ఆగుతూ.. సాగుతూ!

ABN , First Publish Date - 2022-06-25T04:40:25+05:30 IST

ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తున్నాయి. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు కొలిక్కి రాకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంచుతామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి, రూ.43.64 కోట్ల నిధులు మంజూరు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకే ఆరు సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు గతేడాది పనులు ప్రారంభించినా నదిలో ప్రవాహం పెరగడంతో కొద్దిరోజులకే నిలిచిపోయాయి. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం పనులు సాగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో వచ్చే ఏడాది వరకు ఎదురుచూడాల్సిందే!

ఆగుతూ.. సాగుతూ!
ఘనపూర్‌ ఆనకట్ట

ఏడేళ్లయినా కొలిక్కిరాని ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు

భూసేకరణకే ఆరు సంవత్సరాలు

రెండు వారాలే కొనసాగిన పనులు

వర్షాకాలంలో వరద, యాసంగిలో పంటల సాగుతో బ్రేక్‌

మరో ఏడాదైనా పూర్తయ్యే నమ్మకం లేదు!


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, జూన్‌ 24: ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు పనులు ఒక అడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కి అన్నట్టు నడుస్తున్నాయి. ఏడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు కొలిక్కి రాకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంచుతామని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించి, రూ.43.64 కోట్ల నిధులు మంజూరు చేశారు. అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. కానీ భూసేకరణకే ఆరు సంవత్సరాలు పట్టింది. ఎట్టకేలకు గతేడాది పనులు ప్రారంభించినా నదిలో ప్రవాహం పెరగడంతో కొద్దిరోజులకే నిలిచిపోయాయి. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం పనులు సాగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మెదక్‌ జిల్లాలోని ఏకైక మధ్య తరహా ప్రాజెక్టు అయిన ఘనపూర్‌ ఆనకట్ట నిర్మాణం నిజాం హయాంలో 1905లో పూర్తయ్యింది. ఆనకట్ట నిర్మించి ఇప్పటికి 117 ఏళ్లు అవుతున్నది. తెలంగాణ వచ్చిన అనంతరం ప్రభుత్వం ఆనకట్ట పేరును వనదుర్గా ప్రాజెక్టుగా మార్చింది. 2014 డిసెంబర్‌ 17న మెదక్‌ పర్యటన కు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనపూర్‌ ఆనకట్టను సందర్శించారు. ఆనకట్టలో పూడిక పెరిగిపోయినందున ఎత్తు పెంపు కోసం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇరిగేషన్‌ అధికారులు సర్వే చేసి ఆనకట్టను 1.725 మీటర్లు పెంచాలని నిర్ణయించారు. దీంతో పాపన్నపేట, కొల్చారం, మెదక్‌, హవేళిఘనపూర్‌ మండలాల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రతిపాదించారు. ఈ పనులు చేపట్టడం కోసం రూ.43.64 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2015 మే నెలలో అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పనులకు శాంకుస్థాపన చేశారు. ఆనకట్ట దిగువన ఆప్రాన్‌ పనులు చేపట్టారు.


భూసేకరణలో తీవ్ర జాప్యం

ఘనపూర్‌ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం 191.14 ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. కొల్చారం మండలం చిన్నఘనపూర్‌లో 62.26 ఎకరాలు, పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి, కొడపాక, చిత్రియాల గ్రామాల్లో 128.28 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. కానీ భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పలుమార్లు రైతులతో చర్చించి ఒప్పించారు. ఆరేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం భూసేకరణ పూర్తి చేశారు. ఎట్టకేలకు గతేడాది ప్రధాన పనులు ప్రారంభించారు. పట్టుమని 15 రోజులు కూడా పనులు జరగకుండానే ఎగువన కురిసిన వర్షాలకు మంజీరా నదిలో నీటి ప్రవాహం పెరగడంతో నిలిచిపోయాయి. ఎండాకాలంలో పనులు చేద్దామంటే ఏప్రిల్‌ వరకు యాసంగి పంట కోసం సాగు నీటిని విడుదల చేశారు. వర్షాకాలం కావడంతో ప్రస్తుతం పనులు సాగే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ సీజన్‌లో లక్షల క్యూసెక్కుల వర్షపు నీరు వృథాగా పోయే అవకాశం ఉన్నది. 


రైతులకు అందని పరిహారం

ఆనకట్ట ఎత్తు పెంపు కోసం మంజూరు చేసిన నిధులలో రూ.13.1 కోట్ల రూపాయలు భూ సేకరణ కోసం కేటాయించారు. భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద రూ.5 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన రైతులు పరిహారం కోసం ఎదురు చూస్తుండగా.. గత మార్చిలో రూ. 8.1 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. కానీ మొత్తం ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-06-25T04:40:25+05:30 IST