అమరగాయకుడు ఘంటసాలకు అద్భుత నివాళి

Dec 5 2021 @ 16:55PM

అమరగాయకుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు  శతజయంతి సంవత్సర ప్రారంభం సందర్భంగా శనివారం సాయంత్రం వారి జయంతిని పురస్కరించుకుని అమెరికా నుండి "వంగూరి ఫౌండేషన్", సింగపూర్ నుండి "శ్రీ సాంస్కృతిక కళాసారథి",  భారత్ నుండి "ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్", "వంశీ ఇంటర్నేషనల్", "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, 365 రోజుల పాటు జరగనున్న "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమాన్ని, అంతర్జాల వేదికపై ఘనంగా ప్రారంభమైంది.

ఈ ప్రారంభ మహోత్సవానికి ఘంటసాల సతీమణి సావిత్రమ్మ శుభాశీస్సులు అందించగా, వారి కుమార్తెలు సుగుణ, శాంతి జ్యోతి ప్రకాశనం గావించి, ప్రార్థనాగీతం ఆలపించి శుభారంభాన్ని పలికారు. ప్రముఖ సినీ కవి భువనచంద్ర, ప్రముఖ సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, జగన్మోహనరావు తదితర ప్రముఖులు, ఇతర నిర్వాహకబృంద సభ్యులు పాల్గొని ఘంటసాల వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ ప్రసంగించారు. అత్యధిక కాలం నిరంతరాయంగా ఘంటసాల స్మరణలో జరిగే కార్యక్రమంగా ఈ కార్యక్రమం అంతర్జాతీయ రికార్డు సృష్టిస్తోందని అందరూ అభినందనలు వ్యక్తం చేశారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలైన సంస్థలలో ఈ కార్యక్రమం రికార్డును నమోదు చేసుకోబోతోందని నిర్వాహకులు తెలిపారు. 

ఘంటసాల ట్రస్ట్ మరియు వంశీ అధ్యక్షులు డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ.. డిసెంబర్ 4వ తేదీ 2022 వరకు సంవత్సరకాలం పాటు ప్రతిరోజూ గంటసేపు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న గాయనీగాయకులు ఘంటసాల పాటలను ఆలపిస్తారని, కవులు రచయితలు వక్తలు ఘంటసాలపై వ్యాసాలను కవితలను వినిపిస్తారని ప్రకటించారు. ఎంతోమంది గాయనీ గాయకులకు అన్నం పెట్టిన  ఘంటసాల పాటకు సమున్నతస్థానం కల్పించే ఉద్దేశంతో హైదరాబాదులో తాము నిర్మించిన 'ఘంటసాల స్మృతి మందిరం' గురించిన వివరాలను తెలియజేసి అక్కడ జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వీడియో రూపంలో అందరికీ చూపించారు. 

కార్యక్రమం ప్రధాన సమన్వయకర్త ఐన రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణలో మూడు గంటలపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ గాయకులు చంద్రతేజ, ఆర్ఎస్ఎస్ ప్రసాద్, తాతా బాలకామేశ్వరరావు, కె విద్యాసాగర్ చక్కటి గీతాలను, పద్యాలను ఆలపించి ప్రేక్షకులను మెప్పించగా, సింగపూర్ నుండి గుంటూరు వెంకటేష్ ఈలపై, 20 కు పైగా ఘంటసాల పాటల పల్లవుల పల్లకిని పలికించి అందరినీ ఆకట్టుకున్నారు. జీవి రామకృష్ణ సౌజన్యంతో చౌటపల్లి, టేకుపల్లి, ఘంటసాల గ్రామాలనుండి మరియు విజయనగరం సంగీత కళాశాల నుండి ప్రత్యేకంగా వీడియోలను రూపొందించి ఈ కార్యక్రమంలో ప్రేక్షకులకు ఘంటసాల నడయాడిన ప్రాంతాలను చూపించారు. 

"శ్రీ సాంస్కృతిక కళాసారథి" అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ఇంతటి బృహత్కార్యంలో తమ సంస్థ సహ నిర్వాహకులుగా పాలుపంచుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమాన్ని ఉత్సవంగా "ఘంటసాల శతజయంతి ఆరాధనోత్సవం" 2022 డిసెంబర్ 4వ తేదీన సింగపూర్ లో ఏర్పాటు చేయనున్నామని ప్రకటించి, ఆ కార్యక్రమానికి అందరిని సింగపూర్ కు రావలసిందిగా కోరుతూ ఆహ్వానం పలికారు. ఘంటసాలతో పాటుగా ఇటీవల స్వర్గస్తులైన వారి కుమారులు ఘంటసాల రత్న కుమార్‌ను కూడా స్మరిస్తూ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో నివాళులు అర్పించారు. వంశి అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధ, మేనేజింగ్ ట్రస్టీ సుంకరపల్లి శైలజ కార్యక్రమానికి అభినందనలు తెలియజేశారు. 

భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాలలో ఉదయం 10 గంటలకు, ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9 గంటలకు సంవత్సరకాలం పాటు కొనసాగే "ఘంటసాల స్వర రాగ మహాయాగం" కార్యక్రమాన్ని 'వంశీ ఆర్ట్ థియేటర్స్' మరియు 'శుభోదయం మీడియా' యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించవచ్చును. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ వీక్షించవచ్చును.

                           


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.