ltrScrptTheme3

గజల్‌ గంజినీళ్లు నా చేతికిచ్చింది మాత్రం ఆంధ్రజ్యోతే

Feb 7 2020 @ 13:56PM

గోదావరి అన్నా.. అమ్మన్నా... అంతులేని ఇష్టం

రాజగోపాల్‌ కంటే కరుడుగట్టిన సమైక్యవాదిని

తుదిశ్వాస వరకూ సమైక్యవాదినే... సీనారే నన్ను మానస పుత్రుడన్నారు

గమ్యం తప్ప మరేదీ రమ్యం కాదు... అతి పెద్ద పాటతో నాలుగో గిన్నీస్‌ రికార్డు

18-10-10న జరిగిన ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో గజల్‌ శ్రీనివాస్‌


మీకు బాగా పేరుతెచ్చిన మొదటి గజల్‌ ఏది?

భీమవరం భారతీయ విద్యాభవన్‌లో పనిచేసేటప్పుడు 1986లో ఆంధ్రజ్యోతిలో తెలుగు గజల్‌ చూశాను. ఒక మౌనం వినిపిస్తే కృతజ్ఞతలు.. అని అది సాగుతుంది. ఓ మిత్రుడి సూచనతో తెలుగుదనం తీసుకొచ్చాను. గజల్‌ గంజినీళ్లు నా చేతికిచ్చింది మాత్రం ఆంధ్రజ్యోతే.


పుట్టింది టెక్కలి, పెరిగింది పాలకొల్లు.. ఎందుకలా?

స్వస్థలం పాలకొల్లే. నాన్నగారి ఉద్యోగరీత్యా టెక్కలి వెళ్లాం. అక్కడే నేను పుట్టాను. ముందు సంగీతం నేర్చుకోలేదు, తర్వాత తెలుసుకున్నాను. కోరుకొండ సైనిక్‌ స్కూల్లో పనిచేసేటప్పుడు లగడపాటి రాజగోపాల్‌ పిలిచి, ల్యాంకో గ్రూపునకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయమన్నారు. తర్వాత ఉద్యోగాలకు పూర్తిగా రాజీనామా చేశాను. రాబోయే తరం గజల్స్‌దేనని నా అభిప్రాయం. గజల్‌ను కంఠస్తం చేయను.. హృదయస్తం చేస్తా. డబ్బు మంచాన్ని కొనగలదుగానీ, నిద్రను కొనలేదు. పిల్స్‌ దొరుకుతాయి గానీ పీస్‌ (శాంతి) దొరకదు. ‘‘అందరినీ ప్రేమతో పలకరించు.. మరలా ఈ దారిని వస్తావో రావో’’!


పచ్చని పల్లెలు, అమ్మకి.. మీకు ఎటాచ్‌మెంట్‌ అంత ఎక్కువ ఎందుకు?

అమ్మ అనే ప్రేరణ ఈ ప్రపంచాన్ని నడపడం వల్లే ఇంకా శాంతి, సౌభాగ్యం ఉన్నాయని నా విశ్వాసం. చిన్నతనంలో మా అమ్మ నేను పాడితే కొట్టేది.. అప్పుడు అమ్మ రాక్షసి అనుకునేవాణ్ని. ఓసారి నాకు అమ్మవారు పోసినప్పుడు అందరూ దూరంగా పెడితే అమ్మ ఎంతో సేవ చేసింది. అమ్మే నాకు అన్నీ. దాంతో మా అమ్మే ఇలా చేయగలదు అనిపించింది. ‘‘ఒక్కసారి నన్ను తిట్టి వందసార్లు ఏడ్చింది... ఒక్కసారి నన్ను కొట్టి రోజంతా పస్తుంది’’ అదీ అమ్మ!


మీరు మద్యం ముట్టరు కదా.. మరి మగువ విషయమేంటి?

చాలామంది అందంగా కనిపిస్తారు. అందంగా ఎవరైనా కనిపిస్తే వాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది. సంబంధాలంటే మాత్రం భయం. గమ్యం తప్ప మరేదీ రమ్యంగా అనిపించదు. నా భార్య సురేఖను ఉయ్యాలలోనే తొలిసారి చూశా. తను నా మేనమామ కూతురు. అప్పుడే ఫిక్సైపోయా.


సినారెతో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది?

1992 వరకు నేను ఆయన్నెప్పుడూ కలవలేదు. 1993లో ఆయన వైజాగ్‌ స్టీల్‌ప్లాంటులో నా కార్యక్రమం చూసి, కౌగలించుకుని అభినందించారు. నన్ను మానసపుత్రుడిగా ప్రకటించారు.


గోదావరి మీద ఏమైనా పాడారా?

గోదావరి మీద రెంటాల బ్రహ్మాండమైనవి రాశా రు. అమ్మ ఒడి తర్వాత నాకు గోదావరంటేనే ఇష్టం. ‘‘పాపికొండలు ఎత్తుకున్న పాట గోదారి.. పారుతున్న వెన్నెలే ఈ పూట గోదారి.. గట్ల వెంబ డి చెట్లు చేమలు.. ఊళ్లు జీవాలూ, ఎంత కల్పన బ్రహ్మకింకొక మాట గోదారీ... దోసిట జారేవి నీళ్లా.. కావు కావ్యాలే. దాచుకో ఒక సంస్కృతీ ఊట గోదారీ’’ అని సాగుతుంది.


మూడుసార్లు గిన్నిస్‌ రికార్డు వచ్చింది.. ఇంకా ఎన్ని?

ముందు గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంత వ్యాప్తికోసం వందభాషల్లో పాడాను. ఆల్బమ్‌, లైవ్‌ కచేరీలకు రెండు రికార్డులు వచ్చాయి. తర్వాత మొన్న 24 గంటల్లో 55 కచేరీలతో మూడో రికార్డు చేశాను. ప్రపంచంలో అతిపెద్ద పాటతో నాలుగో రికార్డు జనవరిలో నెలకొల్పుతాను.


లగడపాటి తరఫున ‘ఓయి తెలుగువాడా’ అని పాడారు కదా. మీరు సమైక్యవాదేనా?

కరడుగట్టిన సమైక్యవాదిని. రాజగోపాల్‌ కంటే కొంచెం ఎక్కువే. ముందే మరో 7, 8 పాటలు రికార్డు చేశా. తెలంగాణ ఇష్యూ వచ్చినప్పుడు రాజగోపాల్‌కు వినిపించా. పార్టీ కోసం అడిగితే ఇవ్వలేదు. డిసెంబర్‌ 9 ప్రకటనతో కాళ్ల కింద భూమి బీటలు వారినట్లు అనిపించింది. తుదిశ్వాస ఉన్నంతవరకు సమైక్యగీతమే ఆలపిస్తాను.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.