Ghulam Nabi Azad: పది రోజుల్లో కొత్త పార్టీ

ABN , First Publish Date - 2022-09-11T19:47:39+05:30 IST

కొత్త పార్టీ ఏర్పాటు ఎప్పుడనే విషయంలో సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్..

Ghulam Nabi Azad: పది రోజుల్లో కొత్త పార్టీ

బారాముల్లా: కొత్త పార్టీ ఏర్పాటు ఎప్పుడనే విషయంలో సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్ (Ghulam nabi azad) తెరదించారు. మరో పది రోజుల్లో కొత్త పార్టీని (New party) ప్రకటించనున్నట్టు ఆయన తెలిపారు. బారాముల్లాలో ఆదివారంనాడు జరిగిన బహిరంగ సభలో ఆ విషయం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పనితీరు, సంస్థాగత వ్యవహారాలపై పలుమార్లు నిలదీస్తూ వచ్చిన 73 ఏళ్ల ఆజాద్ గత నెలలో ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై విమర్శలు గుప్పిస్తూనే, తమ రక్తంతో పార్టీ ఏర్పడిందని, ఇవాళ తమ మాటకు విలువలేకుండా పోయిందని, తమ సూచనలు, సలహాలను ఏళ్ల తరబడి ఏఐసీసీ మూలనపెట్టేసిందని సోనియాగాంధీకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.


కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసిన తరువాత సొంత బలాన్ని నిరూపించుకునేందుకు తనకు కంచుకోటలాంటి బారాముల్లాను ఆయన తొలిసారి వేదికగా చేసుకున్నారు. కాంగ్రెస్‌ను వదలగానే తన మద్దతుదారులు అనేక రెట్లు పెరిగారని చెప్పారు. జమ్మూలోని 30 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన సుమారు 400 మంది ప్రతినిధులను తాను కలుసుకున్నానని, వారంతా తాను ఏర్పాటు చేసే పార్టీకి మద్దతు ప్రకటించారని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, స్థానికులకు భూమి హక్కు, ఉపాధి హక్కు కోసం తమ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. జమ్మూకశ్మీర్‌కు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. బారాముల్లా ర్యాలీ తర్వాత ఆయన కుప్వారా, సౌత్ కశ్మీర్‌లో వరుసగా ర్యాలీలు నిర్వహించనున్నారు. తొలి ర్యాలీ బారాముల్లాలో ప్రారంభించడం ద్వారా ఆ ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని ఆయన పటిష్టం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2022-09-11T19:47:39+05:30 IST