లోపాలు..ఎవరి పాపాలు..!

ABN , First Publish Date - 2021-01-10T12:33:21+05:30 IST

గ్రేటర్‌లో యేటా రూ.1,000 కోట్లకు పైగా పనులు జరుగుతాయి. మూడేళ్లుగా పురోగతిలో ఉన్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ) వంతెనలు, అండర్‌పా్‌సలు ఇందుకు అదనం...

లోపాలు..ఎవరి పాపాలు..!

జనవరి 2020 నుంచి అక్టోబర్‌ వరకు గ్రేటర్‌ పరిధిలో జరిగిన 3,230 అభివృద్ధి, నిర్వహణ పనులను జీహెచ్‌ఎంసీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం పరిశీలించింది. ఇందులో కేవలం 35 శాతం పనులు మాత్రమే నాణ్యతా ప్రమాణాల ప్రకారం జరిగాయి. మిగతా పనులకు సంబంధించి నాణ్యత, నిర్మాణ, ఇతరత్రా లోపాలు   ఉన్నట్టు గుర్తించారు.  రూ.70 లక్షలు రికవరీ చేశారు. 


65% పనులు అంతంతే

అభివృద్ధి, నిర్వహణ పనుల్లో నాణ్యత నిల్‌

గుర్తించిన క్వాలిటీ కంట్రోల్‌

పది నెలల్లో 3,230 చోట్ల తనిఖీలు

రూ.70 లక్షలు రికవరీ


హైదరాబాద్‌ : గ్రేటర్‌లో యేటా రూ.1,000 కోట్లకు పైగా పనులు జరుగుతాయి. మూడేళ్లుగా పురోగతిలో ఉన్న వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎ్‌సఆర్‌డీపీ) వంతెనలు, అండర్‌పా్‌సలు ఇందుకు అదనం. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రధానంగా రహదారుల నిర్మాణం, నిర్వహణ, క్యాచ్‌పిట్లు, మ్యాన్‌హోళ్ల ఏర్పాటు, నాలా రిటైనింగ్‌ వాల్స్‌, రెండు పడకల ఇళ్ల నిర్మాణం వంటి పనులు జరిగాయి. ఇందులో మెజార్టీ పనులు నాణ్యతా ప్రమాణాల ప్రకారం జరగడం లేదని క్వాలిటీ కంట్రోల్‌ విభాగం గుర్తించింది. చాలా వరకు శాస్ర్తీయ లోపాలు ఉండగా, కొన్ని పనులు మాత్రం నాణ్యతారహితంగా జరుగుతున్నాయి. ఇది కూడా అంతంతమాత్రంగా నాణ్యతను పరిశీలించే సంస్థలోని క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తనిఖీ చేస్తే బయటపడ్డాయి. ఇక నిక్కచ్చిగా పరిశీలన, నివేదికలు ఇంకా ఎంత అధ్వానంగా ఉంటాయో..? 


క్వాలిటీ కంట్రోల్‌ నివేదికే కీలకం

గ్రేటర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీ చేపడుతోన్న పనులు నాణ్యత, ప్రమాణాల ప్రకారం జరుగుతున్నాయా, లేదా, అన్నది గుర్తించేందుకు సంస్థలో క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఉంది. రెండు జోన్లకు ఒక డివిజన్‌ చొప్పున మూడు డివిజన్లలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు విభాగాధిపతులుగా ఉండగా, కేంద్ర కార్యాలయంలో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ వ్యయంతో చేపట్టే పనులను ఈ విభాగం తనిఖీ చేస్తుంది. నమూనాలు సేకరించి ల్యాబ్‌ల్లో పరీక్షలు చేయించడంతోపాటు, రహదారుల కేంబర్‌ ఎలా ఉంది. శాస్ర్తీయంగా నిర్మాణం జరిగిందా, మ్యాన్‌హోళ్లు ఎలా ఏర్పాటు చేశారు, అన్న అంశాలను అధికారులు పరిశీలిస్తారు. ల్యాబ్‌ రిపోర్టులు, క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాల ఆధారంగా ఆ పనికి సంబంధించి క్వాలిటీ కంట్రోల్‌ విభాగం నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగానే తుది బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. పనుల్లో లోపం ఉంటే సరి చేసే వరకు తుది బిల్లులు చెల్లించవద్దని చెబుతారు. నాణ్యత లేకుంటే నిర్ణీత మొత్తాన్ని మినహాయించి మిగతా డబ్బులు చెల్లిస్తారు. ఎంపికైన ఇంజనీరింగ్‌ కాలేజీలు కూడా థర్డ్‌ పార్టీ ఏజెన్సీగా పనుల నాణ్యతను తనిఖీ చేస్తున్నాయి. ఈ రెండు నివేదికల ఆధారంగానే బిల్లుల చెల్లింపు జరుగుతోంది. 


1,122  పనులే బాగున్నాయ్‌..

పది నెలల్లో గ్రేటర్‌లో 3,230 పనులను క్వాలిటీ కంట్రోల్‌ విభాగం తనిఖీ చేసింది. ఇందులో 2,108 పనులకు సంబంధించి నిర్మాణ /నాణ్యత లోపాలు గుర్తించారు. 24 పనులు చేసిన కాంట్రాక్టర్ల నుంచి రికవరీకి సిఫారసు చేశారు. 2 వేలకుపైగా పనులను సరి చేయాలని పేర్కొన్నారు. 1,122 పనులు మాత్రమే బాగున్నాయని తేల్చారు. లోపాలున్న పనులను సంబంధిత సంస్థలు సరిదిద్దని పక్షంలో వారి నుంచి కూడా రికవరీ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం సిఫారసు చేస్తుంది. రికవరీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.70 లక్షలు వసూలు కాగా, మరో రూ.20 లక్షల వరకు రావాల్సి ఉందని ఓ అధికారి తెలిపారు. 

Updated Date - 2021-01-10T12:33:21+05:30 IST