GHMC : మహా పద్దు మమ.. చర్చ లేకుండా ఆమోదం..

ABN , First Publish Date - 2022-03-17T12:45:05+05:30 IST

GHMC : మహా పద్దు మమ.. చర్చ లేకుండా ఆమోదం..

GHMC : మహా పద్దు మమ.. చర్చ లేకుండా ఆమోదం..

  • రూ.6,150 కోట్లుగా ముసాయిదా బడ్జెట్‌
  • ఆస్తిపన్ను, పట్టణ ప్రణాళికా విభాగం ఆదాయమే అధికం
  • కొత్తగా టీడీఆర్‌ రెవెన్యూ కూడా
  • ఆలస్యంపై ఎంఐఎం సభ్యుల అభ్యంతరం

హైదరాబాద్‌ సిటీ : మహా పద్దును బుధవారం స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.6,150 కోట్లతో రూపొందించిన గ్రేటర్‌ ముసాయిదా బడ్జెట్‌పై సమగ్ర చర్చ జరపకుండానే సభ్యులు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆదాయ, వ్యయాలు, అప్పులపై అధికారులు చూపిన లెక్కలు వాస్తవ దూరంగా ఉన్నా కమిటీ ఓకే చెప్పింది. మొత్తంగా ఆదాయం రూ.3,434 కోట్లుగా, రూ.634 కోట్లు మిగులు చూపారు. మూలధన వ్యయం రూ.3,350కోట్లుగా పేర్కొన్నారు. పద్దులో అత్యధికంగా ఆస్తి పన్ను రాబడిని రూ.1,700 కోట్లు, నిర్మాణ అనుమతుల ద్వారా రూ.1,200 కోట్లు వస్తుందని అంచనా వేశారు. పట్టణ ప్రగతి కింద రాష్ట్ర ఆర్థిక కమిషన్‌, 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి రూ.708 కోట్ల గ్రాంట్లు వస్తాయని పేర్కొన్నారు.


తగ్గిన కేటాయింపులు..

రహదారులు, వంతెనలు, ఆర్‌యూబీ, ట్రాఫిక్‌ సిగ్నళ్ల నిర్వహణ, నిర్మాణానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.554 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.537 కోట్లకు తగ్గించారు. ఎస్‌ఆర్‌డీపీ కేటాయింపులు రూ.687 కోట్ల నుంచి రూ.714 కోట్లకు పెరిగాయి. సీఆర్‌ఎంపీ నిధులను రూ.442కోట్ల నుంచి గణనీయంగా రూ.248 కోట్లకు తగ్గించారు. అన్నపూర్ణ భోజనానికి కేటాయింపులు రూ.47.55 కోట్ల నుంచి రూ.24కోట్లకు తగ్గాయి.


ఆస్తి పన్ను ఆదాయం రూ.63కోట్లుగా పేర్కొన్నారు. అప్పుగా రూ.1,302 కోట్లు తీసుకుంటున్నట్టుగా చూపారు. రెండు పడకల ఇళ్ల కోసం రాష్ట్ర గృహ నిర్మాణశాఖ నుంచి వచ్చే రూ.406 కోట్లను ప్లాన్‌ బీ బడ్జెట్‌గా చూపారు. మేయర్‌ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన  నేపథ్యంలో నెలాఖరులోపు కౌన్సిల్‌ మీటింగ్‌లో పద్దు ఆమోదం పొందాల్సి ఉంది. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతోన్న దృష్ట్యా కౌన్సిల్‌ ఏర్పాటుకు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర బడ్జెట్‌ అనంతరం ముసాయిదా పద్దు ప్రవేశ పెట్టడంపై ఎంఐఎం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ముందే బడ్జెట్‌ రూపొందించి.. సర్కారును నిధులు అడగాల్సి ఉండేదని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాని పక్షంలో జీహెచ్‌ఎంసీ నిర్వహణ కష్ట సాధ్యమవుతుందన్నారు.


పెరిగిన సవరణ బడ్జెట్‌..

2021-22 సవరణ బడ్జెట్‌ పెరిగింది. వాస్తవ బడ్జెట్‌ రూ.5,600 కోట్లు కాగా, సవరణ పద్దును రూ.6,300 కోట్లకు పెంచారు. పట్టణ ప్రణాళికా విభాగం నుంచి వచ్చే ఆదాయం రూ.801.05 కోట్ల నుంచి రూ.1,100 కోట్లు, ఫైనాన్స్‌ కమిషన్ల నుంచి వచ్చిన గ్రాంట్లు రూ.615 నుంచి రూ.625 కోట్లు, అప్పులు రూ.1,224.51 కోట్ల నుంచి రూ.1,795.64 కోట్లకు పెంచారు. బడ్జెట్‌లోని టీడీఆర్‌ ఆదాయం రూ.500 కోట్లను సవరణ బడ్జెట్‌లో చూపారు.  



Updated Date - 2022-03-17T12:45:05+05:30 IST