జీజీహెచ్‌లో మారని తీరు!

ABN , First Publish Date - 2022-07-07T03:53:58+05:30 IST

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజుకు 1200 మంది రోగులు వస్తుండగా, 400 మంది వరకు ఇన్‌పేషెంట్‌లుగా చికిత్స పొందుతున్నారు.

జీజీహెచ్‌లో మారని తీరు!
జీజీహెచ్‌లో జరుపుకుంటున్న నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పుట్టిన రోజు వేడుకలు

ఓ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పేరుతో దండకాలు..?

ఆసుపత్రిలోనే పుట్టిన రోజు వేడుకలు 

వైద్య సేవలు విస్మరించి వేడకల్లో నర్సులు 


నెల్లూరు (వైద్యం), జూలై 6 : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రోజుకు 1200 మంది రోగులు వస్తుండగా, 400 మంది వరకు ఇన్‌పేషెంట్‌లుగా చికిత్స పొందుతున్నారు. అయితే ఇక్కడ వైద్య సేవలు సంపూర్ణంగా అందే స్థితి లేదన్నది వాస్తవం. కానీ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఉద్యోగులు తరచూ ఏదొక వివాదంలో చిక్కుకొంటుంటారు. ఇటీవల ఓ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పుట్టిన రోజు వేడుకలు జీజీహెచ్‌లో జరుపుకోవటం ప్రస్తుతం వివాదాస్పదమైంది. గతంలో సచివాయాల్లో రెండు చోట్ల ఇద్దరు ఉద్యోగులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఘటనలో వారిని ప్రభుత్వం ఏకంగా సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని చర్చనీయాంశం అయింది. విధుల్లో ఉన్న స్టాఫ్‌ నర్సులంతా విఽధులను విస్మరించి నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొడంపై ఆసుపత్రిలో పనిచేసే ఉద్యోగులే విమర్శిస్తున్నారు. ఈ సందర్భంగా అనేక మంది రోగులకు సకాలంలో వైద్యం అందక నానా అగచాట్లు పడ్డారన్న విషయం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లినా వారు ఈ వేడుకలకు సహకారం అందిచడంతోనే పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. ఆసుపత్రిలో అట్టహాసంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నా, విధులకు డుమ్మా కొట్టినా ఏ అధికారి ప్రశ్నించకపోగా కొందరు అధికారులు ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేయడం కొసమెరుపు. జీజీహెచ్‌లో వివాదానికి కారణమైన నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ పుట్టిన రోజు వేడుకలపై ఇప్పటికే కొందరు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. 



భారీ ఎత్తున దండకాలు.. ముడుపులు..?

నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ వేడకులకు భారీ ఎత్తున దండకాలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీజీహెచ్‌లో మొత్తం 320 మంది స్టాఫ్‌ నర్సులు ఉండగా వీరిలో 90 మంది వరకు పర్మినెంట్‌ ఉద్యోగులు. మిగిలిన వారు కాంట్రాక్టు కింద పనిచేస్తున్నారు. వీరి నుంచి ఏకంగా రూ.1.30 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఒంగోలు నుంచి నెల్లూరుకు గత ఏడాది బదిలీపై వచ్చారు. ఆమె వచ్చినప్పటి నుంచి స్టాఫ్‌ నర్సుల్లో ముడుపులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. డబ్బుతో పాటు చీర, బిరియాని అందిస్తే అలాంటి వారు విధులకు సక్రమంగా హాజరు కాకపోయినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల రోగుల వద్ద ఉండాల్సిన ఓ స్టాఫ్‌నర్సును తన గదిలో నర్సుల హాజరు పరిశీలించే పనిలో ఉంచుకుంది. అనేక మంది నర్సింగ్‌ సిబ్బంది పెట్టిన సెలవులను హాజరైనట్లుగా నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ మేనేజ్‌ చేయటం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు స్టాఫ్‌నర్సులకు నెలవారి వేతనం రూ.1.20 లక్షల వరకు ఉంటుంది. దీంతో నర్సింగ్‌ సూపరింటెండెంట్‌కు ఎంతో కొంత మొత్తం చెల్లించి విధులకు డుమ్మాకొట్టి సొంత పనులు చేసుకుంటున్నారు. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదని కొందరు ఉద్యోగులు అంటున్నారు.

Updated Date - 2022-07-07T03:53:58+05:30 IST