18 మంది ప్రొఫెసర్లు, 60 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీ
నేడో, రేపో 150 మందికిపైగా నర్సులు, ఫార్మాసిస్టులకు ఉత్తర్వులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైద్య ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కదలికలు మొదలయ్యాయి. ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఈ బోధనాసుపత్రిలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న 18 మంది ప్రొఫెసర్లు, 10 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, మరో 50 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇప్పటికే బదిలీల ఉత్తర్వులు అందడంతో వారంతా ఇక్కడ విధుల నుంచి రిలీవ్ అయ్యారు. విజయవాడ జీజీహెచ్ నుంచి బదిలీపై వెళ్లిన 18 మంది ప్రొఫెసర్లలో సగం మంది చాలాకాలంగా ఇక్కడ హెచ్వోడీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వారిలో డాక్టర్ సూర్యశ్రీ (ఎనస్థీషియా), డాక్టర్ మోహన్ (ప్లాస్టిక్ సర్జరీ), డాక్టర్ జగన్మోహనరావు (గ్యాస్ట్రో ఎంటరాలజీ), డాక్టర్ వెంకటేష్ (ఆర్థోపెడిక్), డాక్టర్ అప్పారావు (జనరల్ సర్జరీ), డాక్టర్ హయగ్రీవరావు (న్యూరోసర్జరీ), డాక్టర్ రాధికారెడ్డి (సైకియాట్రీ), డాక్టర్ పెంచలయ్య (డెర్మటాలజీ) ఉన్నారు. వీరి స్థానాల్లో ఇతర బోధనాసుపత్రుల నుంచి బదిలీపై వచ్చిన సీనియర్ ప్రొఫెసర్లు హెచ్వోడీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక జోనల్ కేటగిరీ పరిధిలోకి వచ్చే మరో 150 మందికి పైగా హెడ్నర్సులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందికి నేడో, రేపో బదిలీ ఉత్తర్వులు జారీ కానున్నాయి. ఇంతమంది వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది ఒకేసారి బదిలీపై వెళ్లిన ఉదంతాలు ప్రభుత్వ ఆసుపత్రి చరిత్రలో ఎప్పుడూ లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ దంత ఆసుపత్రిలోనూ..
విజయవాడ ప్రభుత్వ దంత ఆసుపత్రి, కళాశాలల్లో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. దంత కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.యుగంధర్తోపాటు డాక్టర్ కె.సుధ, డాక్టర్ కె.సురేఖ, డాక్టర్ ఎం.జ్యోత్స్న, డాక్టర్ టీహెచ్ కోటయ్య, డాక్టర్ జె.నరేంద్రదేవ్, డాక్టర్ డి.సుధామాధురి తదితరులు కడప ప్రభుత్వ డెంటల్ కాలేజీకి బదిలీ అయ్యారు.