అంతంత మాత్రమే!

ABN , First Publish Date - 2022-06-26T05:27:30+05:30 IST

పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌లో మందుల కొరత వేధిస్తోంది. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

అంతంత మాత్రమే!

పెద్దాసుపత్రిలో మందుల కొరత

పాత కాంట్రాక్టర్లకు బకాయిలు పెండింగ్‌

వాటిని పక్కన పెట్టి కొత్తగా రెండు కంపెనీల నుంచి కొనుగోలు

అవి సప్లయి చేస్తున్న మందులు కూడా అరకొర

ఎంతటి జబ్బయినా మూడు రోజులకే మందులు 

ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకూ అంతే..

ఇబ్బంది పడుతున్న రోగులు

 

గుంటూరు(జీజీహెచ్‌), జూన్‌ 25: పెద్దాసుపత్రిగా పేరుగడించిన గుంటూరు జీజీహెచ్‌లో మందుల కొరత వేధిస్తోంది. దీంతో పేద రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు లేవని సాక్షాత్తు మెడికల్‌ డ్రగ్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ సుధీర్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ఎదుటే బహిరంగంగా వాపోయిన విషయం విదితమే. ఈ విషయం ఆంధ్రజ్యోతిలో ప్రముఖంగా ప్రచురించిన తరువాత ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. దీనికిగల కారణాలను తెలుసుకుంది. పాత కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇవ్వకపోవడం వలన మందులు సరఫరా చేసేందుకు ఏ సంస్థ ముందుకు రావడం లేదని అధికారులు నివేదించారు. దీంతో గత ఏడాదిగా వినియోగించిన సుమారు రూ.40 కోట్ల మేర బిల్లులను పక్కన పెట్టేసి ఇకనుంచి వచ్చే డబ్బులతో కొత్త సంస్థల వద్ద మందులు కొనుగోలు చేయాలని భావించింది. అందుకు రెండు కంపెనీలను కూడా సూచించింది. దీంతో ఇప్పటివరకు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 


అక్కడా అన్ని మందులు లేవు..

ప్రభుత్వం సూచించిన రెండు సంస్థలను సంప్రదించగా మా దగ్గర ఉన్న మందుల వరకే ఇస్తాం.. మా కంపెనీ ఉత్పత్తి చేసే మందులే ఇస్తాం.. బయట కొనుగోలు చేసి సరఫరా చేయమని తేల్చిచెప్పినట్లు సమాచారం. దీంతో పరిస్థితి మళ్ళీ మొదటి కొచ్చింది. కొన్ని మందులు మాత్రమే అందుబాటులో ఉంచారు. వైద్యులు సాధారణంగా గ్యాస్‌ సమస్యకు సూచించే ప్యాంటాబ్‌ మందులు కూడా ఆసుపత్రిలో లేవంటే పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించుకోవచ్చు. పైగా వైద్యులు సూచించిన మందుల్లో కొన్నింటిని కేవలం మూడు రోజులకే ఇస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. లేదంటే మందులు ప్రైవేటులో కొనుక్కుంటున్నారు. 


ఆరోగ్యశ్రీ పరిస్థితీ అంతే...

 ఆరోగ్యశ్రీ విభాగంలో మందులను బయట కొనుగోలు చేసి రోగికి ఇవ్వాలి. సుమారు తొమ్మిదినెలలుగా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల కాకపోవడంతో ఆ బకాయిలు కూడా మందుల ఏజన్సీలకు నిలిచిపోవడంతో వారు కూడా మందుల సరఫరా ఆపేశారు. దీంతో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందేవారు సైతం డబ్బులు పెట్టుకొని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బయట ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీకి అదనంగా డబ్బులు అడుగుతుండటంతో చెల్లించుకోలేనివారు మందులు ఖర్చుపెట్టుకొని జీజీహెచ్‌లోనే చికిత్స పొందుతున్నారు. 


ఏపీ మెర్క్‌తోనే సమస్యలు

గతంలో రూ.100 వైద్యఆరోగ్య శాఖకు కేటాయిస్తే అన్ని నిధులను ఆరోగ్యశ్రీ చెల్లింపులకు, డీఎంఈ వద్ద రివాల్వింగ్‌ ఫండ్‌కు, మందుల కొనుగోళ్లకు సరిపోయేవి. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏపీ మెర్క్‌ (ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌) అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికి రూ.100 నిధులు కేటాయిస్తే రూ.40ను కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి కేటాయించింది. దీంతో ఇప్పుడు నడుస్తున్న ఆసుపత్రులలో మందుల కొనుగోళ్లకు, ఆరోగ్యశ్రీ విభాగంలో చెల్లింపులకు సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

 

అధ్వాన్నంగా మెడికల్‌ స్టోర్స్‌ నిర్వహణ

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ స్టోర్‌ విభాగం అధ్వాన్నంగా తయారైంది. కనీసం స్టోర్‌ ఇన్‌చార్జి కూర్చునేందుకు కూడా సీటు లేకుండా చేశారు. కాకినాడ నుంచి బదిలీపై వచ్చిన స్టోర్‌ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ సుధీర్‌ పరిస్థితిని కొంతమెరుగు పరిచే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికారుల సహకారం లేకపోవడంతో ఉన్నవాటినే సర్దుతూ విధులు నిర్వహిస్తున్నారు. 

 

Updated Date - 2022-06-26T05:27:30+05:30 IST