చెరువును చెరబట్టిన GHMC

ABN , First Publish Date - 2022-01-12T16:23:54+05:30 IST

చెరువులు, కుంటలను డెవలపర్లు, కబ్జాదారులు ఆక్రమించిన ఉదంతాలు ఎన్నో. ఐటీ కారిడార్‌లో మాత్రం ఓ చెరువును సాక్షాత్తూ జీహెచ్‌ఎంసీయే చెరబట్టింది. అదీ ఓ నిర్మాణ సంస్థ ప్రయోజనాల కోసం. విల్లాలు

చెరువును చెరబట్టిన GHMC

ఎఫ్‌టీఎల్‌లో రహదారి నిర్మాణం 

అల్లాపూర్‌- మాదాపూర్‌కు అనుసంధానం

0.65 కి.మీలు, రూ.8.67 కోట్లతో పనులు

ఇప్పటికే 30 శాతం పూర్తి

ఓ నిర్మాణ సంస్థకు లబ్ధి చేసేందుకు..? 

విల్లాలు నిర్మిస్తోన్న మంత్రి బంధువులు

బఫర్‌ జోన్‌లో ఉన్నాయని ఫిర్యాదులందినా పట్టించుకోని వైనం


హైదరాబాద్‌ సిటీ: చెరువులు, కుంటలను డెవలపర్లు, కబ్జాదారులు ఆక్రమించిన ఉదంతాలు ఎన్నో. ఐటీ కారిడార్‌లో మాత్రం ఓ చెరువును సాక్షాత్తూ జీహెచ్‌ఎంసీయే చెరబట్టింది. అదీ ఓ నిర్మాణ సంస్థ ప్రయోజనాల కోసం. విల్లాలు నిర్మిస్తున్న బడా సంస్థకు బహుళ ప్రయోజనాలు కలిగేలా లింక్‌ రోడ్డు ముసుగులో దర్జాగా రోడ్డు వేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.  చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో 100 అడుగుల రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మాదాపూర్‌ గుట్టల బేగంపేటలోని సున్నం చెరువును చెరబట్టి బల్దియా చేస్తున్న కబ్జాకాండ ఇది.


ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్ల పరిధిలో..

మాదాపూర్‌ పక్కనుండే గుట్టల బేగంపేట, అల్లాపూర్‌ మధ్యలో సున్నం చెరువు ఉంది. రికార్డుల ప్రకారం అల్లాపూర్‌ గ్రామ పరిధిలోకి వచ్చే ఈ చెరువు విస్తీర్ణం 32.50 ఎకరాలు. ఈ చెరువును ఆనుకొని గుట్టల బేగంపేట గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ల (13, 14)లో కొంత భూమి ఉంది. సర్వే నెంబర్‌ 13లో కొంత మేర ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌) ఉండగా, పక్కనే ఉన్న 14లో ఎకరానికిపైగా స్థలం బఫర్‌ జోన్‌ పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వం గతంలో విడుదల చేసిన జీవో-168 ప్రకారం 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువుల చుట్టూ 30 మీటర్లను (100 అడుగులు) బఫర్‌ జోన్‌గా పరిగణిస్తారు. చెరువు విస్తీర్ణం 25 ఎకరాల కంటే తక్కువుంటే బఫర్‌ జోన్‌ తొమ్మిది మీటర్లు ఉంటుంది. నిబంధనల ప్రకారం సున్నం చెరువు చుట్టూ 30 మీటర్లు అంటే దాదాపు 100 అడుగులు బఫర్‌ జోన్‌ కిందకు వస్తుంది. బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు అనుమతి లేదు. నిబంధనలు అమలు చేయాల్సిన జీహెచ్‌ఎంసీ సున్నం చెరువును చెరబడుతోంది. అల్లాపూర్‌ వైపు ఏకంగా చెరువు ఎఫ్‌టీఎల్‌లో రోడ్డు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మట్టి పోసి చదును చేశారు. మాదాపూర్‌ వైపు సర్వే నెంబర్‌-13లో ఎఫ్‌టీఎల్‌ పరిధిలో రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, 14లో బఫర్‌ జోన్‌లో మట్టి పోసి చదును చేశారు. 


ఆది నుంచీ అదే తీరు

సున్నం చెరువు పక్కనున్న గుట్టల బేగంపేట సర్వే నెంబర్‌-14లో ఓ మంత్రి బంధువుకు చెందిన నిర్మాణ సంస్థ ఖరీదైన విల్లాలు నిర్మిస్తోంది. మూడున్నరేళ్ల క్రితం చేపట్టిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అల్లాపూర్‌ నుంచి ఐటీ కారిడార్‌ లింక్‌ రోడ్డు ప్రతిపాదన వెనుక ఆ నిర్మాణ సంస్థకు ప్రయోజనం కలిగించడమే ప్రధానోద్దేశమన్న ఆరోపణలూ ఉన్నాయి. 100 అడుగుల రహదారి ఉంటే విల్లాల ధర మరింత పెరుగుతుందనే లింక్‌ రోడ్డును తెరపైకి తీసుకువచ్చారని పలువురు చెబుతున్నారు. 0.65 కి.మీల మేర రూ.8.67 కోట్లతో హైటెన్షన్‌ లైన్‌ కింద ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 30 శాతం మేర పనులు పూర్తయ్యాయని ఇంజనీరింగ్‌ విభాగం వర్గాలు పేర్కొన్నాయి. అల్లాపూర్‌ వైపు రోడ్డు నిర్మించేందుకు మట్టి పోసిన ప్రాంతంలో గతంలో నీళ్లుండేవి. వాస్తవ విస్తీర్ణంతో పోలిస్తే చెరువు గణనీయంగా తగ్గిందని, ఈ క్రమంలో ఎఫ్‌టీఎల్‌నూ కుదించారని స్థానికులు చెబుతున్నారు.


భారీ వర్షాలు కురిస్తే ప్రస్తుతం రోడ్డు నిర్మిస్తున్న ఇవతలి వైపు కూడా నీళ్లు వస్తాయంటున్నారు. ఆ నిర్మాణ సంస్థ బఫర్‌ జోన్‌లో విల్లాలు నిర్మించిందన్న ఫిర్యాదులు గతంలో అధికారులకు అందాయి. 2018లో క్షేత్రస్థాయిలో పర్యటించిన జీహెచ్‌ఎంసీ అధికారులు ఎఫ్‌టీఎల్‌ నుంచి 12 మీటర్ల దూరంలోనే నిర్మాణ సంస్థ కాంపౌండ్‌ ఉందని, సైట్‌ లోపల 18 మీటర్ల వరకు బఫర్‌ జోన్‌ ఉంటుందని అంచనా వేశారు. అప్పట్లో హడావిడి చేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోగా ఆది నుంచీ నిర్మాణ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తుండడం గమనార్హం. 

Updated Date - 2022-01-12T16:23:54+05:30 IST