాలు అరచేత పట్టుకుని పోరాడు తున్నారు. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి మచిలీపట్నం మండలం బుద్దాలపాలేనికి చెందిన టీడీపీ నాయకుడు మధుసూదనరావు ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో మృతిచెందారు. ఇప్పటికైనా అధికారులు  మందులు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.