ఖర్చు కోట్లు.. తొలగని పాట్లు

ABN , First Publish Date - 2021-07-23T06:44:39+05:30 IST

పీరియాడికల్‌ ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌ (పీపీఎం)

ఖర్చు కోట్లు.. తొలగని పాట్లు

మూడేళ్లలో రూ.2600 కోట్ల వ్యయం

మారని రహదారుల తీరు

2.43 లక్షల గుంతలు పూడ్చినట్లు లెక్కలు

అయినా అడుగడుగునా గుంతలే

మూడేళ్లుగా ఏటా రూ.550 నుంచి రూ.800 కోట్ల వరకు ఖర్చు

అంతకుముందు రూ.300 కోట్లలోపే

మూలాలు వెతక్కుండా పై పై పూతలు

హైదరాబాద్‌ సిటీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): 

పీరియాడికల్‌ ప్రివెంటివ్‌ మెయింటెనెన్స్‌ (పీపీఎం), కాంప్రహెన్సివ్‌ రోడ్‌ మెయింటెనెన్స్‌ ప్రోగ్రామ్‌ (సీఆర్‌ఎంపీ).. గ్రేటర్‌లో మెరుగైన రహదారుల వ్యవస్థ కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన భారీ కార్యక్రమాలు ఇవి. వీటి పేరుతో సాధారణం కంటే అధికంగా వందల కోట్లు ఖర్చయ్యాయే తప్ప.. ఫలితం కనిపించడం లేదు. ఐదేళ్లలో ఏకంగా రూ.2,600 కోట్లు వెచ్చించారు. మరో రూ.508 కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. గుంతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ తాజాగా సమర్పించిన నివేదికలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు, వర్షాకాలంలో పౌరులు ఇబ్బంది పడకుండా చేసిన ఏర్పాట్లు, అందుకు ఎంత ఖర్చయ్యిందన్నది పొందుపరిచింది. వినూత్నం, అధునాతనం అంటూ ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రయోగం చెప్పుకోవడానికి బాగానే ఉంది కానీ, ప్రయోజనం ఉండడం లేదు. భౌగోళిక స్వరూపాన్ని బట్టి రోడ్‌ డిజైన్‌, పనుల్లో నాణ్యత, ఇరువైపులా డ్రెయిన్‌లు నిర్మించకుండా వందలు, వేల కోట్లు ఖర్చు చేసినా ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. సమస్యకు మూలాలు గుర్తించి చర్యలు చేపట్టకుండా, ఎన్ని కోట్లు ఖర్చు చేసినా వృథాయే అని సూచిస్తున్నారు.


రెట్టింపైన రోడ్ల వ్యయం

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో గ్రేటర్‌ రహదారులకు నయా సొబగులు అద్దేందుకు పీపీఎంకు శ్రీకారం చుట్టింది సర్కారు. అంతకుముందు రోడ్లు పాడయ్యాక నిర్మిస్తే.. పీపీఎంలో భాగంగా ముందుగానే కార్పెటింగ్‌/రీ కార్పెటింగ్‌ చేశారు. ఇందుకోసం ఏకంగా రూ.800 కోట్లు ఖర్చయ్యాయి. ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) విధి విధానాల ప్రకారం ఒక బీటీ రోడ్డు జీవిత కాలం ఐదేళ్లు మాత్రమే. ఆ తర్వాత మళ్లీ కొత్తగా నిర్మించాల్సిందే అని జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ఐదేళ్లు పూర్తయిన, పూర్తికాని బీటీ రోడ్లను పునర్నిర్మించారు. అయినా మళ్లీ వర్షాకాలం వచ్చే సరికి యథాస్థితి ఏర్పడింది. దీంతో అధికారులు ఆ పథకాన్ని పక్కన పెట్టారు. జీహెచ్‌ఎంసీ, సంస్థలోని ఇంజనీరింగ్‌ అధికారుల వల్ల కాదని భావించిన పురపాలక శాఖ ప్రధాన రహదారులను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించింది. ఐదేళ్లపాటు 709 కి.మీల మేర రోడ్ల నిర్మాణం, నిర్వహణ బాధ్యతల కోసం రూ.1839 కోట్లు ఖర్చు చేయనుంది. ఇప్పటికే 442 కి.మీల మేర రహదారుల నిర్మాణం పూర్తయ్యిందని, రూ.450 కోట్లు వెచ్చించామని అధికారులు చెబుతున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి నగరంలో రోడ్ల కోసం చేస్తున్న ఖర్చు అమాంతం పెరిగింది. అంతకుముందు రూ.250 నుంచి రూ.300 కోట్ల వరకు ఉన్న వ్యయం నాలుగేళ్లుగా రూ.550 - రూ.800 కోట్లకు పెరిగింది. అయినా రహదారులు అధ్వానంగానే ఉన్నాయి. గుంతలు పూడ్చడం, కంకర తొలగించి మరమ్మతు చేయడం వంటివి కూడా సక్రమంగా చేయడం లేదు. సీఆర్‌ఎంపీతోనూ పూర్తిస్థాయిలో ప్రయోజనం కనిపించడం లేదని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. 


2800 కి.మీలు.. 2.43 లక్షల గుంతలు...

అధునాతన పరిజ్ఞానం, నాణ్యమైన మెటీరియల్‌ రోడ్ల నిర్మాణంలో వినియోగిస్తున్నామని ఇంజనీరింగ్‌ అధికారులు చెబుతున్నా, వర్షాలు కురిస్తే ఏర్పడుతున్న గుంతలు నాణ్యతను వెక్కిరిస్తున్నాయి. వారు చెప్పేదే నిజమైతే ఎందుకీ దుస్థితి అని ప్రశ్నిస్తున్నాయి. ఐదేళ్లలో 2.40 లక్షలకుపైగా గుంతలు పూడ్చినట్టు అధికారులు చెబుతున్నారు. 9,013 కి.మీల రహదారుల్లో బీటీ రోడ్లు 2,846 కి.మీలు మాత్రమే. మిగతా 6,167 కి.మీల మేర సీసీ రోడ్లున్నాయి. వాన పడితే బీటీ రోడ్లపై గుంతలు, కంకరతో పౌరులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతు, నిర్వహణ పనుల్లో భాగంగా గుంతలను ఎప్పటికప్పుడు పూడుస్తున్నారు. ఆరేళ్ల కాలంలో 2.43 లక్షలకుపైగా గుంతలు పూడ్చారంటే.. అడుగుకో గుంత పడినట్టే అని ఇంజనీరింగ్‌ నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు రహదారుల నిర్మాణం నిజంగా నాణ్యతతో జరుగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

Updated Date - 2021-07-23T06:44:39+05:30 IST