ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన

ABN , First Publish Date - 2021-11-04T05:53:16+05:30 IST

ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన

ప్రభుత్వాసుపత్రి ప్రక్షాళన

రోగులకు మౌలిక వసతులపై ప్రధాన దృష్టి

కొత్త సూపరింటెండెంట్‌ కిరణ్‌కుమార్‌ రాకతో మారిన పరిస్థితులు

ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్ల నియామకం 

ఆయా విభాగాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగింత 

ఫార్మసీ, డయాగ్నోస్టిక్‌ విభాగాల్లో అదనపు కౌంటర్లు 


కొత్త సూపరింటెండెంట్‌ రాకతో కొత్త ఆసుపత్రిలో సరికొత్త మార్పులు వస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన డే1, డే2 ఆయన చేపట్టిన ప్రత్యేక చర్యలపై ఇటు రోగులతో పాటు అటు ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నచిన్న సమస్యలకు దగ్గరుండి పరిష్కారం చూపించడంతో పాటు పెద్ద సమస్యలకు ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇకనైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులు మారతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో పేద రోగులకు పెద్దదిక్కుగా ఉన్న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు కొత్త సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వై.కిరణ్‌కుమార్‌ కసరత్తు మొదలుపెట్టారు. తొలుత ఆసుపత్రిలోని చిన్నచిన్న సమస్యలను పరిష్కరించడం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రోగులకు మెరుగైన వైద్యసేవలందించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తొలిరోజే ఆసుపత్రిలోని ఓపీ, క్యాజువాలిటీ, సెంట్రల్‌ డయాగ్నోస్టిక్‌ విభాగాల్లో పర్యటించారు. క్యాజువాలిటీలో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి, వాటిని వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఓపీ విభాగంలో మందుల కోసం, డయాగ్నోస్టిక్‌ సెంటరులో వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టుల కోసం రోగులు గంటల తరబడి వరుసలో నిలబడుతుండగా, ఆ రెండుచోట్ల అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెండోరోజు మంగళవారం విధులకు హాజరైన సూపరింటెండెంట్‌ సోమవారం తాను చెప్పిన పనులను వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నారు. దీంతో క్యాజువాలిటీలో దుర్భరంగా ఉన్న మరుగుదొడ్లను అధికారులు దగ్గరుండి శుభ్రం చేయించి, తలుపులకు మరమ్మతులు చేయించారు. ఆర్థో విభాగంలోని మరుగుదొడ్లకు కూడా మరమ్మతులు చేయించి రోగులకు అందుబాటులోకి తెచ్చారు. ఓపీ విభాగంలో ఫార్మసీ కౌంటర్లు, సెంట్రల్‌ డయాగ్నోస్టిక్‌ విభాగాల్లో రిపోర్టుల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయించారు. 

డిప్యూటీ సూపరింటెండెంట్లకు బాధ్యతలు 

కిందిస్థాయి ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది మొదలు.. నాల్గో తరగతి ఉద్యోగులు, నర్సులు, డాక్టర్లు, ప్రొఫెసర్లలో జవాబుదారీతనాన్ని తెచ్చే దిశగా కిరణ్‌కుమార్‌ చర్యలు చేపడుతున్నారు. నెల రోజులుగా సూపరింటెండెంట్‌ లేకపోవడంతో ఇన్‌చార్జిల పాలనలో తగిన పర్యవేక్షణ లేదు. ఈ పరిస్థితులను చక్కదిద్ది అందరూ జవాబుదారీతనంతో పనిచేసేలా చూడటంతో పాటు పరిపాలనా సౌలభ్యం కోసం మరో ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లను నియమించారు. జనరల్‌ సర్జరీ విభాగంలో సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్‌ సూర్యశ్రీలను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆసుపత్రిలో పరిపాలన, ఆర్థికపరమైన వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతలను అప్పారావుకు, కొత్తగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించే పర్యవేక్షణ బాధ్యతలను సూర్యశ్రీకి అప్పగించారు.  

ఒత్తిళ్లకు తట్టుకుని నిలబడగలరా?

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకవైపు కరోనా బాధితులు, మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు, ఇంకోవైపు సాధారణ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. సీరియస్‌ కండీషన్‌లో అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే పట్టించుకునే నాథుడే లేడు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లడంతో ఇటీవల కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, సబ్‌ కలెక్టర్‌.. ఒకరి తర్వాత ఒకరు తరచూ జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ రోగులకు మెరుగైన వైద్యసేవలందించేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఓవైపు ప్రజాప్రతినిధుల సిఫార్సులు, మరోవైపు ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ ఆసుపత్రిలో విధులు నిర్వహించడం ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో సహా అధికారులకు కత్తి మీద సామే. అందుకే సీనియర్‌ ప్రొఫెసర్లు సైతం సూపరింటెండెంట్‌ పదవి చేపట్టడానికి ముందుకు రావట్లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారుల కోరిక మేరకు ధైర్యంగా ముందుకొచ్చి జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతలు చేపట్టిన జనరల్‌ సర్జరీ విభాగాధిపతి కిరణ్‌కుమార్‌కు ఇది ఒక సవాలే. ఈ పోస్టులో ఆయన రాణించగలరని ఆసుపత్రి వర్గాలు భావిస్తున్నాయి. అయితే, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఒత్తిళ్లను తట్టుకుంటూ ఎంతకాలం నిలబడగలుగుతారనేది కూడా చర్చనీయాంశమే.






Updated Date - 2021-11-04T05:53:16+05:30 IST