Ginormous eruption: సూర్యునిపై అత్యంత భారీ విస్ఫోటనం... 3.25 లక్షల కి.మీ. దూరాన్ని ముంచేసే స్థాయిలో ప్లాస్మా...

ABN , First Publish Date - 2022-08-03T21:28:48+05:30 IST

సూర్యుని తూర్పు భాగం (sun's eastern limb)లో అత్యంత

Ginormous eruption: సూర్యునిపై అత్యంత భారీ విస్ఫోటనం... 3.25 లక్షల కి.మీ. దూరాన్ని ముంచేసే స్థాయిలో ప్లాస్మా...

న్యూఢిల్లీ : సూర్యుని తూర్పు భాగం (sun's eastern limb)లో అత్యంత భారీ విస్ఫోటనం సంభవించింది. దీని నుంచి వెలువడుతున్న ప్లాస్మా (Plasma) భూమి నుంచి చంద్రుని వరకు ఉన్న దూరంలో  విస్తరించే స్థాయిలో ఉంది. దీనిని వర్ణించడానికి శాస్త్రవేత్తలకు మాటలు కనిపించడం లేదు. అందుకే దీనిని గినార్మస్ ఇరప్షన్ (Ginormous eruption) అంటున్నారు. అయితే దీని ప్రభావం భూమిపై ఉండబోదని భరోసా ఇస్తున్నారు. 


సాధారణంగా పదార్థాలను ఘన, ద్రవ, వాయు స్థితుల్లో చెబుతారు. వీటి తర్వాత నాలుగో స్థితి ప్లాస్మా. దీనిలో అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతతో కూడిన వాయువు ఉంటుంది. దీనిలోని అణువులు ఎలక్ట్రాన్లు, అయాన్లుగా విడిపోతాయి. ఇవి దేనికదే స్వతంత్రంగా కదులుతాయి. 


కెంటకీ, నికొలస్‌విల్లేలోని ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ ఎన్ ష్రాంట్జ్ (Richard N Schrantz) సూర్యునిపై భారీ విస్ఫోటనాన్ని గుర్తించారు. ఇది విపరీతమైన తీవ్రతగలదని గమనించారు. దీనిని గినార్మస్ అని పేర్కొన్నారు. ఇది అంతరిక్షంలో 3,25,000 కిలోమీటర్ల దూరం విస్తరించినట్లు తెలిపారు. దాదాపు భూమి-చంద్రుడు మధ్య ఉన్నంత దూరం వ్యాపించిందని వివరించారు. 


సౌర కదలికలను, సోలార్ సైకిల్‌ను పరిశీలించే స్పేస్‌వెదర్.కామ్ (Spaceweather.com) ఈ గినార్మస్ చిత్రాలను విడుదల చేసింది. దీని కుడి భాగం చాలా అస్థిరంగా ఉందని, ఇది ఏ క్షణంలోనైనా కుప్పకూలవచ్చునని తెలిపింది. ఇది సూర్యునికి వేరొక వైపున ఉండటం వల్ల దీని ప్రభావం భూమిపై ఉండబోదని పేర్కొంది. 


కాంతి నేరుగా పడే వైపున ఇది లేనందువల్ల టెలిస్కోపులను ఉపయోగించి అమెచ్యూర్ ఆస్ట్రనామర్స్ ఈ ప్లాస్మాను చూడవచ్చు. మన సౌర వ్యవస్థలో సూర్యుని ఈశాన్య భాగంలో భారీ విస్ఫోటనాన్ని ఆస్ట్రనామర్స్ గత వారం గుర్తించారు. ఇది చూడటానికి అస్పష్టంగా ఉంది. ఈ పేలుడు అత్యంత శక్తిమంతమైనది అయినప్పటికీ, సూర్యుని నుంచి ఈ ప్రభావం భూమిపై పడే అవకాశం లేదని నిపుణులు చెప్పారు. 


ఇదిలావుండగా, సన్‌స్పాట్ ఏఆర్3068 వేగంగా పెరుగుతోంది. బీటా-గామా అయస్కాంత క్షేత్రం వృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దీనివల్ల మధ్యతరహా జ్వాలలు రేగుతాయి. భూమిపైగల ధ్రువ ప్రాంతాలపై ప్రభావం చూపగలిగే స్వల్ప రేడియో బ్లాక్‌అవుట్స్ ఏర్పడతాయి. సన్‌స్పాట్ నేరుగా భూమికి ఎదురుగా ఉందని, అందువల్ల పేలుళ్ళు జరిగితే భూమిపై ప్రభావం చూపుతాయని స్పేస్‌వెదర్ చెప్పింది. 


Updated Date - 2022-08-03T21:28:48+05:30 IST