కాంతమ్మ, బంధువు (ఫైల్)
నిశీధిలో ఘోరం
నిశ్చితార్థం కోసం ధర్మవరం నుంచి
బంధువులతో వెళ్తుండగా ప్రమాదం
చిమ్మచీకట్లో క్షతగాత్రుల హాహాకారాలు
తిరుపతి రుయాకు 46 మంది బాధితుల తరలింపు
తిరుపతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): అత్యాధునిక సమాచార వ్యవస్థ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లోనూ కారడవిలో, చిమ్మ చీకటిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం బాధితులకు రెండు గంటల పాటు నరకం చూపించింది. సహాయక చర్యల్లోనూ గందరగోళం ఏర్పడింది. భాకరాపేట ఘాట్ రోడ్డులో వివాహ నిశ్చితార్థ బృందం ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు లోయలో పడిన ఘటన బయటి ప్రపంచానికి తెలియడానికి అరగంట పట్టింది. ప్రమాద ఘటన పూర్తి సమాచారం తెలియడానికి రెండు గంటలకు పైగానే పట్టింది. నిటారుగా ఎత్తైన కొండలు, అగాథాలను తలపించే లోయలతో కూడిన ఘాట్ రోడ్డులో సెల్‌ఫోన సిగ్నల్స్ అందవు. దీంతో బస్సు లోయలోకి దూసుకెళ్ళిన ఘటన గురించి అరగంట పాటు ఎవరికీ తెలియలేదు. బస్సులో ప్రయాణిస్తున్న బృందంలోని ఐదుగురు అష్టకష్టాలు పడి లోయ నుంచి రోడ్డుపైకి చేరుకున్నారు. ఆ మార్గంలో వెళుతున్న వాహనదారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ప్రమాదం గురించి తెలిసింది. వాహదారులు భాకరాపేట శివార్లలోని చెక్‌పోస్టు సిబ్బందికి చెప్పడంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన పోలీసు బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని, తాళ్ళు కట్టి లోయలోకి దిగారు. ఫ్లాష్ లైట్ల వెలుగులో బస్సు పడిన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను ఒక్కొక్కరిగా రోడ్డుపైకి చేర్చే ప్రయత్నం చేశారు. బస్సు బాగా దెబ్బ తినడంతో ఎందరు చనిపోయారో, ఎందరు గాయపడ్డారో తెలియడానికి చాలా సమయం తీసుకుంది. క్షతగాత్రులు కూడా వంద అడుగుల లోతున, కటిన చీకటిలో, గాయాలతో షాక్‌లో ఉండిపోయారు. చాలాసేపటి వరకూ వివరాలూ చెప్పలేకపోయారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారు, క్షతగాత్రులు ఎందరన్న దానిపై కూడా గందరగోళం నెలకొంది. సుమారు రెండు గంటల తర్వాత పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ధారణకు వచ్చారు. చివరి సమాచారం అందే సమయానికి 46 మంది క్షతగాత్రులను రుయాస్పత్రికి తరలించారు.
ర్యాష్ డ్రైవింగ్‌తోనే ప్రమాదం
ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే బస్సు ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు ధర్మవరం నుంచి సాయంత్రం బయల్దేరిన బస్సులో (కెఎల్ 30ఏ-4995) సీటింగ్ కెపాసిటీకి మించి ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 9.30 గంటల సమయంలో బస్సు భాకరాపేట పెట్రోలు బంకు వద్ద ఆగి డీజిల్ పట్టుకుంది. ఆ సమయంలో బస్సు చాలా ర్యాష్‌గా వచ్చి ఆగడాన్ని స్థానికులు గమనించారు. డీజిల్ పట్టుకున్న అనంతరం బస్సులోని బృందం కిందకు దిగి టీ తాగాక తిరిగి ప్రయాణమయ్యారు. భాకరాపేట దాటగానే ఘాట్‌లో కూడా బస్సు ర్యాష్‌గా, వేగంగా ప్రయాణించడం వల్లే ప్రధాన లోయ వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. లోయ చివరన బండరాళ్ళను ఢీకొని ఆగిపోయింది. లోయ వంద అడుగుల లోతు వుండడం, లోయలో చివరి భాగాన రాతి బండ, పెద్ద పెద్ద బండరాళ్ళు వుండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ప్రమాదంలో బస్సు టైర్లు, యాగ్జిల్స్ కూడా ఊడిపోయి బస్సు నుంచీ విడిపోయాయి. డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భయానకంగా ప్రమాదస్థలి
ప్రమాద స్థలి భయానకంగా ఉంది. వంద అడుగుల లోతున లోయలో కళ్లు పొడుచుకున్నా కనిపించని కారు చీకటి అలుముకుని ఉంది. బస్సు నుంచి బయట పడిన వాళ్లు, సొంతంగా బయటకు వచ్చిన వాళ్లు చీకట్లో బండల మాటున, పొదలు, చెట్ల మాటున పడిపోయారు. గాయాలతో ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యం సహాయక చర్యలు చేపట్టిన వారికి గుగుర్పాటు కలిగించింది.
కలెక్టర్, ఎస్పీల సహాయక చర్యలు
ప్రమాద స్థలంలో సుమారు 200 మంది పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలకు దిగాయి. కలెక్టర్ హరినారాయణ్, తిరుపతి అర్బన ఎస్పీ వెంకట అప్పలనాయుడులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. పోలీసు బలగాలు లోయలోకి దిగి తాళ్ళు కట్టి క్షతగాత్రలను రోడ్డుపైకి చేర్చారు. సిద్ధంగా అంబులెన్సుల్లో వారిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. రుయాలో ఎమర్జెన్సీ వార్డు క్షతగాత్రులతో పూర్తిగా నిండిపోవడంతో మిగిలిన వారిని ఇతర వార్డులకు తరలించారు.
ధర్మవరంలోని పెళ్లి కుమారుడి ఇళ్లు
చేనేత కుటుంబంలో పెను విషాదం
బాధితులు మారుతీ నగర్ వాసులు, బంధువులు
ధర్మవరం, మార్చి 26: పట్టణంలోని మారుతీ నగర్‌కు చెందిన చేనేత కుటుంబం ఘోర ప్రమాదానికి గురైంది. బంధువులతో కలిసి నిశ్చితార్థానికి వెళుతుండగా చంద్రగిరి మండలం భాకరాపేట ఘాట్ రోడ్డులో బస్సు లోయలో పడింది. మారుతీనగర్‌కు చెందిన కోమల శిల్క్‌హౌస్ యజమాని మురళి, లలితమ్మ దంపతుల కుమారుడు వేణుకు చిత్తూరు జిల్లా పుత్తూరు సమీపంలోని నారాయణవనానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. నిశ్చితార్థ వేడుకల కోసం ప్రైవేటు బస్సును బాడుగకు తీసుకుని శనివారం ఉదయం 11 గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్లారు. ఇందులో మురళి, లలితమ్మ దంపతులు, పెళ్లికుమారుడు వేణు, చెల్లలు కోమల, తమ్ముడు శశికుమార్, బంధువులు కాంతమ్మ, గణేశ, సరస్వతి, సునీత, అనిత తదితరులు ఉన్నారు. బస్సులో లోయలో పడటంతో పెళ్లికుమారుడి చిన్నమ్మ కాంతమ్మ(35) మృతిచెందారు. పెళ్లికుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ధర్మవరం పట్టణంలోని బంఽధువులు తెలిపారు. మరో ఆరుగు మృతిచెందినట్లు తమకు తెలిసిందని బంఽధువులు పేర్కొన్నారు. పెళ్లి కుమారుడి ఇంటి వద్ద ఎవరూ లేరు. వేడుక కోసం ఇంటిల్లిపాది తిరుపతికి బయలుదేరారు. ప్రమాదం గురించి తెలియగానే కాలనీవాసులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. వెళ్లినవారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.