GHMC కీలక నిర్ణయం.. ఆ భవనాల వద్దకు వెళ్లొద్దు.. మదింపు చేయొద్దు..!

ABN , First Publish Date - 2022-02-25T20:45:27+05:30 IST

GHMC కీలక నిర్ణయం.. ఆ భవనాల వద్దకు వెళ్లొద్దు.. మదింపు చేయొద్దు..!

GHMC కీలక నిర్ణయం.. ఆ భవనాల వద్దకు వెళ్లొద్దు.. మదింపు చేయొద్దు..!

  • బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లకు కమిషనర్‌ ఆదేశం
  • స్వీయ మదింపునకే ప్రాధాన్యం
  • అవినీతి ఆరోపణల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం
  • అయినా ఆగని అక్రమాలు
  • దరఖాస్తుల స్వీకరణ 
  • ఫిర్యాదు చేయాలంటోన్న అధికారులు

హైదరాబాద్‌ సిటీ : ఆస్తి పన్ను మదింపులో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ‘భవనాల వద్దకు వెళ్లొద్దు.. నిర్మాణ విస్తీర్ణం కొలతలు తీసుకోవద్దు..’ అంటూ తాజాగా కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత వరకు భవన యజమానులు స్వీయ మదింపు చేసుకునేలా చూడాలే తప్ప, సిబ్బంది జోక్యం ఎక్కడా ఉండకూడదని తేల్చి చెప్పినట్టు రెవెన్యూ విభాగం ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. స్వీయ మదింపు సక్రమంగా జరిగిందా, లేదా.. అన్నది ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మాత్రమే పరిశీలించాలని స్పష్టం చేసినట్టు సమాచారం. గ్రేటర్‌లో కొత్తగా నిర్మించే భవనాలకు జీహెచ్‌ఎంసీలోని ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, బిల్‌ కలెక్టర్లు ఆస్తి పన్ను మదింపు చేస్తారు. 


యజమానులు దరఖాస్తు చేసిన అనంతరం క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్మాణ విస్తీర్ణం కొలతలు తీసుకొని ఆ ఏరియా యూనిట్‌ రేట్‌ ఆధారంగా పన్ను ఎంతన్నది నిర్ధారిస్తారు. ఈ ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు కొన్నేళ్లుగా ఉన్నతాధికారులకు అందుతున్నాయి. అడిగినంత భవన యజమానులు ఇస్తే వాస్తవ విస్తీర్ణం కన్నా తక్కువగానో లేక వాణిజ్య వినియోగమున్నా నివాస కేటగిరీలోనో చూపుతూ కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు పన్ను మదింపు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉల్లంఘనలు, అనుమతి లేని నిర్మాణాలకు పన్నుకు సంబంధించిన జరిమానా విధింపులోనూ మతలబు చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో పన్ను భారీగా తగ్గి జీహెచ్‌ఎంసీకి రావాల్సిన ఆదాయంపై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వీయ మదింపునకు అవకాశమిస్తూ జోనల్‌, సర్కిళ్ల వారీగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను నియమించి పన్ను మదింపును ర్యాండమ్‌గా పరిశీలించే యోచనలో అధికారులున్నారు.


ఇతర విభాగాల అధికారులతో..

రెవెన్యూ విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బందిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో వారిని కేవలం పన్ను వసూలుకే పరిమితం చేయాలని నిర్ణయించారు. ప్రత్యక్షంగా పన్ను మదింపులో పాల్గొనకుండా ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా బిల్‌ కలెక్టర్‌, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్‌ భవనాల వద్దకు వెళ్లి పన్ను మదింపు చేసినట్టు తేలితే సస్పెండ్‌ చేస్తామని కమిషనర్‌ హెచ్చరించారని ఓ అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే సీఆర్‌ఎంపీ రోడ్లలో సర్వే కూడా ఇంజనీరింగ్‌, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, సిబ్బందితో చేయించారు. పన్ను మదింపు, వినియోగ కేటగిరీ, ఇతరత్రా వ్యత్యాసాలున్నాయని గుర్తిస్తే స్వీయ మదింపు చేసుకోవాలని సూచించారు.  సర్వే చేసి నోటీసులు ఇచ్చిన భవనాల పన్ను మదింపులోనూ బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు జోక్యం చేసుకోవద్దని సూచించడం గమనార్హం. 

మ్యుటేషన్‌ ఫైళ్లకు సంబంధించిన భవనాలనూ క్షేత్రస్థాయిలో పరిశీలించవద్దని ఆదేశించారు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్‌ అనంతరం వచ్చే సమాచారం స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత సర్కిల్‌ డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌(డీఎంసీ)కు వెళ్తుంది. నిర్ణీత కాల వ్యవధిలో ఫైల్‌ ఆమోదించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. అయినా కొన్ని సర్కిళ్లలో దోపిడీకి అలవాటుపడిన కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఇప్పటికీ తామే దరఖాస్తులు తీసుకుంటూ మదింపు చేసి అందినంతా దండుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని జీహెచ్‌ఎంసీ పౌరులకు సూచిస్తోంది.

Updated Date - 2022-02-25T20:45:27+05:30 IST