జీజీహెచ్‌లో మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌

ABN , First Publish Date - 2021-04-23T05:47:35+05:30 IST

ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య వర ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో త్వరలో మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది.

జీజీహెచ్‌లో మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌
క్యాత్‌ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న డాక్టర్‌ మహాలక్ష్మి బృందం

  జీజీహెచ్‌ (కాకినాడ),  ఏప్రిల్‌ 22: ఉభయ గోదావరి జిల్లాల ఆరోగ్య వర ప్రదాయినిగా పేరుగాంచిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్‌)లో త్వరలో మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ అందుబాటులోకి రానుంది. ల్యాబ్‌ ఏర్పాటుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు జీజీహెచ్‌లో క్యాత్‌ ల్యాబ్‌ సౌకర్యం లేకపోవడంతో ప్రాణాపాయంలో ఉన్న నిరుపేద హృద్రోగులు ఏంజియోగ్రామ్‌, ఏంజియో ప్లాస్టీ, గుండెకు స్టంట్‌ కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇందు కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేసి వెచ్చించేవారు. ఏళ్ల తరబడి క్యాత్‌ల్యాబ్‌ కోసం ఉభయ గోదావరి జిల్లాల ప్రజలతో పాటూ విశాఖ సరిహద్దు గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. జీజీహెచ్‌లో మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ డీఎస్‌ఏ ( డిజిటల్‌ సబ్‌స్ర్టాక్షన్‌ ఏంజియోగ్రామ్‌) పరికరం అందుబాటులోకి రావడంతో హృద్రోగులకు కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. క్యాత్‌ల్యాబ్‌ ఏర్పాటు చేయడం కోసం ఆర్‌ఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కోరుకొండ బాబ్జి డీఎంఈగా ఉన్న కాలంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించగా మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ మంజూరు చేశారు. ఇందు కోసం రూ. 2 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో డీఎస్‌ఏ పరికరాన్ని కొనుగోలు చేశారు. ఈ పరికరాన్ని జీజీహెచ్‌లోని మిలీనియం బ్లాక్‌లోని ఆర్‌ఐసీయూ-2 కు ఎదురుగా మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గుండె, కాళ్ల రక్తనాళల్లో రక్తం గడ్డ కట్టినా, ఏంజియోగ్రామ్‌ పరీక్ష ద్వారా స్టంట్‌లు, పేస్‌మేకర్‌ పెరిఫిరల్‌ ఏంజియోప్లాస్టీ చేసి మెరుగైన వైద్యాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఎండీ, డీఎం, కార్డియాలజిస్ట్‌తో పాటు ఇద్దరు కార్డియోథొరాసిక్‌ సర్జన్లు, క్యాత్‌ ల్యాబ్‌ టెక్నీషియన్స్‌, రేడియాలజిస్ట్‌లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. దీంతో పాటు ప్రస్తుతమున్న రేడియోలజిస్ట్‌ విభాగంలో ఉన్న 2 పీజీ సీట్లకు అదనంగా మరో రెండు పీజీ సీట్లు మంజూరు కానున్నాయి. మొబైల్‌ క్యాత్‌ల్యాబ్‌ను జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ బి. సౌభాగ్యలక్ష్మి, రేడియాలజీ హెచ్‌వోడీ డాక్టర్‌ బి.అనూరాఽధ గురువారం పరిశీలించారు. క్యాత్‌ల్యాబ్‌ అందుబాటులోకి రావడం ద్వారా ఉభయగోదావరి జిల్లాలలో ఉన్న నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉపయోగంగా ఉంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి తెలిపారు. క్యాత్‌ల్యాబ్‌ను త్వరలో డీఎంఈ డాక్టర్‌ ఎం. రాఘవేంద్రరావు ప్రారంభించనున్నారన్నారు.

Updated Date - 2021-04-23T05:47:35+05:30 IST