GHMC లో ఎందుకింత నిర్లక్ష్యం.. అసలేం జరుగుతోంది..!

ABN , First Publish Date - 2022-03-03T13:23:55+05:30 IST

GHMC లో ఎందుకింత నిర్లక్ష్యం.. అసలేం జరుగుతోంది..!

GHMC లో ఎందుకింత నిర్లక్ష్యం.. అసలేం జరుగుతోంది..!

  • మెమోలు ఇచ్చి వదిలేస్తున్నారు..
  • పెండింగ్‌లో దరఖాస్తులు

హైదరాబాద్‌ సిటీ : టీఎస్-బీపాస్‌ అమలులో జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గడువులోపు అనుమతులు ఇవ్వకున్నా.. సంబంధిత అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పెనాల్టీ వేయాల్సిన నిర్లక్ష్యానికి మెమోలిచ్చి వివరణతో సరిపెడ్తున్నారు. ఇది పారదర్శకంగా అందాల్సిన పౌర సేవలపై ప్రభావం చూపుతోంది. ఆన్‌లైన్‌ విధానం, నయా నిబంధనలు అమలులోకి వచ్చినా జీహెచ్‌ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగంలో మాత్రం పూర్వ పద్ధతి కొనసాగుతోంది.


అయినా అంతే...

అధికార వికేంద్రీకరణతో సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లోనే మెజార్టీ భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తున్నారు. యేటా 12 నుంచి 13 వేల భవనాలకు పర్మిషన్‌ ఇస్తున్నారు. ఇందులో తక్షణ అనుమతి పొందుతోన్న దరఖాస్తులే ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. మెజార్టీ సర్కిల్‌, జోనల్‌ కార్యాలయాల్లో పోస్ట్‌ వెరిఫికేషన్‌లో ఆలస్యమవుతోంది. పలుమార్లు సంప్రదిస్తే కానీ సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించే పరిస్థితి లేదు. టీఎస్-బీపాస్‌లో ఇప్పటి వరకు 2,600లకుపైగా దరఖాస్తులు రాగా.. కేవలం 1,416 మాత్రమే ఆమోదించారు. షార్ట్‌ఫాల్‌ కారణంతో 604దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. 332 అప్లికేషన్లు వివిధ కారణాలతో తిరస్కరించారు.


ఎల్‌బీనగర్‌ జోన్‌ పరిధిలోని ఓ సర్కిల్‌లో 200 చ.గల స్థలంలో స్టిల్ట్‌ ప్లస్‌ రెండంతస్తుల భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసి తక్షణ అనుమతి పొందాడు. రెండు నెలల తరువాత కానీ అధికారిక ఆమోదముద్ర పడలేదు. కూకట్‌పల్లి జోన్‌ పరిధిలో పరిస్థితి మరీ ఘోరం. తక్షణ అనుమతి పొందినా సంబంధిత అధికారిని వచ్చి కలిస్తే తప్ప  పోస్ట్‌ వెరిఫికేషన్‌ చేయడం లేదు. ఇదే జోన్‌లోని ఓ సర్కిల్‌లో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులపై తీవ్ర ఆరోపణలున్నాయి. శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలోనూ అదే పరిస్థితి.


భవన నిర్మాణ అనుమతుల కోసం వచ్చిన అప్లికేషన్‌ తిరస్కరించిన పక్షంలో సహేతుక కారణం ఉండాలి. కానీ కారణం లేకుండా వందల సంఖ్యలో అప్లికేషన్లు తిరస్కరిస్తున్నారు. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. నిర్ణీత సమయంలో అనుమతి ఇవ్వని పక్షంలో రోజుకు రూ.1000 చొప్పున జరిమానా విధించాలని టీఎస్‌బీపాస్‌ నిబంధనల్లో ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్కరికీ పెనాల్టీ వేసిన దాఖలాలు లేవు. మెమోలు జారీ చేసి వివరణ తీసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇప్పటి వరకు ఏడెనిమిది మంది అధికారులకు మెమోలు ఇచ్చినట్టు ఓ అధికారి చెప్పారు. దీంతో నిర్మాణ అనుమతుల జారీలో జాప్యం క్రమేణా పెరుగుతోంది. హెచ్‌ఎండీఏలో ముగ్గురు అధికారులకు పెనాల్టీ విధించిన నేపథ్యంలో అధికారుల తీరు చర్చనీయాంశమైంది.

Updated Date - 2022-03-03T13:23:55+05:30 IST