HYD : GHMCలో అడ్డగోలుగా పన్ను మదింపు.. ఉద్యోగుల తీరుతోనే తేడాలు..!

ABN , First Publish Date - 2022-02-08T12:01:52+05:30 IST

ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‌..

HYD : GHMCలో అడ్డగోలుగా పన్ను మదింపు.. ఉద్యోగుల తీరుతోనే తేడాలు..!

  • జరిమానాల విధింపులోనూ మతలబు
  • పీటీపీ వేదికగా ఫిర్యాదులు
  • తగ్గించాలని కోరుతూ దరఖాస్తులు
  • మార్చి 27 వరకు ప్రతీ ఆదివారం పీటీపీ

హైదరాబాద్‌ సిటీ : ఆస్తి పన్ను సమస్యల పరిష్కారం కోసం జీహెచ్‌ఎంసీ నిర్వహిస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్‌ పరిష్కారం (పీటీపీ) వేదికగా సంస్థ ఉద్యోగుల, సిబ్బంది అవినీతి, అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పన్ను మదింపులో వ్యత్యాసం, ఒకే భవనానికి ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్ల (పీటీఐఎన్‌) కేటాయింపు వంటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం నిర్వహించిన పీటీపీలో ఆస్తి పన్నుకు సంబంధించి 56 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో పన్ను మదింపు సవరణ కోసం వచ్చినవే 21 దరఖాస్తులున్నాయి. గతంలో రూ.2000-3000 ఉన్న పన్ను ఏకంగా రూ.15 వేలకు పెంచారని ఒకరు, రూ.6500 ఉన్న పన్ను రూ.22 వేలు చేశారని మరొకరు ఫిర్యాదులో పేర్కొన్నారు. 


ఇంటి నెంబర్లు, పేరు మార్పునకు సంబంధించి ఇంకొందరు ఫిర్యాదు చేశారు. మ్యుటేషన్‌ చేయకుండా నెలల తరబడి ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని, నిర్మాణ అనుమతి పత్రాలు సమర్పించినా అక్రమ నిర్మాణ (యుసీ) పెనాల్టీ మినహాయింపు ఇవ్వడం లేదని, వాస్తవ విరుద్ధంగా వేసిన పన్ను తగ్గించాలని మరి కొందరు ఫిర్యాదు చేశారు. కొన్ని సర్కిళ్లలో స్థానిక బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్ల తీరుపై పౌరులు ఫిర్యాదు చేస్తున్నారని ఓ అధికారి తెలిపారు. పన్నుకు సంబంధించి వస్తోన్న మెజార్టీ ఫిర్యాదులు ఉద్యోగుల తీరు వల్లే అని అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. మార్చి 27 వరకు ప్రతీ ఆదివారం పీటీపీ జరగనుంది.


యూనిట్‌ రేట్లు ఇలా..

గ్రేటర్‌లో భవనాల నిర్మాణ విస్తీర్ణం, ఏరియాను బట్టి ఉన్న యూనిట్‌ రేట్ల (చదరపు ఆడుగుకు పన్ను) ఆధారంగా పన్ను మదింపు చేయాలి. కానీ కొందరు బిల్‌ కలెక్టర్లు, ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు ఇష్టానికి ఆస్తిపన్ను నిర్ధారిస్తున్నారు. నివాస కేటగిరీలో కనిష్ఠంగా యూనిట్‌కు 40 పైసల నుంచి గరిష్ఠంగా రూ.1.25, వాణిజ్య కేటగిరీలో 60 పైసల నుంచి రూ.70 వరకు యూనిట్‌ రేట్‌ ఉంది. ప్రాంతం, స్థానికంగా ఉన్న రోడ్డు వెడల్పు ప్రామాణికంగా యూనిట్‌ రేట్లను పరిగణనలోకి తీసుకోవాలి. వాణిజ్య కేటగిరీలో ఉన్నప్పటికీ విద్యాసంస్థలు, ఆస్పత్రుల భవనాలకు తక్కువ యూనిట్‌ రేట్‌ ఆధారంగా పన్ను మదింపు చేస్తున్నారు. అత్యధికంగా ఏటీఎంలకు చ.అకు రూ.10 నుంచి రూ.70 వరకు యూనిట్‌ రేట్‌ ఉంది. 2007లో గ్రేటర్‌లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ సర్వే నిర్వహించింది. 20 శాతం భవనాలకు సంబంధించి అద్దె వివరాలను ఉద్యోగులు సేకరించారు. అద్దె ప్రాతిపదికన ఏరియాల వారీగా యూనిట్‌ రేట్‌ నిర్ణయించారు.

Updated Date - 2022-02-08T12:01:52+05:30 IST