బడ్జెట్‌ ఆమోదించకుండానే..!

Published: Sun, 27 Mar 2022 12:07:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బడ్జెట్‌ ఆమోదించకుండానే..!

మొదలవనున్న కొత్త ఆర్థిక సంవత్సరం

జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి

రూ.6,150 కోట్లతో 2022-23 పద్దు

చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న పాలకమండలి

ఏప్రిల్‌ 12న కౌన్సిల్‌ సమావేశం..?


హైదరాబాద్‌ సిటీ: జీహెచ్‌ఎంసీలో వింత పరిస్థితి నెలకొంది. బడ్జెట్‌కు ఆమోదం లేకుండానే ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. పాలకమండలి ఉండీ.. పద్దుకు కౌన్సిల్‌ ఆమోదం లేకపోవడం పూర్వ ఎంసీహెచ్‌, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఇదే తొలిసారి అని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.6,150 కోట్లతో బల్దియా ముసాయిదా బడ్జెట్‌ రూపొందించింది. పది రోజుల క్రితం పద్దుకు స్టాండింగ్‌ కమిటీ ఆమోదం తెలిపింది. ఇప్పటికీ కౌన్సిల్‌లో పద్దును ప్రవేశ పెట్టలేదు. మరో నాలుగు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. పాలకమండలి, సర్కారు ఆమోదం లేకుండానే బడ్జెట్‌లో అమలులోకి వస్తుండడం గమనార్హం. 


అందుకేనా..?

కౌన్సిల్‌లో ఈ దఫా పార్టీల బలాబలాల సమీకరణలు మారాయి. టీఆర్‌ఎస్‌ 56 సీట్లకు పరిమితం కాగా, బీజేపీ 47, ఎంఐఎం-44, కాంగ్రెస్‌-3 స్థానాలు దక్కించుకున్నాయి. గత పాలకమండలిలో 99 స్థానాలతో ఏకచత్రాధిపత్యం ప్రదర్శించిన అధికార పార్టీకి ఇది మింగుడుపడని విషయం. అందుకే కౌన్సిల్‌ సమావేశాల నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇప్పుడు బడ్జెట్‌లో లొసుగులు బయట పడుతాయన్న భయంతోనే కౌన్సిల్‌లో ప్రవేశపెట్టలేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసిన అనంతరం సమావేశం ముందుంచితే అంత ప్రాధాన్యం ఉండదన్నది అధికార పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే ఏప్రిల్‌ 12న కౌన్సిల్‌ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రెండు సెషన్లుగా సమావేశాలు జరగనుండగా, ప్రత్యేక సమావేశంలో బడ్జెట్‌పై, సాధారణ సమావేశంలో ప్రశ్నోత్తరాలపై చర్చ ఉంటుందని ఓ అధికారి చెప్పారు


చట్టాన్ని ఉల్లంఘిస్తూ

జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం నవంబర్‌ 10వ తేదీ నాటికి ముసాయిదా బడ్జెట్‌ను స్టాండింగ్‌ కమిటీ ముందుంచాలి. కమిటీ ఆమోదం అనంతరం జనవరి 10వ తేదీలోపు కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వానికి పద్దును పంపాలి. పాలకమండలి లేని పక్షంలో కమిషనర్‌ ఆమోదంతో సర్కారుకు బడ్జెట్‌ను పంపుతారు. బడ్జెట్‌ను పరిశీలించి.. తదనుగుణంగా రాష్ట్ర సర్కారు పద్దులో కేటాయింపులు చేస్తుంది. ప్రస్తుత పాలకమండలికి మాత్రం అదేం పట్టడం లేదు. సంస్థ చట్టాన్ని ఉల్లంఘిస్తూ పాలకమండలిలోని కీలక వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన అనంతరం మార్చి 16వ తేదీన జీహెచ్‌ఎంసీ పద్దును స్టాండింగ్‌ కమిటీ ఆమోదించడం గమనార్హం.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.