Smriti Irani: గులాం ఇప్పుడు ఆజాద్ అయ్యారు..

ABN , First Publish Date - 2022-08-28T20:01:36+05:30 IST

గులాం నబీ ఆజాద్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడటంపై రాహుల్‌ గాంధీని టార్గెట్ చేసుకుంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యలు..

Smriti Irani:  గులాం ఇప్పుడు ఆజాద్ అయ్యారు..

న్యూఢిల్లీ: గులాం నబీ ఆజాద్‌ (Ghulam nabi Azad) కాంగ్రెస్‌ పార్టీని వీడటంపై రాహుల్‌ గాంధీని టార్గెట్ చేసుకుంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti irani) వ్యాఖ్యలు చేశారు. గులాం నబీ ఆజాద్‌‌కు ఇప్పుడు ఆజాద్ (విముక్తి) లభించిందని అన్నారు. కాంగ్రెస్ సొంత నాయకత్వమే గాంధీ కుటుంబంపై విమర్శలు చేసినప్పుడు తామేమీ చేయాల్సిన అవసరం లేదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గం నుంచి రాహుల్‌పై తాను గొలుపొందిన విషయాన్ని స్మృతి ఇరానీ పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఆజాద్‌కు ఇప్పుడు విముక్తి (Azad) లభిస్తే, అమేథీకి (రాహుల్ గాంధీ గత పార్లమెంటరీ నియోజకవర్గం) ఎప్పుడో విముక్తి లభించిందని అన్నారు. అమేథీ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సొంత నియోజకవర్గంగా పేరుంది. గతంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు.


కాగా, కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల అనుబంధాన్ని గత శుక్రవారంనాడు ఆజాద్ తెగతెంపులు చేసుకున్నారు. కన్సల్టేటివ్ యంత్రాంగాన్ని రాహుల్ గాంధీ పూర్తిగా కుప్పకూల్చారని, 2014 ఎన్నికల్లో పరాజయానికి ఆయనే బాధ్యుడని ఆజాద్ విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ప్రతి విమర్శలు గుప్పిస్తూ, పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి, రాజ్యసభ పదవీకాలం ముగియడంతో ఇప్పుడు ఆజాద్ తన నిజస్వరూపం బయటపెట్టారని మండిపడింది. బీజేపీకి దగ్గరవుతున్నారనే పరోక్ష సంకేతంతో...ఆజాద్ 'మోడి-ఫైడ్' అంటూ విమర్శించింది.

Updated Date - 2022-08-28T20:01:36+05:30 IST