ఆయనొక ధ్రువ తార. రాగాలకు మాధుర్యం అద్దిన గానమూర్తి. పాడిన ప్రతీ పాట ఓ ఆణిముత్యమై ప్రేక్షక, శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించిన తెలుగు వారి సంగీత నిధి. ఆయనే... అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు. డిసెంబర్ 4వ తేది ఆయన పుట్టిన రోజు. తెలుగు సినిమా పాటకి... పండుగ రోజు!. ఆయన జయంతి సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తు చేసుకుందాం.
కర్ణాటక సంగీత శాస్త్రంలో అపారమైన కృషి చేసి ప్రయత్నపూర్వకంగానే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఘంటసాల జీవన ప్రయాణం అలనాటి సినీ దిగ్గజం చిత్తూరు నాగయ్య ఆశ్రయంలోనే ప్రారంభమైంది. జీవనభృతి కోసం తొలినాళ్లలో అడపాదడపా చిన్న చిన్న వేషాలు కూడా వేసిన ఘంటసాలా ప్లే బ్యాక్ జీవితం చేదు అనుభవంతోనే మొదలైంది. 'నీ గొంతు రికార్డింగ్ కి పనికి రాదు' అని హెచ్ఎంవీ సంస్థ ఛీత్కరించుకున్న సమయంలో అయోమయంలో పడిపోయిన ఆయనకి ఆ చిన్న వేషాలే భోజనం పెట్టాయి. అటుపైన చిత్తూరు నాగయ్య అండదండలు భవిష్యత్తు పట్ల ఆయనలో కొత్త ఆశలను చిగురింపజేశాయి. ఆ దశలో... ఘంటసాల అన్న పేరు జగద్విఖ్యాతమై తెలుగు వారి గుండెల గుడిలో జే గంటై మార్మోగుతుందని ఎవరూ ఊహించలేదు. చివరకు, హెచ్ఎంవీ సంస్థ కూడా..
గాయకుడిగా అవకాశం రాక ముందు సహాయ దర్శకుడిగా వృత్తిగత జీవితానికి శ్రీకారం చుట్టారు ఘంటసాల. ఆ తరువాత, కొద్ది కాలంలోనే గాయకుడిగా అవకాశం అందిపుచ్చుకున్నాక రోజుకో ముందడుగు వేస్తూ పరిశ్రమలోని అందరి ఆదరాభిమానులతో వేళ్లూనుకుంటూ ఎదిగారు. ఆ అద్భుతమైన గళ విన్యాసానికి ప్రేక్షక, శ్రోతలు జేజేలు పలకటంతో ఘంటసాల స్థానం పరిశ్రమలో శాశ్వతంగా, సుస్థిరమైపోయింది. పాటంటే ఘంటసాల... ఘంటసాలంటే పాట... అనే కీర్తి, ప్రతిష్ఠలు ఆయన స్వంతం అయ్యాయి. అప్పుడప్పుడే నాటక రంగాన్ని అధిగమించి ప్రాచుర్యం పొందుతున్న సినీ మీడియాకి ఘంటసాల గొంతు ఓ వరంగా పరిణమించింది. ఘంటసాల పాడిన కారణంగా పాటలన్నీ జన బాహుళ్యంలోకి చొచ్చుకుపోయాయి. సినిమాలు అఖండ విజయం సాధించటానికి దోహదపడ్డాయంటే అతిశయోక్తి కానే కాదు.
కేవలం గాయకుడిగానే కాదు సంగీత దర్శకుడిగా కూడా సమున్నత స్థానం సాధించారు. స్వీయ సంగీతంలో ఘంటసాల ఆలపించిన పాటలు నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు ప్రాణం పోశాయి. తోటి సంగీత దర్శకులు కూడా ఘంటసాలకు హ్యాట్సాఫ్ చెప్పేటంతగా చెరిగిపోని సాధనాన్ని, స్థాయిని ఆ మహనీయుడు కైవసం చేసుకున్నాడు. ఘంటసాల సంగీతంలో తెరకెక్కిన 'లవకుశ' చిత్రం అందుకు ఓ మచ్చుతునక. ఆయనకి సంగీత దర్శకుడిగా మరో అపురూపమైన రికార్డు కూడా ఉంది. వంద చిత్రాలను అతి తక్కువ కాలంలో పూర్తి చేసిన తొలి సంగీత దర్శకుడు ఘంటసాలే అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. కానీ రికార్డుల సాక్షిగా అది ఓ చారిత్రక సత్యం.
అది ప్రేమగీతమైనా, విషాద గీతమైనా, భక్తి గీతమైనా, హుషారు గీతమైనా, కామెడీ పాటైనా... ఘంటసాల గొంతులో ఎంతో భావగర్భితంగా, వీనుల విందుగా ప్రతి ధ్వనించింది. గీత రచయిత భావాన్ని, సన్నివేశంలోని ఎమోషన్ని తమదైన మెలోడీతో పాటకి ప్రాణం పోసిన స్వర విజేత ఘంటసాల. ఆయన గొంతులో పలకని భావమే లేదు. నవరసాలకు ఆయన గళసీమ పుట్టినిల్లుగా ప్రకాశించింది. కేవలం హీరోలకి పాడిన పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన పాటలైనా సరే ఘంటసాల పాడిన విధానం సన్నివేశాన్ని రక్తి కట్టించిన సందర్భాల్లో కోకొల్లలు. సంగీత దర్శకులు ఆయనకి పూర్తి స్వేచ్ఛనిచ్చి తమ పాటలని అజరామరం చేసుకోటానికి తాపత్రయపడేవారు. ఆయన పాడిన అన్ని వేల పాటల్లో ఏ ఒక్క పాటనూ మరిచిపోలేం.
సినిమా పాటలు సరే... ఏ హీరోల మీద చిత్రీకరించని ఘంటసాల పాడిన ప్రైవేట్ గీతాలు కూడా సూపర్ హిట్ చిత్రాల్లో పాటల్లాగా ఊరూరా, వాడ వాడా సందడి చేశాయి. ఆయన పాడిన కారణంగానే 'పుష్ప విలాపం', 'కుంతి కుమారి' వంటి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచనలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. 'రావోయి బంగారి మామ', 'తలనిండ పూదండ' వంటి పాటలను ఇప్పటికీ యువతరం పాటల పోటీల్లో పాడి... బహుమతులను సాధించుకుంటున్నారు. అంటే, ఆయన గొంతులో ఆ పాటలు ఎంత ఘనతను సాధించాయో అర్థం అవుతుంది!
ఏ ఘంటసాలని హెచ్ఎంవీ సంస్థ 'పనికి రావు పొమ్మందో'... అదే ఘంటసాల పుణ్యమాని కోటాను కోట్ల రూపాయల వ్యాపారం చేసి... ఎంతో ఎత్తుకు ఎదిగింది. మొదటే కాదు చివర్లో కూడా హెచ్ఎంవీ సంస్థ ఘంటసాలకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తిన్నాక భగవద్గీత పాడాలని ఘంటసాల నిర్ణయించుకున్నారు. రికార్డింగ్ పూర్తయ్యాక కూడా హెచ్ఎంవీ భగవద్గీత రికార్డులు విడుదల చేయలేదు. ఆ రికార్డుల్ని చూడకుండానే ఘంటసాల కన్నుమూశారు. వెంటనే హెచ్ఎంవీ రికార్డులని మార్కెట్లోకి విడుదల చేసింది. రికార్డు స్థాయిలో ఘంటసాల భగవద్గీత రికార్డుల అమ్మకం కొనసాగింది. తిరుపతి కొండపైనా అదే భగవద్గీత, స్మశాన వాటికలోనూ ఆ భగవద్గీతే. అదే ఘంటసాల గొంతు సాధించిన అమరత్వం. అందుకే ఆయన అమర గాయకుడు.