GHMC మరో కీలక నిర్ణయం.. ఇకపై..

ABN , First Publish Date - 2022-03-10T15:27:06+05:30 IST

జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది...

GHMC మరో కీలక నిర్ణయం.. ఇకపై..

  • 75 మైక్రాన్ల వరకు ప్లాస్టిక్‌ నిషేధం
  • స్టాండింగ్‌ కమిటీకి ప్రతిపాదన

హైదరాబాద్‌ సిటీ : మహానగరంలో ప్లాస్టిక్‌ నిషేధం అమలుపై జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ నిషేధించాలనే ప్రతిపాదనను బుధవారం జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఆమోదించింది. దీనిపై పబ్లిక్‌ నోటీస్‌ ద్వారా తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ - 2022లో ఉత్తమ ర్యాంకు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం నగరంలో 50 మైక్రాన్లకంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధం అమలులో ఉంది. కానీ ఎక్కడా అమలవుతోన్న దాఖలాలు లేవు. అయినా మరో నిర్ణయం తీసుకునేందుకు చర్చించడం చర్చనీయాంశంగా మారింది. 


కాగా.. తెలంగాణ హరిత నిధి కింద ట్రేడ్‌ లైసెన్స్‌ రుసుములో రూ.1000 అదనంగా వసూలు చేయాలని నిర్ణయించారు. నగరంలో 80 వేల వరకు ట్రేడ్‌ లైసెన్స్‌లు ఉన్నాయి. వీరికి ఏటా రూ.1000 అదనపు బాదుడు ఇక తప్పదు. ఏ కేటగిరీ వ్యాపారాలకు హరిత రుసుము వసూలు చేయాలన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా.. తాజా సమావేశంలోనూ పాలకమండలి బడ్జెట్‌ ఊసెత్తలేదు. సాధారణ ఎజెండాపైనే చర్చించారు. మరో 20 రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా, ఇప్పటికీ పద్దు స్టాండింగ్‌ కమిటీకి సమర్పించకపోవడం గమనార్హం. నవంబర్‌లోనే పద్దును ఆర్థిక విభాగం కమిషనర్‌కు సమర్పించినట్టు తెలిసింది. అయినా స్టాండింగ్‌ కమిటీ ముందుకు తేలేదు. బడ్జెట్‌ వివరాలను మేయర్‌కు కూడా అధికారులు చెప్పలేదని సమాచారం.

Updated Date - 2022-03-10T15:27:06+05:30 IST