104 స్థానాల్లో విజయం ఖాయం

ABN , First Publish Date - 2020-11-29T06:49:13+05:30 IST

గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 104 డివిజన్లను కైవసం

104 స్థానాల్లో విజయం ఖాయం

 బీజేపీ, కాంగ్రెస్‌ నగరానికి ఏం చేశాయో వెల్లడించాలి : తలసాని 

 దేశంలోనే తెలంగాణ టాప్‌లో ఉంది : మహమూద్‌ అలీ 

 టీఆర్‌ఎస్‌కు విజయాలు కొత్త కాదు : కేకే

మంగళ్‌హాట్‌/బర్కత్‌పురా, నవంబర్‌ 28(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ 104 డివిజన్లను కైవసం చేసుకొని కొత్త చరిత్ర సృష్టించబోతోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. 50 ఏళ్లుగా జరగని అభివృద్ధి సీఎం కేసీఆర్‌ సారథ్యంలో ఆరేళ్లలో చేసి చూపించారని తెలిపారు. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ ఎల్బీ స్టేడియంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్‌ నగరానికి ఏం చేశాయో వెల్లడించాలని ఆయన సవాల్‌ చేశారు. 


అభివృద్ధి వైపు అడుగులు

2001 నుంచి 14 సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు  వేస్తోందని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని ఆయన వివరించారు. గతంలో ఎంఆర్వో కార్యాలయాల వద్ద రూ. 200 పింఛన్‌ కోసం వేచి చూడాల్సి ఉండేదని, ఇప్పుడు నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే జమ చేస్తున్నామని గుర్తు చేశారు. 


సెంచరీ సాధిస్తాం..

టీఆర్‌ఎస్‌ పార్టీకి విజయాలు కొత్తకాదని రాజ్యసభ సభ్యుడు కేకే అన్నారు. గత ఎన్నికల్లో 99 డివిజన్లలో తమ అభ్యర్థులు విజయం సాధించగా, ఒక్క డివిజన్‌ మాత్రం 4 ఓట్లతో ఓడిపోవడం జరిగిందని, దాంతో సెంచరీ జారవిడుచుకున్నామన్నారు. ఈ సారి కచ్చితంగా సెంచరీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కొంత మంది విధ్వంసాలకు ప్రయత్నిస్తున్నారని, అలాంటి వారికి ఓటుతో ప్రజలు సరైన సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు, మేయర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-29T06:49:13+05:30 IST