ఐదుగురిని చంపేశారంటూ పోలీసులకు ఓ బాలిక ఫోన్.. హడావిడిగా అక్కడకు వెళ్లిన పోలీసులు.. తీరా చూస్తే..

ABN , First Publish Date - 2021-07-24T19:52:09+05:30 IST

తరచుగా క్రైమ్ షోస్ చూసే లక్నోకు చెందిన ఓ బాలిక చేసిన పని ఇది.

ఐదుగురిని చంపేశారంటూ పోలీసులకు ఓ బాలిక ఫోన్.. హడావిడిగా అక్కడకు వెళ్లిన పోలీసులు.. తీరా చూస్తే..

`పోలీస్‌ అంకుల్‌.. గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. దయచేసి త్వరగా రండి. నేను ఒంటరిగా ఉన్నాను..` ఓ బాలిక ఫోన్లో చెప్పిన వివరాలు రాసుకుని పోలీసులు హడావిడిగా అక్కడకు బయల్దేరారు.. తీరా అక్కడకు వెళ్లి చూస్తే అలాంటి ఆనవాళ్లేవీ లేవు.. తమకు కాల్ వచ్చిన నెంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది.. ఓ గంట తర్వాత మళ్లీ అదే నెంబర్‌కు ఫోన్ చేస్తే అసలు విషయం తెలిసింది.. అది ఓ బాలిక చేసిన ప్రాంక్ అని తేలింది. తరచుగా క్రైమ్ షోస్ చూసే లక్నోకు చెందిన ఓ బాలిక చేసిన పని ఇది. 


మూడో తరగతి చదువుతున్న 8 ఏళ్ల పాప మంగళవారం తన తండ్రి ఫోన్ తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి ఐదుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారని చెప్పింది. పోలీసులు వెంటనే ఆ చిన్నారి చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. అయితే అక్కడ హత్య జరిగినట్టు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదు. దీంతో ఆ బాలిక చేసిన మొబైల్‌కు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. కాసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించగా బాలిక తండ్రి మాట్లాడాడు. 


పోలీసులు జరిగిందంతా బాలిక తండ్రికి చెప్పారు. అంతా విన్న సదరు వ్యక్తి తమ కుమార్తె ప్రాంక్‌ కాల్‌ చేసి ఉంటుందని పోలీసులకు చెప్పాడు. తన కూతురు ఎక్కువగా క్రైమ్ షోస్ చూస్తుంటుందని, గతంలోనూ ఇలా ప్రాంక్ కాల్స్ చేసిందని చెప్పాడు. పోలీసులు వెంటనే స్పందిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు అప్పుడప్పుడు ఇలా చేస్తుంటుందని తెలిపాడు. మొత్తమంతా విని పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. మళ్లీ ఇలా జరుగకుండా చూడాలని బాలిక తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరించి వదిలేశారు. 

Updated Date - 2021-07-24T19:52:09+05:30 IST