తిరుపతిలో ఘరానా దోపిడీ

ABN , First Publish Date - 2020-12-03T07:16:28+05:30 IST

తిరుపతిలో ఓ ఇంటి యజమానిపై దాడిచేసి నగలు, నగదు దోచుకెళ్లారు.

తిరుపతిలో ఘరానా దోపిడీ
దుండగులు ధ్వంసం చేసిన గ్రిల్స్‌ లేని కిటికీ

ఇంటి యజమానిపై దాడి, కత్తులతో బెదిరింపు

420 గ్రాముల బంగారం, రూ.1.65లక్షలు ఎత్తుకెళ్లిన ఇద్దరు దొంగలు


తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 2: తిరుపతిలో ఘరానా దోపిడీ జరిగింది. అలిపిరి ఎస్‌ఐ షేక్షావలి తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి-కరకంబాడి మార్గంలోని బ్యాంక్‌ ఎంప్లాయీస్‌ కాలనీలో ఉన్న తన సొంతిట్లో శశికుమార్‌ ఓ ఫర్నిచర్‌ షోరూమ్‌ నిర్వహిస్తున్నారు. మూడు అంతస్తుల్లో షోరూమ్‌ పెట్టుకుని, నాల్గవ అంతస్తులో కాపురం ఉంటున్నారు. వారం కిందట ఆయన భార్య, కుమార్తె ఊరికెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నారు. బుధవారం వేకువజామున సుమారు మూడు నుంచి నాలుగు గంటల మధ్య ముఖానికి ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు లిఫ్ట్‌ తాళాలు పగులగొట్టి నాల్గవ అంతస్తుకు చేరుకున్నారు. లిఫ్ట్‌ పక్కనే ఉన్న గ్రిల్స్‌ లేని కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. అద్దం పగిలిన శబ్దానికి నిద్రమేల్కొన్న శశికుమార్‌ హాల్లోకి రావడంతో వారిద్దరూ అతడిపై దాడి చేశారు. కత్తులతో బెదిరించి.. బీరువా తాళాలు అడిగి తీసుకున్నారు. అనంతరం బీరువాలోని రూ.8.50 లక్షల విలువైన 420 గ్రాముల బంగారు నగలు, రూ.1.65 లక్షలతోపాటు సెల్‌ఫోన్‌ ఎత్తుకెళ్లిపోయారు. బాధితుడిని బెడ్‌రూమ్‌లోనే ఉంచి తాళం వేయడంతో సుమారు ఉదయం ఆరు గంటల సమయంలో శశికుమార్‌ అరుపులు విన్న పక్క భవనంవారు 100కు ఫోన్‌ చేశారు. రక్షక్‌ సిబ్బంది వచ్చి.. బాధితుడిని గదినుంచి బయటకు తీసుకొచ్చారు. అలిపిరి పోలీసులకు సమాచారం అందించడంతో వారు క్లూస్‌టీమ్‌ను రప్పించి, వేలిముద్రలు సేకరించారు. ఏఎస్పీ(ఇన్‌చార్జి క్రైమ్‌) మునిరామయ్య, ఏఎస్పీ (శాంతిభద్రతల విభాగం) ఆరీఫుల్లా, ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ, క్రైమ్‌ డీఎస్పీ మురళీధర్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 

Updated Date - 2020-12-03T07:16:28+05:30 IST