అప్పుల ఊబిలో GHMC.. వందల కోట్ల బిల్లులు పెండింగ్‌..

ABN , First Publish Date - 2022-03-19T14:49:35+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఏ పూటకు ఆ పూట అన్నట్టుగా..

అప్పుల ఊబిలో GHMC.. వందల కోట్ల బిల్లులు పెండింగ్‌..

  • ఇప్పటికే రూ.4,500 కోట్ల రుణం
  • మరో రూ.850 కోట్ల కోసం దరఖాస్తు
  • తొమ్మిది నెలల బకాయిలు అలానే..
  • సర్కారు ఇస్తేనే చెల్లింపులంటోన్న అధికారులు

జీహెచ్‌ఎంసీ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తోంది. ఏ పూటకు ఆ పూట అన్నట్టుగా పరిస్థితి మారింది. ఆస్తిపన్ను, నిర్మాణ అనుమతులు, ఇతరత్రా మార్గాల్లో వస్తోన్న ఆదాయం వేతనాలకూ సరిపోవడం లేదు. ఇక పూర్తయిన, పురోగతిలో ఉన్న పనుల బిల్లు చెల్లింపులపై   అధికారులు ఊసెత్తడం లేదు. రహదారుల నిర్మాణం, నిర్వహణ, ఓపెన్‌ డ్రైన్‌లు తదితర పనులకు సంబంధించి దాదాపు రూ.500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం.


హైదరాబాద్‌ సిటీ : గతేడాది జూలై వరకు జీహెచ్‌ఎంసీకి సమర్పించిన బిల్లులకు మాత్రమే పలు దఫాలుగా చెల్లింపులు జరిగాయి. గత ఎనిమిది నెలలుగా చేసిన పనులకు పైసా కూడా ఇవ్వలేదు. తాజా బడ్జెట్‌లో రూ.28కోట్లకు మించి ప్రభు త్వం కేటాయించలేదు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతంలో ఆర్టీసీకి రూ.300కోట్లకు పైగా బల్దియా నుంచి బదిలీ చేయించింది. ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్లు, ఇతర పనుల కోసం ఇప్పటికే సంస్థ రూ.4,500 కోట్ల మేర అప్పులు చేసింది. ఇప్పుడు ఎస్‌ఎన్‌డీపీ కోసం మరో రూ.850 కోట్ల రుణం తీసుకునేందుకు మూడు బ్యాంకులకు దరఖాస్తు సమర్పించారు. రాష్ట్ర గృహ నిర్మాణశాఖ నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రూ.350కోట్ల వరకు బిల్లులు బకాయి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌ బిల్లులు ఇప్పటి వరకు చెల్లించని నేపథ్యంలో పూర్తిస్థాయి నిధులు మంజూరవుతాయా అన్నది ప్రశ్నార్థకమే.


సిఫారసు ఉంటే.. ఠంచనుగా..

 ఇంతటి ఆర్థిక ఇబ్బందుల్లోనూ కొన్ని సంస్థల బిల్లుల చెల్లింపు ఎప్పటికప్పుడు జరుగుతోంది. పురపాలక శాఖలోని కీలక వ్యక్తుల పేషీల నుంచి ఫోన్లు చేయించుకుంటే వెంటనే ఆయా ఏజెన్సీల ఖాతాల్లో బిల్లులు జమవుతున్నాయి. నగరానికి చెందిన ఓ మంత్రి కాంట్రాక్టర్ల బిల్లుల కోసం తరచూ ఫోన్‌ చేస్తారని ఆర్థిక విభాగం వర్గాలు పేర్కొన్నాయి. కొవిడ్‌ కిట్‌లు సరఫరా చేసిన ఓ సంస్థకు గత రెండేళ్లలో ఏకంగా దాదాపు రూ.5 కోట్ల బిల్లులు చెల్లించారు. అంతకంటే ముందు పారిశుధ్య కార్మికులకు సరఫరా చేసిన పలు వస్తువులకు సంబంధించి రూ.30లక్షల నుంచి రూ.60 లక్షల వరకు బిల్లులు ఇప్పటికీ పెండింగ్‌లో ఉండడం గమనార్హం. ఉద్యోగులు ముద్దుగా షాడో కమిషనర్‌ అని పిలుచుకునే ఆర్థిక విభాగంలోని ఓ అధికారి కూడా బిల్లుల చెల్లింపులో అన్నీ తానై వ్యవహరిస్తుంటారని చెబుతున్నారు. ఉన్నత స్థాయి సిఫారసులని కొన్ని బిల్లులు వెంటనే చెల్లించాలని ఆదేశాలిస్తుంటారని సమాచారం. 


కాంట్రాక్టర్లు.. అప్పుల పాలు..

ఎస్‌ఆర్‌డీపీ, సీఆర్‌ఎంపీ పనులకు అప్పుగా తీసుకున్న డబ్బులతో బడాసంస్థలకు ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపు జరుగుతోంది. చిన్నా, చితక పనులు చేసిన కాంట్రాక్టర్లు మాత్రం నెలల తరబడి బిల్లులు పెండింగ్‌ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. ‘వడ్డీ వ్యాపారి వద్ద మూడు పైసల మిత్తికి అప్పు తీసుకువచ్చా. ఏడాది అయ్యింది. ఇంకా బిల్లు రాలేదు. తెచ్చిన అప్పునకు నలభై శాతం మిత్తి అయ్యింది. పని చేస్తే మిగిలేది 10-15 శాతమే. జాప్యంతో ఆర్థిక భారం మేం భరించాల్సి వస్తోంది’ అని ఓ కాంట్రాక్టర్‌ పేర్కొన్నారు. ‘భార్య నగలు తాకట్టు పెట్టి పనులు చేశా. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో రోజూ ఇంట్లో గొడవ అవుతోంది. బంగారం లేదని కొన్ని ఫంక్షన్లకు కూడా వెళ్లడం లేదు’ అని కాంట్ర్టార్స్‌ అసోసియేషన్‌ సభ్యుడొకరు పేర్కొన్నారు. అధికారులను కలిస్తే ప్రభుత్వం నుంచి నిధులు వచ్చాక ఇస్తామని ఏడాదిగా చెబుతున్నారు. ఇప్పటికీ చెల్లింపులు మొదలు కాలేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అని కాంట్రాక్టర్‌ ఒకరు చెప్పారు. గతేడాది ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు కాంట్రాక్టర్లు చనిపోయారని తెలిపారు.

Updated Date - 2022-03-19T14:49:35+05:30 IST