గిరి రైతు ఆర్థిక ప్రగతికి అగ్రి టూరిజం

ABN , First Publish Date - 2022-09-24T06:49:58+05:30 IST

గిరిజన రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అగ్రి టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్టు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు.

గిరి రైతు ఆర్థిక ప్రగతికి అగ్రి టూరిజం
కరపత్రాలు, పుస్తకాలను ఆవిష్కరిస్తున్న ఉప కులపతి డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి, విశ్వవిద్యాలయం అధికారులు, శాస్త్రవేత్తలు

లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో పర్యాటకులు ఒక రోజు బసచేసేలా ఏర్పాట్లు

వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుతో రైతులకు గిట్టుబాటు ధర

అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పూలసాగు

తులిప్‌పై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పరిశోధనలు

ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ విష్ణువర్దన్‌రెడ్డి


చింతపల్లి, సెప్టెంబరు 23: గిరిజన రైతుల ఆర్థిక ప్రగతి లక్ష్యంగా అగ్రి టూరిజంను అభివృద్ధి చేస్తున్నట్టు ఆచార్య ఎన్‌జీరంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ఎ.విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విస్తరణ సంచాలకులు డాక్టర్‌ ఎల్‌.ప్రశాంతి అధ్యక్షతన అగ్రి టూరిజంపై జరిగిన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో రైతు కుటుంబాల ఆదాయం చాలా తక్కువగా ఉందని, రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు గరిష్ఠ ధర అందించాలనే లక్ష్యంతో అగ్రి టూరిజం కార్యక్రమానికి రూపకల్పన చేశామని చెప్పారు. రైతుల సగటు ఆదాయం పెంపు, అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల అభివృద్ధి, సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలను ప్రధానంగా చేసుకుని శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారన్నారు.

లంబసింగి ప్రాంతానికి పర్యాటకులు శీతాకాలంలో మాత్రమే వస్తున్నారని, అదే రోజు తిరుగుముఖం పడుతున్నారని ఆయన అన్నారు. అగ్రి టూరిజంను అభివృద్ధి చేస్తే పర్యాటకులు కుటుంబ సమేతంగా వచ్చి లంబసింగి, చింతపల్లి ప్రాంతాల్లో ఒకరోజు బస చేసేందుకు ఆసక్తి చూపుతారని వీసీ అభిప్రాయపడ్డారు. అలాగే ఏడాది పొడవునా పర్యాటకులు ఈ ప్రాంతాలను సందర్శించే అవకాశముందన్నారు. ఇదే సమయంలో గిరిజనులు పండించిన సేంద్రీయ వ్యవసాయ, ఉద్యానవన ఉత్పత్తులను  కొనుగోలు చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. దీనివల్ల ఆదివాసీ రైతులకు గరిష్ఠ ధర లభిస్తుందన్నారు.  దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా అగ్రి టూరిజంకు రూపకల్పన చేశామని ఆయన తెలిపారు. అగ్రి టూరిజం నిరంతరం కొనసాగించే విధంగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని, నవంబరులో గుంటూరులో రాష్ట్రస్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నామన్నారు. 


పర్యాటక ప్రాంతాల్లో పూల సాగు

పర్యాటక ప్రదేశాలైన అరకులోయ, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో పూల సాగు చేపట్టనున్నట్టు విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. గ్లాడియోలస్‌, జర్బరా, చైనా ఆస్టర్‌, మేరీగోల్డ్‌ తదితర రకాల పూల మొక్కలను గత ఏడాది బెంగళూరు, కశ్మీర్‌ నుంచి దిగుమతి చేసుకుని చింతపల్లి పరిశోధన స్థానంలో  ప్రయోగాత్మకంగా సాగుచేపట్టామన్నారు. బెంగళూరు కంటే నాణ్యమైన పూల దిగుబడి వచ్చిందన్నారు. ఈ ఏడాది అరకు, పాడేరు, లంబసింగి ప్రాంతాల్లో ఆదివాసీ రైతులతో పూల తోటలు సాగు చేయించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 

తులిప్‌ సాగుపై పరిశోధనలు

ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చల్లటి వాతావరణం ఉండడంతో తులిప్‌ పూలమొక్కల సాగుపై చింతపల్లిలో పరిశోధనలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ప్రయోగాత్మక సాగు కోసం కశ్మీర్‌ నుంచి మొక్కలను దిగుమతి చేసుకున్నామని, సాగు విజయవంతమైతే చింతపల్లికి పర్యాటకులు క్యూ కడతారని అన్నారు. రానున్న రోజుల్లో అల్లూరి జిల్లాలో పూలసాగును విస్తరించడం, మార్కెటింగ్‌ సదుపాయం కల్పించడం, పూలను ఎగుమతి చేయడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. గంజాయికి ప్రత్యామ్నయంగా పూల సాగు జరగాలన్నది తమ లక్ష్యమన్నారు. 


టూరిజం స్పాట్‌గా ఆర్‌ఏఆర్‌ఎస్‌

ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతున్నట్టు స్థానిక ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.సరేశ్‌కుమార్‌ తెలిపారు. లంబసింగి వచ్చే పర్యాటకులు చింతపల్లి పరిశోధన స్థానాన్ని కూడా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తన్నామన్నారు. పర్యాటకులు దుక్కి దున్నడం, దమ్ము పట్టడం, వరి నాట్లు వేయడం వంటి పనులను సరదాగా చేయవచ్చని, పూలు, వ్యవసాయ పంటలను తిలకించే చర్యలు చేపడతామన్నారు. పర్యాటకులు బస చేసేందుకు అతిథిగృహం కూడా అందుబాటులో ఉందన్నారు. రానున్న రోజుల్లో ఆర్‌ఏఆర్‌ఎస్‌ను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు రూపొందించిన ‘అగ్రి టూరిజం’, ‘ఉన్నత పర్వత శ్రేణి గిరిజన మండలంలో విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు’ కరపత్రాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. వలిసె గింజల నుంచి నూనె తీసే యంత్రాన్ని ప్రారంభించారు. ఈ సదస్సులో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ గుత్తా రామారావు, నాబార్డు అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, టూరిజం అధికారులు, విశాఖపట్నం, లంబసింగి, నర్సీపట్నం ప్రాంతాలకు చెందిన టూరిజం వ్యాపారలు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-24T06:49:58+05:30 IST