స్వీయ మదింపు.. పన్ను చెల్లింపు!

ABN , First Publish Date - 2022-08-19T06:16:07+05:30 IST

స్వీయ ఆస్తిపన్ను మదింపు జీహెచ్‌ఎంసీకి కాసులు కురిపిస్తోంది. కాలు కదపకుండా ఆన్‌లైన్‌లోనే పన్ను మందింపునకు అవకాశం కల్పించడంతో నగర పౌరులు ఆసక్తి చూపుతున్నారు.

స్వీయ మదింపు.. పన్ను చెల్లింపు!

ఫలితమిస్తున్న సంస్కరణలు 

జీహెచ్‌ఎంసీలో పెరుగుతోన్న చెల్లింపుదారులు

గతంతో పోలిస్తే ఏటా 20 వేల ఆస్తులు పన్ను పరిధిలోకి

రిజిస్ట్రేషన్‌తోపాటు..

ఈ ఏడాది ఇప్పటికే 45 వేల ఆస్తుల స్వీయ మదింపు

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):స్వీయ ఆస్తిపన్ను మదింపు జీహెచ్‌ఎంసీకి కాసులు కురిపిస్తోంది. కాలు కదపకుండా ఆన్‌లైన్‌లోనే పన్ను మందింపునకు అవకాశం కల్పించడంతో నగర పౌరులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మహానగరంలో ఆస్తి పన్ను చెల్లింపుదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతంలో ఏటా 50-60 వేల కొత్త నిర్మాణాలకు సంబంధించి మదింపు జరగగా.. గతేడాది ఆ సంఖ్య 80 వేలకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే దాదాపు 46 వేల నిర్మాణాల పన్ను మదింపు పూర్తయింది. ఏడాదిన్నరగా అమలు చేస్తోన్న సంస్కరణలవల్లేనని జీహెచ్‌ఎంసీ రెవెన్యూ విభాగం వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ప్రజలు దరఖాస్తు చేస్తేనో.. బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు వెళ్లి దరఖాస్తు తీసుకుంటేనో పన్ను మదింపు జరిగేది. ఈ క్రమంలో భవనాలు/ఫ్లాట్ల యజమానులతో కుమ్మక్కయ్యే కొందరు బిల్‌ కలెక్టర్లు/ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు పన్ను మదింపు చేయకుండా వదిలేసే వారు. దీంతో సంస్థకు కోట్ల రూపాయల నష్టం జరిగేది. నగరంలో 20 లక్షలకు పైగా నిర్మాణాలుండగా.. పన్ను చెల్లింపుదారులు 15 లక్షలు మాత్రమే ఉన్నారు. మిగతా నిర్మాణాలు పన్ను పరిధిలోకి రాకపోవడానికి కొన్ని సర్కిళ్లలో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు సరిగా లేకపోవడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు ఉన్నతాధికారులూ వాటాలు తీసుకొని మిన్నకుంటున్నారన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో పన్ను మదింపునకు తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.

సంస్కరణలతో..

జీహెచ్‌ఎంసీలో స్వీయ ఆస్తి పన్ను మదింపు కొన్నేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో ఇంట్లో కూర్చొని పన్ను మదింపు చేయవచ్చన్న విషయంపై  జీహెచ్‌ఎంసీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఇప్పటికే పన్ను చెల్లిస్తోన్న వారి మొబైల్‌ నెంబర్లకు సందేశం పంపింది. తద్వారా వారికి సంబంధించి కొత్త నిర్మాణాలు మదింపు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టవుతుందని అధికారులు చెబుతున్నారు. స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్‌ శాఖ ద్వారా పన్ను మదింపు చేయాలనే నిర్ణయం కీలకంగా మారింది. రిజిస్ర్టేషన్‌ జరిగిన వెంటనే పన్ను మదింపు జరిగేలా.. ఏరియాల వారీగా చదరపు అడుగుకు ఎంత యూనిట్‌ రేట్‌ ఉందన్న వివరాలను రిజిస్ర్టేషన్‌ శాఖకు యాక్సెస్‌ ఇచ్చారు. దీంతో రిజిస్ర్టేషన్‌ జరిగిన వెంటనే డాక్యుమెంట్‌లోని నిర్మాణ విస్తీర్ణం ఆధారంగా సబ్‌ రిజిస్ర్టార్‌ స్థాయిలోనే పన్ను మదింపు జరుగుతోంది.రిజిస్ర్టేషన్‌ జరిగిన వెంటనే పన్ను మదింపు పూర్తవుతోంది. పాత ఆస్తుల క్రయ, విక్రయాలకు అప్పటికే పన్ను చెల్లిస్తూ ఉంటే.. ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌(పీటీఐఎన్‌) ఆధారంగా రిజిస్ర్టేషన్‌ జరిగిన వెంటనే మ్యుటేషన్‌ చేస్తున్నారు. పీటీఐఎన్‌ లేకపోతే రిజిస్ర్టేషన్‌ సమయంలో జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం రెండున్నరేళ్ల పన్ను పెనాల్టీగా విధిస్తూ మదింపు చేస్తున్నారు. సాంకేతికత ఆధారంగా చేపట్టిన ఈ సంస్కరణల వల్లే ఏడాదిన్నరగా పన్ను మదింపు జరుగుతోన్న ఆస్తుల సంఖ్య పెరుగుతోందని ఓ అధికారి చెప్పారు. పన్ను మదింపులో అక్రమాలకు చెక్‌ పెట్టేలా.. గతంలోనూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణ ప్రణాళికా విభాగం జారీచేసే నిర్మాణ అనుమతుల వివరాల ఆధారంగా మదింపు చేయాలని భావించారు. ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోలేదు. 

నాలుగు నెలల్లోనే..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏటా 50 నుంచి 55 వేల కొత్త నిర్మాణాల ఆస్తి పన్ను మదింపు జరుగుతోంది. 2021-22 నుంచి నూతన పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతోంది. 2021-22లో రికార్డు స్థాయిలో 79 వేలకుపైగా కొత్త ఆస్తులకు సంబంధించి పన్ను చెల్లింపు మొదలైంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు 11వ తేదీ వరకు 45 వేలకుపైగా ఆస్తుల పన్ను మదింపు పూర్తయింది. పన్ను డిమాండ్‌ రూ. 24 కోట్లు కాగా.. ఇప్పటికే రూ. 19  కోట్లు వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం మొదలైన నాలుగు నెలల పది రోజుల్లోనే ఈ స్థాయిలో చెల్లింపుదారుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మరో ఎనిమిది నెలల్లో లక్షకు చేరువ కావచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా మదింపు జరుగుతోన్న ఆస్తులతోపాటు.. పన్ను డిమాండ్‌ కూడా అధికమవుతోంది. ఈ ఏడాదికి రూ.2 వేల కోట్ల పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటి వరకు రూ.1,030 కోట్లు వసూలైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయానికి రూ.715 కోట్లు మాత్రమే వసూలైంది. 

Updated Date - 2022-08-19T06:16:07+05:30 IST