కానుకలు కొందరికే!

ABN , First Publish Date - 2022-07-05T05:40:56+05:30 IST

జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సమస్యలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఒకవైపు వసతుల లేమితో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ఇక్కట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విద్యాకానుక కిట్లు అరకొరగానే సరఫరా అయ్యాయి. బ్యాగులు, యూనిఫాం, బూట్లు, బెల్టుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి పాఠశాలకు కొన్ని వస్తువలు తక్కువగా పంపారు.

కానుకలు కొందరికే!


అరకొరగా విద్యా కానుక కిట్లు 

27 మండలాలకు యూనిఫాం లేదు

9.32 శాతం మందికే బూట్లు

పూర్తిస్థాయిలో అందని బ్యాగులు, బెల్ట్‌లు 

పాఠ్యపుస్తకాలకూ కొరత

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం

ఒంగోలు (విద్య), జూలై 4 :

పాఠశాలల పునఃప్రారంభం నాడే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. జిల్లాలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు మంగళవారం నుంచి తెరుచుకొంటున్నాయి. ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, ముందస్తు ప్రణాళిక లోపించడంతో ఈసారి నెల ఆలస్యంగా విద్యాసంస్థలు పునఃప్రారంభమవుతున్నాయి. అయినప్పటికీ అరకొరగానే విద్యా కానుక కిట్లు అందాయి. విద్యార్థులకు బూట్లు 9.32శాతం, యూనిఫాం 27.74శాతం, బ్యాగులు 74.40శాతం మాత్రమే ఇప్పటి వరకూ సరఫరా చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. బూట్లు కేవలం మూడు మండలాలకు మాత్రమే అందాయి. యూనిఫాం కొన్ని మండలాలకే పరిమితమైంది. దీంతో మంగళవారం విద్యాకానుక కిట్లను మొక్కుబడిగా పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.  


 జిల్లావ్యాప్తంగా విద్యా సంస్థలు మంగళవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సమస్యలు మాత్రం యథాతథంగా ఉన్నాయి. ఒకవైపు వసతుల లేమితో విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో ఇక్కట్లు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు విద్యాకానుక కిట్లు అరకొరగానే సరఫరా అయ్యాయి.  బ్యాగులు, యూనిఫాం, బూట్లు, బెల్టుల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రతి పాఠశాలకు కొన్ని వస్తువలు తక్కువగా పంపారు. ఎక్కువ చోట్ల బ్యాగుల కొరత ఉందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. బూట్లు కూడా సరిపడా రాలేదంటున్నారు. మరోవైపు పాఠ్యపుస్తకాలు కూడా పూర్తిస్థాయిలో అందకపోవడంతో ఉపాధ్యాయులు తలలుపట్టుకుంటున్నారు. 

2.40 లక్షల మంది విద్యార్థులు 

జిల్లాలోని 38 మండలాల్లోని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు 2,40,129 మంది ఉన్నారు. వీరందరికీ ఈ విద్యా సంవత్సరం జగనన్న విద్యా కానుక కిట్లను అందించాల్సి ఉంది. ఈ కిట్‌లో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్‌, బూట్లు, సాక్సులు, బెల్టు, 1నుంచి 5 తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు బొమ్మల డిక్షనరీలు, 6నుంచి 10 చదువుతున్న వారికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు, ఒక్కో విద్యార్థికి మూడుజతలు యూనిఫాం, స్కూలు బ్యాగు ఉంటాయి. మంగళవారం నుంచి కిట్లు అందించాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వీ ఆదేశాలు జారీ చేశారు. మొదటి రోజు నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. దీంతో పాఠశాలలో విద్యాబోధనకు ఆటంకం లేకుండా రోజుకు 30నుంచి 40 మందికి కిట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. 

అరకొరగానే సామగ్రి పంపిణీ

అందిన సమాచారం మేరకు విద్యా కానుక సామగ్రి అరకొరగానే మండలాల్లోని పాఠశాలలకు చేరింది. జిల్లాలోని 38మండలాల్లో చదువుతున్న మొత్తం 2,40,129 మంది విద్యార్థులకు జత బూట్లు, రెండు జతల సాక్సులు సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం ఒంగోలు, కొత్తపట్నం, టంగుటూరు మండలాల్లోని 22,389 మందికి మాత్రమే సరఫరా చేశారు. మిగిలిన వారికి ఎప్పటికి అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. 

 జిల్లాలో ఒక్కో విద్యార్థికి మూడు జతల చొప్సున యూనిఫాం అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు కేవలం 66,602 (27.74శాతం) మందికి  సరఫరా చేశారు. చీమకుర్తి, కొండపి, కొత్తపట్నం, మద్దిపాడు, మర్రిపూడి, నాగులుప్పలపాడు, ఒంగోలు, పొన్నలూరు, సంతనూతలపాడు, టంగుటూరు, జరుగుమల్లి మండలాలకు మాత్రమే ఇవి అందాయి. మిగిలిన 27మండలాల్లో 130 మందికి చొప్పున సరఫరా చేశారు.

బ్యాగులు తొమ్మిది మండలాలకే అందాయి. ఇప్పటి వరకు 1,78,649 మంది విద్యార్థులకు మాత్రమే వచ్చాయి. కంభం, కొత్తపట్నం, ముండ్లమూరు, పీసీ పల్లి, పామూరు, రాచర్ల, తాళ్లూరు, తర్లుబాడు, వెలిగండ్ల మండలాలకు సరఫరా కాలేదు.

బెల్టులు పది మండలాలకు మాత్రమే ఇచ్చారు. అర్ధవీడు, కంభం, గిద్దలూరు, హనుమంతుపాడు, కొమరోలు, మార్కాపురం, పెదదోర్నాల, పుల్లలచెరువు, త్రిపురాంతకం, వైపాలెం మండలాలకు ఒక్క బెల్టు కూడా సరఫరా కాలేదు.


పాఠ్యపుస్తకాలకు కొరత 

జిల్లాలో 23,71,675 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ గతంలో మిగిలి ఉన్నవి, ఈ ఏడాది ప్రభుత్వం నుంచి వచ్చినవి 18,92,410 వచ్చాయి. మరో 4,79,265 రావాల్సి ఉంది. ఇప్పటి వరకూ మండలాలకు 13,73,180 సరఫరా చేశారు. ఈ ఏడాది 8వ తరగతి సిలబస్‌ మారింది. అయితే అందుకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క పుస్తకం కూడా రాలేదు. మిగిలిన తరగతులకు పూర్తిస్థాయిలో అందలేదు. కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అసలు అందలేదు. అందులోనూ వర్క్‌బుక్‌ వస్తే పాఠ్య పుస్తకం, పాఠ్యపుస్తకం వస్తే, వర్క్‌బుక్‌ రాలేదు. 



విద్యా కానుక సామగ్రి వివరాలు

సామగ్రి పేరు మొత్తం రావాల్సినవి ఇప్పటివరకు వచ్చినవి శాతం

నోటుపుస్తకాలు 12,53,614 12,53,614 100

బెల్టులు 1,78,522 1,17,507 65.82

బూట్లు 2,40,129 22,389 9.32

యూనిఫాం 2,40,129 66,602 27.74

బ్యాగులు 2,40,129 1,78,649 74.40


Updated Date - 2022-07-05T05:40:56+05:30 IST